'దొంగ నా కొడుకు' టీజర్.. కన్న కొడుకా? డబ్బా?
శ్రీను కంబాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మౌళి ఒక అల్ట్రా సెల్ఫిష్, లోయర్ మిడిల్ క్లాస్ కుర్రాడిగా కనిపించాడు.
By: M Prashanth | 21 Oct 2026 3:23 PM ISTసముద్రపు ఒడ్డున నిలబడి దేవుడికి దండం పెట్టుకుంటూ "నాకు మంచి తల్లిదండ్రులను ఇచ్చావు.. మంచి ఫ్రెండ్‌ను ఇచ్చావు.. కానీ వచ్చే జన్మలో ఇవేవీ వద్దు, అడిగినంత డబ్బిస్తే చాలు" అనే హీరో ప్రార్థనతోనే ఈ సినిమా నేచర్ ఏంటో టీజర్ చెప్పకనే చెప్పేసింది. యూట్యూబ్ సెన్సేషన్ మౌళి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'దొంగ నా కొడుకు'. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ యూత్‌ఫుల్ ఫన్ రైడ్ టీజర్‌ను మేకర్స్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.
శ్రీను కంబాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మౌళి ఒక అల్ట్రా సెల్ఫిష్, లోయర్ మిడిల్ క్లాస్ కుర్రాడిగా కనిపించాడు. చదువుసంధ్యలు పట్టించుకోకుండా, బీటెక్ డిస్కంటిన్యూ చేసి ఊరంతా అప్పులు చేసుకుంటూ తిరిగే ఒక జాలీ క్యారెక్టర్‌గా అతన్ని ప్రెజెంట్ చేశారు. "మనం చనిపోతే మనకోసం పది మందైనా ఏడవాలి సార్.. అందుకే ఆ పది మంది దగ్గరా అప్పు చేసేశా" అంటూ మౌళి తనదైన కూల్ టైమింగ్‌తో పేల్చిన డైలాగ్ యూత్‌ను బాగా ఎట్రాక్ట్ చేసేలా ఉంది.
ఇందులో సీనియర్ నటుడు అలీ, హీరో తండ్రి పాత్రలో కనిపించి మంచి సపోర్ట్ ఇచ్చారు. "ఈ ఇంట్లో నీకంటే పెద్ద దొంగ నా కొడుకు ఎవడైనా ఉంటాడట్రా" అంటూ తండ్రి కొడుకుల మధ్య నడిచే ఫ్రస్ట్రేషన్ సీన్స్ చాలా నేచురల్‌గా వర్కౌట్ అయ్యాయి. చివర్లో "నీకు డబ్బులు ఇంపార్టెంటా.. కన్న కొడుకు ఇంపార్టెంటా?" అని హీరో అడిగితే.. తల్లిదండ్రులు ఇద్దరూ ఏమాత్రం తడుముకోకుండా "డబ్బే ఇంపార్టెంట్" అని ముక్తకంఠంతో చెప్పే సీన్ హైలెట్ అవుతోంది.
మౌళికి జోడీగా సుస్మితా శెట్టి గ్లామరస్‌గా కనిపించగా, రఘుబాబు పాత్ర కూడా టీజర్‌లో ఆసక్తి రేపుతోంది. టీజర్ కట్ చూస్తుంటే ఇది టైమ్ పాస్ కామెడీ మాత్రమే కాకుండా, డబ్బు కోసం హీరో పడే పాట్లు, ఆ క్రమంలో జరిగే క్రైమ్, రాబరీ ఎలిమెంట్స్ చుట్టూ తిరిగే పక్కా ఎంటర్‌టైనర్‌లా కనిపిస్తోంది. సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ, సింజిత్ యెర్రమిల్లి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విజువల్స్‌లోని ఎనర్జీకి పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యాయి.
ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి చిన్న హీరోతో ఇలాంటి రొటీన్ ఫన్ ప్రాజెక్ట్ రావడం మంచి విషయమే. కంటెంట్ గనక మొదటి నుంచి చివరిదాకా ఇలాగే ఫుల్ లెంగ్త్ కామెడీతో నడిస్తే బాక్సాఫీస్ దగ్గర యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే టీజర్‌లో చూపించిన పంచ్‌లు సినిమాలో ఏ మేరకు పేలాయన్నది చూడాలి.
నవంబర్ 13న థియేటర్లలోకి రాబోతున్న ఈ 'దొంగ నా కొడుకు' టీజర్ ప్రామిసింగ్ ఫన్ వైబ్‌ను క్రియేట్ చేసింది. మౌళి తన మార్క్ నాన్‌చలెంట్ బాడీ లాంగ్వేజ్‌తో ఆడియన్స్‌ను నవ్వించడానికి గట్టిగానే ప్రయత్నించాడు. రాబోయే ట్రైలర్ కూడా ఈ రేంజ్ ఫన్‌ను కొనసాగిస్తే, సినిమా థియేటర్లలో యూత్‌కు ఒక మంచి రిలీఫ్ ఇచ్చే అవకాశముంది.
