హానికరమైనవి వద్దు! సినీపరిశ్రమల్ని అభ్యర్థించిన భారత రాష్ట్రపతి!!
చాలా మంది యువకులు, పిల్లలు ఆరాధించే ప్రముఖ నటీనటులు సమాజంపై బలమైన ప్రభావాన్ని చూపుతారని రాష్ట్రపతి అన్నారు.
By: Sivaji Kontham | 23 Sept 2026 1:30 PM ISTగుజరాత్‌లోని ఏక్తా నర్‌లో మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుకలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సినీ పరిశ్రమకు కీలకమైన దిశానిర్దేశం చేశారు. గతంలో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగే ఈ వేడుకలను దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు విస్తరించే సంప్రదాయంలో భాగంగా ఈసారి ఏక్తా నగర్‌లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్రపతి ముర్ము, చిత్ర పరిశ్రమ సమాజంపై.. ముఖ్యంగా యువతపై చూపే ప్రభావం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
చాలా మంది యువకులు, పిల్లలు ఆరాధించే ప్రముఖ నటీనటులు సమాజంపై బలమైన ప్రభావాన్ని చూపుతారని రాష్ట్రపతి అన్నారు. ఆ ప్రభావం సానుకూలంగా ఉండాలి తప్ప.. ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలను ప్రోత్సహించేలా ఉండకూడదని కూడా గుట్కా పాన్ మసాలాలకు ప్రమోషన్ చేసే హీరోలకు గట్టిగా హితవు పలికారు. విజయవంతమైన కళాకారులు క్రమశిక్షణతో కూడిన, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించాలని.. హానికరమైన పదార్ధాలను ఎండార్స్ చేయడాన్ని నివారించాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. క్రూరంగా, ఘోరంగా హత్యలు చేయడాన్ని లేదా కిరాతకాన్ని హీరోయిజంగా చూపించడం కూడా తగ్గించుకోవాలని పరోక్షంగా ముర్ము సూచించారు. ఆదర్శ రాముడిలా హీరోను చూపించకపోయినా.. చెడును సాధ్యమైనంత తక్కువగా ప్రదర్శించాలని తన వచనంలో అభిప్రాయపడ్డారు.
అలాగే ఒకప్పట్లా కుటుంబసమేతంగా చూడదగ్గ ఆహ్లాదకరమైన సినిమాలను ప్రేక్షకులు మళ్లీ చూడలేరా అని ముర్ము పరోక్షంగా ప్రశ్నించారు. ఇదే వేదికపై సృజనాత్మక రంగంలో పనిచేస్తున్న అసిస్టెంట్లు, చిన్న కళాకారులు.. పరిశ్రమలో స్థిరపడటానికి తీవ్రంగా పోరాడుతున్న కార్మికుల సంక్షేమం గురించి కూడా రాష్ట్రపతి ప్రస్తావించారు. క్రియేటివ్ ఎకానమీలో శ్రమించే ఇలాంటి కార్మికులకు మరింత గౌరవం, సామాజిక భద్రత కల్పించాలని పిలుపునిచ్చారు. ఇక ఈ వేడుకలో పలువురు ప్రముఖులకు అవార్డులు దక్కగా.. వెటరన్ కన్నడ నటుడు అనంత నాగ్‌కు ప్రతిష్టాత్మకమైన 2024 సంవత్సరపు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేశారు.
అలాగే `ఆర్టికల్ 370` ఉత్తమ ఫీచర్ ఫిలింగా ఎంపిక కాగా `చందూ ఛాంపియన్` చిత్రానికి గాను కార్తీక్ ఆర్యన్ ఉత్తమ నటుడిగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. దేశంలోని పర్యాటక ప్రాంతాలను సంస్కృతితో అనుసంధానించాలనే ప్రభుత్వ లక్ష్యంతో ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఏక్తా నగర్‌లో నిర్వహించగా.. మునుముందు రోజుల్లో ఇలాంటి వేడుకలను పర్యాటక కేంద్రాల్లోనే నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అక్టోబర్ 2027లో తదుపరి ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES) జరగనుందని కూడా ఈ సందర్భంగా ప్రకటించారు. ద్రౌపది ముర్ము భారతదేశానికి 15వ రాష్ట్రపతి అనే విషయం తెలిసినదే.
