గవర్నమెంట్ డాక్టర్ అనుకోకుండా నటుడిగా
ఇండస్ట్రీలో నటుడిగా ఎవరు క్లిక్ అవుతారా? ఎవరు ఫెయిల్ అవుతారు? అన్నది చెప్పడం కష్టం.
By: Srikanth Kontham | 25 March 2026 9:00 PM ISTఇండస్ట్రీలో నటుడిగా ఎవరు క్లిక్ అవుతారా? ఎవరు ఫెయిల్ అవుతారు? అన్నది చెప్పడం కష్టం. ట్యాలెం్ట కి అదృష్టం కూడా తోడైనప్పుడే అది సాధ్యమవుతుంది. కానీ కొన్నిసార్లు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా స్టార్ అవ్వొచ్చు. టాలీవుడ్ లో అలా సక్సెస్ అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. `అర్జున్ రెడ్డి`లో నటించిన రాహుల్ రామకృష్ణ అలా స్థిరపడిన నటుడే. రాహుల్ పరిశ్రమలో ఎలాంటి సినీ ప్రయత్నాలు చేయలేదు. అవకాశమే అతడిని వెతుక్కుంటూ వెళ్లింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రాసిన పాత్రకు రాహుల్ సెట్ అవుతాడు అనుకున్నారు.
ఆ పాత్రలో రాహుల్ ని పెట్టి సినిమా చేసాడు. సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం రాహుల్ రామకృష్ణ టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్ అయ్యాడు. తాజాగా ఒక ప్రభుత్వ డాక్టర్ కూడా అనుకోకుండా బాలీవుడ్ లో నటుడైపోయాడు. పంజాబ్‌లోని లూధియానాకు చెందిన ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ సన్నీ అశోక్ బ్లాక్‌బస్టర్ హిట్ `ధురందర్ 2` చిత్రంతో వెండితెరకు పరిచయమై తన ప్రాంతంలో ఒక సెలబ్రిటీగా మారిపోయారు. ఈ అరుదైన అవకాశం వెనుక ఓ ఆసక్తికరమైన సంఘటన ఉంది. గతేడాది జూలైలో పంజాబ్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా నటుడు అర్జున్ రాంపాల్ తలకు గాయమైంది.
ఆందోళన చెందిన చిత్ర యూనిట్ వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో ఉన్న డాక్టర్ సన్నీని సెట్స్‌కు పిలిపించారు. ఆయన సమయస్ఫూర్తితో చికిత్స అందించి, గాయం చిన్నదేనని నిర్ధారించడంతో చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది. డాక్టర్ సన్నీ ప్రవృత్తిని ఆయన పనితీరును గమనించిన దర్శకుడు ఆదిత్య ధర్ ఎంతో ప్రభావితమయ్యారు. సినిమాలో హీరో రణవీర్ సింగ్ గాయంతో విమానం దిగే ఒక కీలక సన్నివేశం ఉంది. ఆ సీన్‌లో వైద్యుడి పాత్ర కోసం ఒక ప్రొఫెషనల్ నటుడి కంటే, నిజమైన డాక్టర్ అయితేనే ఆ సహజత్వం వస్తుందని భావించిన ఆదిత్య వెంటనే డాక్టర్ సన్నీని ఆ పాత్రలో నటించమని కోరారు.
దర్శకుడి ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన డాక్టర్ సన్నీ, కెమెరా ముందు ఎంతో ఆత్మవిశ్వాసంతో నటించారు. విశేషం ఏమిటంటే? ఎలాంటి తడబాటు లేకుండా మొదటి టేక్‌లోనే ఆయన తన షాట్‌ను పూర్తి చేశారు. డాక్టర్ సన్నీ నటనకు ఫిదా అయిన ఆదిత్య ధర్ ఆయనలోని సహజత్వాన్ని మెచ్చుకుంటూ ప్రత్యేకంగా అభినందించారు. ఒక ప్రభుత్వ అధికారి ఇలా అనుకోకుండా బాలీవుడ్ భారీ చిత్రంలో భాగమవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ప్రస్తుతం `ధురందర్ 2` థియేటర్లలో రికార్డు వసూళ్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
