డ్రాగన్, వారణాసి.. ఓ క్లారిటీ, మరో డౌట్!
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మైత్రీ రవి మాట్లాడిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో మరో డౌట్ క్రియేట్ చేసింది.
By: M Prashanth | 29 Sept 2026 11:01 PM IST‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మైత్రీ రవి మాట్లాడిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో మరో డౌట్ క్రియేట్ చేసింది. ఈవెంట్ లో ఎన్టీఆర్ ఉన్నారు, రాజమౌళి కూడా ఎదురుగానే కూర్చున్నారు. సహజంగానే తన బ్యానర్‌లో వస్తున్న ‘డ్రాగన్’ గురించి రవి మాట్లాడతారని ఊహించొచ్చు. కానీ మాట అక్కడితో ఆగలేదు. పక్కనే ఉన్న రాజమౌళి సినిమా ‘వారణాసి’ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించడంతో మరో మ్యాటర్ వైరల్ అవుతోంది.
‘డ్రాగన్’ రిలీజ్‌పై ఈ మధ్య అనుమానం వచ్చింది. షూటింగ్ షెడ్యూల్స్ పలు కారణాలతో వెనక్కి వెళ్లడంతో జూన్ డేట్ మళ్లీ మారవచ్చనే టాక్ సోషల్ మీడియాలో తిరిగింది. అందుకే రవి “ఎట్టి పరిస్థితుల్లోనూ మారదు” అని చెప్పడం ఆ రూమర్స్‌కు చెక్ పెట్టే ప్రయత్నంలా కనిపించింది. తమ సినిమా విషయంలో ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ అర్థమవుతుంది. కానీ వెంటనే మరో భారీ సినిమా డేట్‌ను కూడా చెప్పడం అక్కడే కొత్త క్యూరియాసిటీ తెచ్చింది.
‘వారణాసి’ ఏప్రిల్ 7న, ‘డ్రాగన్’ జూన్ 11న వస్తాయి అని గట్టిగా చెప్పారు. అంటే రెండు సినిమాల మధ్య దాదాపు రెండు నెలల స్పేస్ ఉంటుంది. రాజమౌళి సినిమా రన్‌కు కావాల్సిన టైమ్ దొరుకుతుంది, తర్వాత ఎన్టీఆర్nనీల్ సినిమాకు పెద్ద విండో వస్తుంది. రిలీజ్ క్యాలెండర్ గురించి చెప్పడానికి ఇది సహజమైన కారణమే. కానీ మైత్రీ రవి వారణాసి డేట్‌ను అంత క్లియర్‌గా చెప్పడంతో ఇంకో డౌట్ కూడా మొదలవుతోంది.
‘వారణాసి’ తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ ఆసక్తి చూపుతోందని కొన్ని నెలల క్రితమే ఇండస్ట్రీలో ప్రచారం వచ్చింది. భారీ ఆఫర్ కూడా ఇచ్చిందనే రిపోర్ట్స్ వచ్చాయి. ఆ డీల్ ఫైనల్ అయిందని మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఎవరూ చెప్పలేదు. అందుకే ఇప్పుడు రవి నోటి నుంచి సినిమా డేట్ రావడంతో మైత్రీ ఈ ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూషన్‌లో ఏదైనా పాత్ర తీసుకోబోతుందా అనే అనుమానం వస్తోంది.
మైత్రీకి డిస్ట్రిబ్యూషన్ కొత్త కాదు. తమ సినిమాలతో పాటు ఇతర భారీ చిత్రాలను కూడా తెలుగు రాష్ట్రాల్లో హ్యాండిల్ చేసిన అనుభవం ఉంది. పైగా ‘వారణాసి’ లాంటి రాజమౌళి సినిమా హక్కులు దక్కితే అది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ డీల్ కాదు. థియేటర్ల నెట్‌వర్క్, అడ్వాన్స్ బుకింగ్స్, భారీ రిలీజ్ ప్లానింగ్ అన్నీ చాలా ముందే మొదలవుతాయి. అందుకే రవి మాటను ఫ్యాన్స్ కేవలం స్టేజ్ మీద ఇచ్చిన అప్డేట్‌గా చూడడం లేదు.
ఇప్పటికైతే క్లియర్ అయిన విషయం రెండు డేట్స్. ‘డ్రాగన్’ వాయిదా రూమర్స్‌కు మైత్రీ వైపు నుంచి గట్టి సమాధానం వచ్చింది. ‘వారణాసి’ డేట్ కూడా అదే వేదికపై మళ్లీ వినిపించింది. మైత్రీ నిజంగా ఆ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్‌లోకి వస్తుందా అన్నది ఇంకా డౌటే. అయితే ఈ రెండు మూడు నెలల్లో ఆ డీల్స్ విషయంలో మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
