'దృశ్యం 3' చివరి భాగం.. 4 కథలను తిరస్కరించి ఫైనల్ చేసిన హీరో!
మరో మర్డర్ మిస్టరీని చేర్చడం కాకుండా పాత కథకు సహజమైన ముగింపును ఇవ్వడం సవాలుతో కూడుకున్నదన్నారు.
By: Srikanth Kontham | 2 Oct 2026 1:00 AM ISTబాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్ నటిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ `దృశ్యం 3: ది కన్‌క్లూజన్` పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ సల్గాంకర్ పాత్రలో అజయ్ మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఫ్రాంచైజీలో వస్తున్న చివరి చిత్రం గురించి ఇటీవల ఓ కార్యక్రమంలో అజయ్ దేవ్‌గన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో జరిగిన సంభాషణను బహిర్గతం చేశారు.
`దృశ్యం` ఒరిజినల్ వెర్షన్‌లో కథానాయకుడిగా నటించిన మోహన్‌లాల్‌కి తాను ప్రత్యేకంగా ఫోన్ చేసినట్లు అజయ్ తెలిపారు. ఈసారి హిందీ వెర్షన్‌లో కథను ఒరిజినల్ కథనం నుండి పూర్తిగా భిన్నమైన రీతిలో మార్చామని చెప్పారు. మోహన్‌లాల్ ఈ చిత్రాన్ని చూసి తన అభిప్రాయం చెబితే.. ఒక ఆమోదముద్రగా భావించవచ్చని భావించినట్లు అజయ్ వివరించారు. అయితే ప్రస్తుతం మోహన్‌లాల్ సెలవుల్లో ఉండటం వల్ల సినిమాను చూడలేకపోయారని, త్వరలోనే చూస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు.
`దృశ్యం 3`తో ముగించాలనే నిర్ణయంపై అజయ్ దేవ్‌గన్ ఏమన్నారంటే? `దృశ్యం` వంటి థ్రిల్లర్ సినిమాలకు స్క్రిప్ట్ రాయడం చాలా కష్టమైన విషయమని అభిప్రా యపడ్డారు. మరో మర్డర్ మిస్టరీని చేర్చడం కాకుండా పాత కథకు సహజమైన ముగింపును ఇవ్వడం సవాలుతో కూడుకున్నదన్నారు. అందుకే సిరీస్‌ను అత్యున్నత స్థాయిలో ముగించాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ సినిమా స్క్రిప్ట్ రూపకల్పన గురించి ఓపెన్ అయ్యారు. దర్శక, రచయితల బృందం నాలుగు వేర్వేరు కథలను సిద్ధం చేసి తిరస్కరించిన తర్వాతే తుది కథను ఖరారు చేసినట్లు అజయ్ చెప్పారు. సినిమాలో అనూహ్యమైన మలుపులు, సస్పెన్స్ ఉండేలా ఎంతో శ్రమించామన్నారు. ఇటీవల ఈ చిత్రాన్ని తాను చూశానని, వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ` దృశ్యం 2` కంటే మరింత అద్భుతంగా వచ్చిందని అజయ్ ధీమా వ్యక్తం చేశారు.
`దృశ్యం 3: ది కన్‌క్లూజన్` చిత్రంలో అజయ్ దేవ్‌గన్‌తో పాటు గత భాగాల్లో అలరించిన శ్రియా శరణ్, ఇషితా దత్తా, టబు, రజత్ కపూర్ మళ్లీ తమ పాత్రలను పోషించారు. ఈసారి అదనపు ఆకర్షణగా జైదీప్ అహ్లావత్ , ప్రకాష్ రాజ్ కొత్త పాత్రల్లో చేరి కథకు మరిన్ని మలుపులు జోడించనున్నారు. వీరి రాకతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
స్టార్ స్టూడియో 18 సమర్పణలో అలోక్ జైన్, అజిత్ అంధారే, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ నిర్మించిన చిత్రం అక్టోబర్ 2న రిలీజ్ అవుతుంది. విజయ్ సల్గాంకర్ కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే ఆఖరి పోరాటం ఏ మలుపు తిరుగుతుందో? ఈ ముగింపు భాగం ప్రేక్షకులను ఏ స్థాయిలో థ్రిల్ చేస్తుందో? చూడాలని ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
