దృశ్యం-3.. అంచనాలను ఇంకా తగ్గించేశారే
ఈసారి పక్కాగా ఆ డేటుకే సినిమాను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో తాజాగా దృశ్యం-3 టీజర్ లాంచ్ చేశారు.
By: Garuda Media | 30 April 2026 8:00 AM ISTఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే అందులో ముందు వరుసలో ఉండే సినిమా.. దృశ్యం. ముందుగా మలయాళంలో రిలీజై ఇండస్ట్రీ హిట్ అయిన ఆ చిత్రం.. తర్వాత అన్ని భారతీయ భాషలతో పాటు కొన్ని ఫారిన్ లాంగ్వేజ్‌ల్లో కూడా రీమేక్ అయి ప్రతిచోటా విజయం సాధించింది. దానికి కొనసాగింపుగా వచ్చిన దృశ్యం-2 కరోనా టైంలో నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో మూడో సినిమా రాబోతోంది. ఏప్రిల్ 2కే అనుకున్న సినిమాను.. గల్ఫ్ దేశాల్లో యుద్ధ పరిస్థితుల కారణంగా మే 21కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈసారి పక్కాగా ఆ డేటుకే సినిమాను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో తాజాగా దృశ్యం-3 టీజర్ లాంచ్ చేశారు.
ఐతే కావాలని అండర్ ప్లే చేశారా.. లేక సినిమాలో ఉన్న కంటెంట్‌కు తగ్గట్లే టీజర్ కట్ చేశారా అన్నది తెలియడం లేదు కానీ.. ఈ టీజర్ అయితే అంత ఎగ్జైటింగ్‌గా లేదు. దృశ్యం, దృశ్యం-2 చిత్రాల్లో జార్జి కుట్టి జీవితంలో ఏం జరిగిందో తన వ్యాఖ్యానంలోనే చెప్పే ప్రయత్నం చేశారు ఈ టీజర్లో. అనాథ అయిన తాను ఒక అందమైన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటే.. ఒక అనవసరమైన అతిథి వచ్చి తన కుటుంబాన్ని దెబ్బ తీయబోతే అతణ్ని తాను అంతం చేయాల్సి రావడం.. ఆ తర్వాత పోలీసులకు చిక్కకుండా ఎలా ప్రణాళిక రచించింది గుర్తు తెచ్చుకున్న జార్జి కుట్టి.. తనకు ఇప్పుడు మళ్లీ భయం కలుగుతోందని చెప్పడం.. దృశ్యం కథలోని ముఖ్య పాత్రలను ఒకసారి చూపించడంతో ఈ టీజర్ ముగిసింది.
గతం ఎప్పుడూ సైలెంటుగా ఉండదంటూ దృశ్యం-3కి పెట్టిన ట్యాగ్ లైన్.. ఈ కథకు ఆధారంగా కనిపిస్తోంది. ఎప్పటికైనా ఈ కేసును పోలీసులు తోడకుండా ఉండరనే అనుమానంతో ఎంతో తెలివిగా ప్లాన్ చేసి పోలీసులను మరోసారి బోల్తా కొట్టిస్తాడు దృశ్యం-2లో హీరో. ఐతే ఈసారి తాను చేసిన నేరం విషయంలో అంతర్మథనంతో హీరో ఏం చేశాడన్న దాని మీద కథను నడిపించేలా ఉన్నారు. ఈసారి థ్రిల్ కంటే ఎమోషన్ మీద ఎక్కువగా కథ జరుగుతుందంటూ ముందే అంచనాలను తగ్గించేశాడు దర్శకుడు జీతు జోసెఫ్. టీజర్ మరింతగా అంచనాలను తగ్గించేలా సాగింది. అలా అని సినిమా మామూలుగా ఉంటుందని అనుకుంటే పొరపాటే. దృశ్యం-2ను కూడా తక్కువగా అంచనా వేస్తే మామూలు షాకివ్వలేదు జీతు. కాబట్టి దృశ్యం-3లో కూడా అతను ఏదో ఒక మ్యాజిక్ చేసి ఉంటాడని భావించవచ్చు.
