డ్రాగన్ కథ ముందే లీక్ చేయడం వెనక నీల్ మాస్టార్ ప్లాన్!
దీని వెనుక ఆయన ఒక పక్కా మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు స్పష్టమవుతోంది.
By: Sivaji Kontham | 21 May 2026 7:00 AM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక సినిమాకు సంబంధించిన కథను గానీ.. దాని ప్రధాన నేపథ్యాన్ని గానీ విడుదల వరకు అత్యంత రహస్యంగా దాచడం అనేది ముగిసిపోయిన ఒక ట్రెడిషనల్ ఫార్ములా. సస్పెన్స్ వీడితే ప్రేక్షకుల్లో కుతూహలం తగ్గిపోతుందనే భయం చాలా మంది దర్శకుల్లో ఉంటుంది. అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న `డ్రాగన్` చిత్రం విషయంలో మాత్రం ఈ ఫార్ములా పూర్తిగా రివర్సయింది. ఈ సినిమా గ్లింప్స్‌లో హీరో మాస్ ఎలివేషన్ల కంటే ముందే ఆ కథ సాగే ప్రపంచాన్ని, కాలక్రమాన్ని(ఎరాను) ఎందుకు రివీల్ చేయాల్సి వచ్చిందో ప్రశాంత్ నీల్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సుదీర్ఘంగా విశ్లేషించారు. దీని వెనుక ఆయన ఒక పక్కా మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు స్పష్టమవుతోంది.
ఈ సరికొత్త వ్యూహం వెనుక ఉన్న మొదటి కారణం ప్రేక్షకులకు కథను ముందే స్పష్టంగా చెప్పాలనే ఒక నిజాయితీ గల ప్రయత్నం. తన మునుపటి బ్లాక్‌బస్టర్ చిత్రాలలో కేవలం హీరోల ఇమేజ్‌ను ప్రమోట్ చేస్తూ.. కేవలం కథానాయకుల మాస్ మూమెంట్లను మాత్రమే చూపిస్తూ కంటెంట్ వదిలానని ప్రశాంత్ నీల్ అంగీకరించారు. కానీ డ్రాగన్ విషయంలో తాము ఏ కథను చెప్పాలనుకుంటున్నామో... ఎలాంటి సీరియస్ ప్రపంచాన్ని సృష్టించామో అది ప్రేక్షకులకు ముందే తెలియాలనే ఉద్దేశంతోనే ఈ బ్యాక్‌డ్రాప్‌ను పరిచయం చేసినట్లు తెలిపారు. ప్రస్తుత కాలంలో ప్రేక్షకుల ఆలోచనా విధానంలో కూడా పెద్ద మార్పు వచ్చిందని.. వారు థియేటర్లకు వచ్చే ముందే తాము ఎలాంటి సినిమా చూడబోతున్నామో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని.. కాబట్టి పాత పద్ధతుల్లో కథలను దాచాల్సిన అవసరం ఇప్పుడు లేదని ఆయన బలంగా అభిప్రాయపడ్డారు.
ప్రశాంత్ నీల్ తీసుకున్న ఈ హాలీవుడ్ తరహా విధానం భారతీయ కమర్షియల్ సినిమా మార్కెట్‌లో సరికొత్త ట్రెండ్‌కు దారితీయనుంది. హాలీవుడ్ సినిమా ట్రైలర్లలోనే కథలోని ప్రధానాంశాన్ని.. కొన్ని కీలకమైన సన్నివేశాలను ముందే చూపిస్తారని, తనలో కూడా కాలక్రమేణా వచ్చిన ఒక మేకింగ్ మార్పు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు నీల్ చెప్పారు. ప్రేక్షకులను కేవలం ఒక గ్రాండ్ సినిమా విజువల్స్ లేదా లార్జర్ దేన్ లైఫ్ సెట్టింగ్స్‌తోనే కాకుండా.. బలమైన కథతో ఆకట్టుకోవాలనేదే తన అసలు ఉద్దేశం. ఈ గ్లింప్స్ ద్వారా తాము ఏ స్టేడియంలో మ్యాచ్ ఆడుతున్నాం.. అక్కడి పిచ్ కండిషన్స్ ఏంటి అనేది ప్రేక్షకులకు ముందే ఒక అవగాహన కల్పించానని.. దీనివల్ల నెక్ట్స్ వచ్చే కథలో డ్రామాను చూసినా..ప్రేక్షకులకు అది చాలా సులభంగా అర్థమవుతుందని వివరించారు.
ఈ మాస్టర్ ప్లాన్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ప్రశాంత్ నీల్ ప్రస్తావించిన పార్ట్ 2 సిండ్రోమ్.. సాధారణంగా ఏదైనా ఒక విజయవంతమైన సినిమాకు సీక్వెల్ లేదా పార్ట్-2 వస్తున్నప్పుడు ప్రేక్షకులకు ఆ సినిమా ప్రపంచం అందులోని రూల్స్.. పాత్రల స్వభావం అన్నీ ముందే తెలిసిపోతాయి. దీనివల్ల పార్ట్-2 ట్రైలర్ విడుదల కాగానే ప్రేక్షకులు ఎలాంటి గందరగోళం లేకుండా నేరుగా కథలోని అసలైన సంఘర్షణకు, డ్రామాకు కనెక్ట్ అయిపోతారు. డ్రాగన్ సినిమా విషయంలో మరో ఏడాది పాటు ఆగకుండా పార్ట్-1 కే ఆ పార్ట్ 2 సిండ్రోమ్ లాంటి ఒక ముందస్తు అవగాహనను అనుభూతిని ప్రేక్షకులకు కనెక్ట్ చేయాలనేదే తన వ్యూహమని ప్రశాంత్ నీల్ చెప్పారు.
దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. పురాణేతిహాసమైన `రామాయణం` నుంచి ఉదాహరణను వివరించారు. రామాయణం కథ, అందులోని రాముడు, రావణుడు వంటి పాత్రలు... వారి గుణగణాలు అందరికీ ముందే తెలుసని.. అయినా కూడా మనం ఆ సినిమాను థియేటర్లలో కేవలం ఆ పాత్రల మధ్య సాగే ఎమోషన్, డ్రామా కోసమే మళ్లీ మళ్లీ చూస్తామని చెప్పారు. అదే విధంగా `డ్రాగన్` ప్రపంచాన్ని.. ఆ నల్లమందు వ్యాపార నేపథ్యాన్ని ముందే రివీల్ చేయడం వల్ల పాత్రల పరిచయం ఇప్పటికే జరిగిపోయింది. కాబట్టి నెక్స్ట్ టైమ్ సినిమా నుండి టీజర్ లేదా ట్రైలర్ రూపంలో కంటెంట్ వదిలినప్పుడు ప్రేక్షకులు ఎలివేషన్ల కోసం వెతకకుండా.. నేరుగా ఎన్టీఆర్ పాత్ర చుట్టూ సాగే పవర్‌ఫుల్ డ్రామాను.. దేశభక్తి ఎమోషన్‌ను పరిపూర్ణంగా ఎంజాయ్ చేసే వీలుంటుందని నీల్ నమ్మకంగా చెప్తున్నారు.
