దృశ్యం 3: తెలుగులో సౌండ్ లేదేంటి? అలా చేసి ఉంటే మారేదా?
ఇక రెండో భాగం కూడా మలయాళంలో విడుదలై మరోసారి మంచి ప్రశంసలు అందుకుంది. తెలుగు వెర్షన్ నేరుగా ఓటీటీలో విడుదలైనప్పటికీ మంచి వ్యూస్ దక్కించుకుంది.
By: M Prashanth | 20 May 2026 4:31 PM ISTసస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ మూవీలకు ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. అలాంటి సినిమాల్లో ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఫ్రాంచైజీ దృశ్యం. కుటుంబ కథలా ప్రారంభమై ఊహించని ట్విస్టులతో ముందుకు సాగే ఆ ఫ్రాంచైజీ ఫస్ట్ పార్ట్ నుంచీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సాధారణ వ్యక్తి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు వేసే తెలివైన ప్లాన్లు, పోలీసులను మభ్యపెట్టే సన్నివేశాలు దృశ్యం ఫ్రాంచైజీని మరింత ఆసక్తికరంగా మార్చాయి.
మలయాళంలో మోహన్ లాల్ హీరోగా దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. తర్వాత అదే మూవీని తెలుగులో రీమేక్ చేశారు. తెలుగులో వెంకటేష్ లీడ్ రోల్ లో నటించగా, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా వెంకటేష్ నటన, ఆయన బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ సీన్స్ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. దీంతో దృశ్యం సిరీస్ కు తెలుగులో ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడింది.
ఇక రెండో భాగం కూడా మలయాళంలో విడుదలై మరోసారి మంచి ప్రశంసలు అందుకుంది. తెలుగు వెర్షన్ నేరుగా ఓటీటీలో విడుదలైనప్పటికీ మంచి వ్యూస్ దక్కించుకుంది. దీంతో మూడో భాగంపై కూడా సినీ ప్రియుల్లో మొదట ఆసక్తి కనిపించింది. అయితే ఇప్పుడు పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా కనిపిస్తుందని టాక్ వినిపిస్తోంది. మోహన్ లాల్ నటించిన దృశ్యం 3 మూవీని ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. కానీ తెలుగులో మాత్రం సినిమా గురించి పెద్దగా సౌండ్ వినిపించడం లేదు.
రిలీజ్ సమయం దగ్గరపడుతున్నా బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగడం లేదని టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా సినిమాపై పెద్దగా హడావిడి లేకపోవడం గమనార్హం. దీంతో ఇప్పుడు మూవీ కోసం చర్చ నడుస్తోంది. తెలుగులో డబ్ చేసి విడుదల చేయడం కంటే, వెంకటేష్ తో రీమేక్ చేసి ఉంటే బాగుండేదేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే దృశ్యం అంటే తెలుగులో చాలామందికి వెంటనే గుర్తొచ్చేది వెంకటేష్. ఆయన ఇప్పటికే ఆ పాత్రను రెండు సార్లు పోషించడంతో ప్రేక్షకులతో మంచి కనెక్షన్ ఏర్పడింది.
ఇలాంటి సమయంలో నేరుగా డబ్బింగ్ వెర్షన్ తీసుకురావడం వల్ల ఆడియన్స్ లో ఆసక్తి తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు, సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా మేకర్స్ మరింత దృష్టి పెట్టాల్సిందని ప్రచారం జరుగుతోంది. కనీసం తెలుగు ప్రమోషన్ల కోసం అయినా వెంకటేష్ ను రంగంలోకి దించి ఉంటే సినిమాకు కలిసొచ్చేదని అంటున్నారు. ప్రస్తుతం వెంకటేష్ మంచి ఫామ్ లో ఉండటం సినిమాకు ప్లస్ అయ్యేదనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే స్ట్రాంగ్ కంటెంట్ ఉంటే రిలీజ్ తర్వాత పరిస్థితి మారే అవకాశం లేకపోలేదు. పాజిటివ్ టాక్ వస్తే తెలుగు ప్రేక్షకులు సినిమాను ఆదరించే అవకాశం ఉందని చెప్పాలి. మరి విడుదల తర్వాత దృశ్యం 3 ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
