హిట్ ప్రాంచైజీ.. నాల్గవ మూవీ కన్ఫర్మ్
మలయాళ సూపర్ హిట్ ప్రాంచైజీ 'దృశ్యం' నుంచి ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే.
By: Ramesh Palla | 24 Aug 2026 4:00 PM ISTమలయాళ సూపర్ హిట్ ప్రాంచైజీ 'దృశ్యం' నుంచి ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే. ఒక కథకు కొనసాగింపు అన్నట్లుగా మూడు సినిమాలు సాగాయి. మూడో పార్ట్‌తో దృశ్యం ప్రాంచైజీ కథ ముగుస్తుందని అంతా భావించారు. కానీ దర్శకుడు జీతూ జోసెఫ్ ఇంకా రెండు మూడు పార్ట్‌లు తీయాలని బలంగా భావిస్తున్నట్లుగా ఉన్నాడు. అందుకే మూడో పార్ట్‌లోనూ సినిమా కథను ముగించకుండా సస్పెన్స్‌లోనే ఉంచాడు. దాంతో నాల్గవ పార్ట్ ఎప్పుడు ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల హీరో మోహన్ లాల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దృశ్యం నాల్గవ పార్ట్ మాత్రమే కాకుండా ఐదవ పార్ట్ సైతం ఉండే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. ఇదే సమయంలో మలయాళ మీడియాలో దృశ్యం 4 కి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి అంటూ వార్తలు మొదలు అయ్యాయి.
జీతూ జోసెఫ్ దృశ్యం 4 రెడీ...
దృశ్యం 3 సినిమాకు మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. పైగా మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబో కి అభిమానులు పెరిగారు. జార్జ్ కుట్టి పాత్రతో మలయాళ ప్రేక్షకులు ఇప్పటికే బాగా కనెక్ట్ అయ్యారు. ఇతర భాషల్లోనూ దృశ్యంను ఒరిజినల్ వర్షన్ ను డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. దృశ్యం 1, దృశ్యం 2 ను తెలుగులో వెంకటేష్ చేసిన విషయం తెల్సిందే. కానీ దృశ్యం 3 ను మాత్రం మోహన్ లాల్ నటించిన వర్షన్‌ను డబ్ చేసి విడుదల చేయడం జరిగింది. కనుక దృశ్యం 4ను రీమేక్ చేస్తారు అనుకోవడం లేదు. ఈ మధ్య కాలంలో భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల సినిమాలు డబ్ అయ్యి మంచి వసూళ్లు నమోదు చేస్తున్నాయి. దృశ్యం 3 సైతం తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు నమోదు చేసింది. వెంకటేష్ నటించిన దృశ్యం సినిమాకు ఏమాత్రం తగ్గకుండా దృశ్యం 3 తో మోహన్ లాల్ వసూళ్లు రాబట్టుకున్నాడు. అందుకే దృశ్యం 4 పైనా అంచనాలు ఉన్నాయి.
మోహన్ లాల్ హీరోగా దృశ్యం...
దర్శకుడు జీతూ జోసెఫ్ ఇప్పటికే నాల్గవ పార్ట్‌కు సంబంధించిన కథను రెడీ చేశాడని, త్వరలోనే మోహన్ లాల్‌తో ఫైనల్ చేయించుకుని స్క్రిప్ట్ ఫైనల్ చేసి షూటింగ్ మొదలు పెట్టబోతున్నాడు అంటూ ప్రముఖ మలయాళ సినీ పోర్టల్‌లో కథనం వచ్చింది. దాంతో దృశ్యం 4 పై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే మలయాళ సినీ ప్రేక్షకులతో పాటు, అన్ని భాషల సినీ ప్రేక్షకులు దృశ్యం 4 సినిమాను 2027లోనే చూసే అవకాశం ఉంది. మోహన్ లాల్ దృశ్యంతో పాన్ ఇండియా స్టార్‌డం దక్కించుకున్నాడు. అందుకే దృశ్యం 4 పాన్ ఇండియా రేంజ్‌లో భారీ ఎత్తున బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయి అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దృశ్యం 4 ప్రకటన రావడమే ఆలస్యం ప్రముఖ ఓటీటీలు డిజిటల్ రైట్స్ ను దక్కించుకునేందుకు పోటీ పడే అవకాశాలు ఉన్నాయి.
నాల్గవ పార్ట్‌తో రాబోతున్న దృశ్యం...
ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం చేసే ప్రయత్నమే దృశ్యం. మొదటి పార్ట్‌లో ఒక హత్యతో ప్రారంభం అయిన కథ మూడు పార్ట్‌ల వరకు ఆ కేసుకు సంబంధించిన విచారణ, ప్రతీకారం చుట్టూ తిరుగుతూ వచ్చాయి. మూడో పార్ట్‌లో కేసును తుది దశకు తీసుకు వెళ్లినట్లుగా అనిపించింది. కానీ చివర్లో ట్విస్ట్ ఇచ్చారు. నాల్గవ పార్ట్‌లో మరింత ఆసక్తికరంగా కథ సాగే అవకాశాలు ఉన్నాయి. దృశ్యం మొదటి పార్ట్ వచ్చి దశాబ్దం దాటుతున్నా ఇప్పటికీ ప్రాంచైజీకి ఈ స్థాయి క్రేజ్ ఉండటానికి కారణం దర్శకుడు జీతూ జోసెఫ్ జనరేషన్‌కు తగ్గట్లుగా కథను అల్లడం అని చెప్పుకోవచ్చు. కథలో వచ్చే టిస్ట్‌లు ఏమాత్రం తగ్గలేదు. నాల్గవ పార్ట్‌తో మరోసారి దర్శకుడు జీతూ జోసెఫ్ సర్‌ప్రైజ్ చేస్తాడా అనేది చూడాలి.
