Begin typing your search above and press return to search.

ఏడాదిన్నర తర్వాత... బాహుబలి మేకర్స్ మొదలు పెట్టారు!

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌ను మించి విజయాన్ని సొంతం చేసుకున్న ఆర్కా మీడియా వర్క్స్‌ బ్యానర్‌లో ఆ తర్వాత ఎక్కువగా సినిమాలు రాలేదు.

By:  Ramesh Palla   |   19 Oct 2025 12:51 PM IST
ఏడాదిన్నర తర్వాత... బాహుబలి మేకర్స్ మొదలు పెట్టారు!
X

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌ను మించి విజయాన్ని సొంతం చేసుకున్న ఆర్కా మీడియా వర్క్స్‌ బ్యానర్‌లో ఆ తర్వాత ఎక్కువగా సినిమాలు రాలేదు. ఇక మీదట బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలు చేసేందుకు గాను ఆర్కా మీడియా వర్క్స్‌ నిర్మాతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని వరుసగా కథలు వింటూ మంచి కథలను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. వీరిద్దరు దాదాపు ఏడాదిన్నర క్రితం బాలకృష్ణ ఫేమస్ డైలాగ్‌ అయిన 'డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌' అనే టైటిల్‌తో సినిమాను ప్రకటించారు. పుష్ప స్టార్‌ ఫాహద్‌ ఫాసిల్‌ హీరోగా మేకర్స్ ఈ సినిమాను ప్రకటించారు. శశాంక్‌ యేలేటి దర్శకత్వంలో ఈ సినిమాను ఆ సమయంలోనే ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఆ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడంతో అంతా కూడా సినిమా గురించి దాదాపుగా మర్చి పోయారు.

డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌ మూవీ షూటింగ్‌ షురూ

ఎట్టకేలకు ఫాహద్‌ ఫాసిల్‌ 'డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌' సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అయ్యాడు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. సినిమాను ప్రకటించి దాదాపుగా ఏడాదిన్నర అయింది. ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్‌ లేకపోవడంతో సినిమా గురించి జనాలు మర్చిపోయారు, ఇండస్ట్రీ వర్గాల వారు మర్చిపోతున్నారు. ఇలాంటి సమయంలో షూటింగ్‌ ప్రారంభించబోతున్నాం అంటూ ప్రకటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. దర్శకుడు శశాంక్‌ ఇన్నాళ్లు స్క్రిప్ట్ పనిలోనే ఉన్నాడని తెలుస్తోంది. పక్కా స్క్రిప్ట్‌ వర్క్ పూర్తి కావడంతో షూటింగ్‌కు ఎక్కువ సమయం తీసుకోకుండా చకచకా పూర్తి చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ విభిన్నమైన ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని మేకర్స్‌ ఇటీవల ఒక సందర్భంగా చెప్పుకొచ్చారు.

శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని, కార్తికేయ నిర్మాణంలో...

మొదటి షెడ్యూల్‌లో ఫాహద్‌ ఫాసిల్‌తో పాటు ముఖ్య నటీనటులు పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన స్టిల్‌ను సోషల్‌ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్‌ లో శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేనిలతో కలిసి తన షోయింగ్‌ బిజినెస్‌ బ్యానర్‌లో రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్‌ కార్తికేయ సైతం నిర్మిస్తున్నాడు. రాజమౌళి టీం ఈ సినిమా వెనుక ఉన్న కారణంగా సహజంగానే అంచనాలు పెరగడం ఖాయం. కనుక ఈ సినిమా షూటింగ్‌ త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే తప్పకుండా మంచి స్పందన దక్కే అవకాశాలు ఉన్నాయి. ఎస్‌ఎస్‌ కార్తికేయ నిర్మాతగా ఇప్పటికే సినిమాలతో వచ్చాడు. అయితే కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో పెద్ద విజయాలను సొంతం చేసుకోలేదు. మరి ఈ సినిమాతో కార్తికేయకు మంచి విజయం దక్కుతుందా అనేది చూడాలి.

ఫాహద్‌ ఫాసిల్‌ హీరోగా..

ఫాహద్‌ ఫాసిల్‌ మలయాళ సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు చేయడం మొదలుకుని హీరోగా మారి, భారీ సినిమాల హీరోగా గుర్తింపు దక్కించుకున్నాడు. ఒక వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ సినిమాలు చేయడం ద్వారా పాన్ ఇండియా స్టార్‌డం దక్కించుకున్నాడు. ముఖ్యంగా పుష్ప 2 లో ఈయన పాత్రకు మంచి స్పందన వచ్చింది. పుష్పకు వచ్చిన క్రేజ్ నేపథ్యంలో ఇప్పుడు చేస్తున్న ఈ డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీడియం రేంజ్ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ విభిన్న సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా ఈ సినిమా ఉంటుందనే విశ్వాసంను దర్శకుడు శశాంక్‌ యేలేటి అంటున్నారు.