నేను ఇప్పటివరకూ రాసిన డార్కెస్ట్ క్యారెక్టర్ ఇదే: ప్రశాంత్ నీల్
తెలుగు చలనచిత్ర పరిశ్రమ దశాబ్దాలుగా ఒక నిర్దిష్టమైన, సురక్షితమైన కమర్షియల్ ఫార్ములాపైనే ఎక్కువ శాతం ఆధారపడుతూ వస్తోంది.
By: Sivaji Kontham | 21 May 2026 12:58 AM ISTతెలుగు చలనచిత్ర పరిశ్రమ దశాబ్దాలుగా ఒక నిర్దిష్టమైన, సురక్షితమైన కమర్షియల్ ఫార్ములాపైనే ఎక్కువ శాతం ఆధారపడుతూ వస్తోంది. ఇక్కడ స్టార్ హీరోల ఇమేజ్ అనేది కేవలం థియేటర్ల వసూళ్లకు సంబంధించిన సమీకరణం మాత్రమే కాదు.. అది కోట్లాది మంది అభిమానుల అంచనాలతో, భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఒక బలమైన బంధం. అభిమానులు తమ ఆరాధ్య హీరోను ఎల్లప్పుడూ ఆదర్శవంతంగా, సమాజానికి మంచి చేసే ఒక రక్షకుడి పాత్రలోనే చూడటానికి ఇష్టపడతారనే నమ్మకం ఇండస్ట్రీలో బలంగా నాటుకుపోయింది. ఇలాంటి మూస వాతావరణంలోకి కొత్తదనం ఉన్న కంటెంట్ ని పరిచయం చేసారు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ - సలార్ ఫ్రాంఛైజీలతో అతడు డార్క్ ప్రపంచంలో భీకరమైన విన్యాసాలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. యష్, ప్రభాస్ లాంటి అగ్ర హీరోలకు కెరీర్ బెస్ట్ హిట్ చిత్రాలను అందించిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక అగ్ర శ్రేణి మాస్ హీరోతో పని చేస్తున్నారు. నీల్ తన కెరీర్‌లోనే అత్యంత ప్రమాదకరమైన `డార్కెస్ట్ క్యారెక్టర్`ని డిజైన్ చేసానని దానికి ఎన్టీఆర్ అంగీకరించడం టాలీవుడ్‌లో ఒక విప్లవాత్మకమైన అడుగు అని చెప్పారు.
ఈ వినూత్న ప్రాజెక్ట్ గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను ఇప్పటివరకు రాసిన పాత్రలన్నింటిలోకి `డ్రాగన్` సినిమాలో ఎన్టీఆర్ పోషిస్తున్న లూగర్ పాత్ర అత్యంత డార్కెస్ట్ పాత్ర..అని స్పష్టం చేశారు. ఒక హంతకుడిగా సాగే ఈ రోల్‌ను అంగీకరించడం ఒక కమర్షియల్ స్టార్‌గా తారక్‌కు ఎంతో రిస్కీ నిర్ణయమైనా..కథలోని అద్భుతమైన డ్రామాను నమ్మి ఆయన ఈ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేవలం కథపై ఉన్న నమ్మకంతోనే ఎన్టీఆర్ తన లుక్ కోసం కఠినమైన డైట్ పాటించి, శారీరకంగా ఎంతో శ్రమించి కేవలం 4 నెలల్లోనే ఏకంగా 15 కిలోల వరకు బరువు తగ్గడం సినిమాపై ఆయనకున్న అంకితభావానికి నిదర్శనమని అన్నారు. తాను, కుటుంబ సభ్యులు కూడా ఇలా చేయొద్దని వారించే ప్రయత్నం చేసినా తారక్ వినలేదని కూడా తెలిపారు.
ఈ సినిమా కేవలం ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామా లేదా డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు. 1960ల నాటి నల్లమందు వ్యాపారం చుట్టూ తిరిగే ఒక అరాచక డిస్టోపియన్ ప్రపంచాన్ని చూపిస్తూనే అంతిమంగా ఇది ఒక అద్భుతమైన దేశభక్తి చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందనే సర్ప్రైజింగ్ ఎలిమెంట్‌ను ప్రశాంత్ నీల్ రివీల్ చేశారు. తన మునుపటి బ్లాక్‌బస్టర్ చిత్రాలైన కేజీఎఫ్, సలార్ తరహాలో ఇది కేవలం హీరో ఎలివేషన్స్, భారీ యాక్షన్ ఈవెంట్స్ చుట్టూ మాత్రమే తిరగదు. ఎంపిక చేసుకున్న కథ కథనాల్లో గ్రిప్ ఉంటుందని, తన ఇతర చిత్రాల్లో తాను చేసింది ఇదేనని తెలిపారు. డ్రాగన్ చిత్రంలో నటిస్తున్న అనిల్ కపూర్, రుక్మిణీ వసంత్ వంటి ప్రతి ఒక్క నటీనటుల పాత్రకూ ఒక బలమైన బ్యాక్ స్టోరీ ఉంటుందనిపప నటీనటుల సహజ సిద్ధమైన పర్ఫార్మెన్స్ ఎమోషనే ఈ సినిమాకు అసలైన ప్రధాన బలం అని దర్శకుడు పేర్కొన్నారు.
టాలీవుడ్‌లో ఇప్పటివరకు మనం చూసిన నెగెటివ్ షేడ్స్ అన్నీ కేవలం యాంటీ-హీరో లేదా కాస్త గ్రే షేడ్స్ ఉన్న పాత్రలకే పరిమితమయ్యాయి. సినిమా ముగింపులో హీరో చేసే తప్పుల వెనుక ఏదో ఒక సామాజిక కారణం ఉంటుందనే రొటీన్ జస్టిఫికేషన్ ఇవ్వడం మనకు అలవాటైన ఫార్ములా. కానీ `డ్రాగన్`లో ఎన్టీఆర్ పాత్ర వంద శాతం నెగెటివ్ ఆర్క్ ఉన్న ఒక పక్కా అసాసిన్ కావడం వల్ల.. ఇది తెలుగు స్క్రీన్‌పై సరికొత్త ప్రయోగం కానుంది. సాధారణంగా మాస్ మసాలా ఫైట్లు, రొమాంటిక్ ట్రాకులు, కామెడీ బిట్లను కమర్షియల్ ఎలిమెంట్స్ అనుకునే రోజుల్లో.. పవర్‌ఫుల్ డ్రామా .. బలమైన క్యారెక్టరైజేషన్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ నీల్.
ఈ చిత్రం టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌కు నాంది పలకబోతోంది. ఎన్టీఆర్ తన లుక్ మార్చుకోవడమే కాదు.. నటనలో వైవిధ్యాన్ని చూపించగల నేర్పరి. ప్రశాంత్ నీల్ లాంటి లార్జర్-దెన్ లైఫ్ పాత్రలతో విజువల్స్ పండించే దర్శకుడితో కలిసి చేస్తున్న ఈ సాహసోపేతమైన ప్రయోగంగా డ్రాగన్ ని చూడాలి. ఇది తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోవడం ఖాయమని ఇటీవల విడుదల చేసిన టీజర్ రివీల్ చేసింది. డార్క్ షేడ్ ఉన్న గ్రే పాత్రలతో సంచలనాలు సృష్టించడం తన ఫార్ములా అని ప్రశాంత్ నీల్ మరోసారి నిరూపించబోతున్నాడు.
