DTTT ట్రైలర్: తెరపై ఫహాద్-సారా మ్యాజిక్.. తెరవెనక బాలయ్య మ్యాజిక్.. వారెవ్వా!
మలయాళం, తమిళ, తెలుగు పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ హీరోగా నటిస్తున్న తొలి స్ట్రెయిట్ తెలుగు చిత్రం `డోంట్ ట్రబుల్ ది ట్రబుల్` (DTTT).
By: Sivaji Kontham | 22 Sept 2026 10:36 PM ISTమలయాళం, తమిళ, తెలుగు పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ హీరోగా నటిస్తున్న తొలి స్ట్రెయిట్ తెలుగు చిత్రం `డోంట్ ట్రబుల్ ది ట్రబుల్` (DTTT). దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సమర్పణలో.. శశాంక్ యేలేటి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే అంచనాలున్నాయి. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో తెరపై ఫహాద్ ఫాజిల్ - చిన్నారి సారా నటన ఒక ఎత్తు అయితే.. తెరవెనక నందమూరి బాలకృష్ణ అందించిన వాయిస్ ఓవర్ మరో ఎత్తు. ఎన్.బి.కే వాయిస్ నిజానికి సినిమా స్థాయిని పూర్తిగా మార్చేసిందనే చెప్పాలి.
ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్ సూరి అనే ఒక మాయగాడిగా కనిపించనున్నారు. ఎప్పుడూ డబ్బు చుట్టూ తిరిగే సూరి.. అనుకోకుండా కొన్ని ఇబ్బందుల్లో చిక్కుకోవడం.. ఆ తర్వాత డబ్బు సంపాదన కోసం ఒక చిన్నారి (సారా)తో కలిసి ప్రయాణం చేయడం ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు. అయితే ఆ చిన్నారికి కొన్ని మిస్టరీ పవర్స్ ఉన్నాయని తెలుసుకున్న సూరి షాక్ కి గురికావడం.. ఆ తరువాత వారిద్దరి మధ్య జరిగే ప్రయాణం సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. ఫాంటసీ, కామెడీ, థ్రిల్స్ కలగలిపిన ఈ కథ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని పంచడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ ట్రైలర్‌కు అసలు సిసలు హైలైట్ మాత్రం నందమూరి బాలకృష్ణ వాయిస్ ఓవర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సరైన పాత్రకు, సరైన సమయంలో ఒక పవర్‌ఫుల్ వాయిస్ పడితే ఆ కిక్కే వేరుగా ఉంటుందని బాలయ్య తన వాయిస్‌తో నిరూపించారు. సినిమా కాన్సెప్ట్‌కు తగ్గట్టుగా ఆయన చెప్పిన వాయిస్ ఓవర్ ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ చిత్రంలో చిన్నారి సారా పోషించిన పాత్ర అత్యంత రహస్యమైనదిగా ఉండబోతుండగా... తన నటన ట్రైలర్‌లోనే హైలైట్‌గా నిలిచింది. ఆసక్తికరంగా ఎన్బీకే ఫేమస్ డైలాగ్ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ని ఈ చిత్రబృందం టైటిల్ గా పెట్టుకుని ఆయన చేతే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ చెప్పించడం మరింత ఆసక్తిని కలిగించింది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఎస్.ఎస్. రాజమౌళి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇక కాల భైరవ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (బీజీఎం) ట్రైలర్‌లోని థ్రిల్లింగ్ సన్నివేశాలకు ప్రాణం పోసింది.
మొత్తానికి ఫహాద్ ఫాజిల్ అద్భుతమైన నటన, చిన్నారి సారా మ్యాజిక్, శశాంక్ యేలేటి టేకింగ్ ఇవన్నీ ఒకెత్తైతే.. వీటన్నింటినీ కలుపుతూ బాలకృష్ణ అందించిన వాయిస్ ఓవర్ ఈ ట్రైలర్‌ను ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మార్చింది. అక్టోబర్ 2న థియేటర్లలో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి ట్రీట్ ఇస్తుందో వేచి చూడాలి.
