డాన్ 3 ఉంటుందా? ఊడుతుందా? తేలేది నేడే!
బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన యాక్షన్ ఫ్రాంచైజీగా గుర్తింపు పొందిన `డాన్ 3` చిత్రం చుట్టూ వివాదాలు ముదురుతున్నాయి.
By: Srikanth Kontham | 24 May 2026 11:47 AM ISTబాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన యాక్షన్ ఫ్రాంచైజీగా గుర్తింపు పొందిన `డాన్ 3` చిత్రం చుట్టూ వివాదాలు ముదురుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ నుండి స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ హఠాత్తుగా తప్పుకోవడంతో తలెత్తిన వివాదాన్ని దర్శకుడు, నిర్మాత ఫర్హాన్ అక్తర్ తాజాగా ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) దృష్టికి తీసుకెళ్లారు. రణ్‌వీర్ సింగ్‌పై ఫర్హాన్ దాఖలు చేసిన ఫిర్యాదును పరిశీలిస్తున్న సినీ ప్రముఖుల మండలి, ఈ విషయమై సోమవారం ప్రత్యేక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించబోతోంది.
ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైرెక్టర్స్ అసోసియేషన్ (IFTDA) లో సభ్యుడైన ఫర్హాన్ అక్తర్, ఆ సంస్థ ద్వారానే తన ఫిర్యాదును ఎఫ్ డబ్ల్యూ ఐసీఈకి పంపారు. చిత్ర పరిశ్రమలో నటీనటులు, నిర్మాతల మధ్య ఉండే నైతిక ,వృత్తిపరమైన నిబంధనల ఉల్లంఘనపై ఈ ఫిర్యాదు ఆధారపడి ఉంది. దీనిపై స్పందించిన ఫెడరేషన్, తాము ఫిర్యాదులోని అన్ని అంశాలను, ప్రస్తుత పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే స్పష్టమైన వైఖరిని ప్రెస్ మీట్ ద్వారా బహిరంగపరుస్తామని స్పష్టం చేసింది.
అసలు ఈ వివాదానికి మూలకారణం రణ్‌వీర్ సింగ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడమే. గతంలో షారుఖ్ ఖాన్ స్థానంలో రణ్‌వీర్‌ను కొత్త `డాన్ గా ప్రకటిస్తూ మేకర్స్ ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేశారు. అయితే ఇటీవల ఆయన నటించిన `ధురంధర్` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో, రణ్‌వీర్ తన కెరీర్ ప్లానింగ్‌ను మార్చుకున్నట్లు తెలుస్తోంది. కథాంశంపై వచ్చిన విభేదాలు , డేట్ల సర్దుబాటు సమస్యల వల్లే రణవీర్ సింగ్ సినిమాను వదులుకున్నారనే ప్రచారం బాలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ ఆకస్మిక పరిణామం తో `డాన్ 3` నిర్మాణ సంస్థ అయిన ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు భారీ ఆర్థిక నష్టం వాటిల్లినట్లు వెలుగులోకి వచ్చింది.
సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనుల కోసం 40 కోట్ల వరకు ఖర్చు చేశామని, షెడ్యూల్స్ మారిపోవడం వల్ల భారీ నష్టం జరిగిందని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. ఈ నష్టపరిహారాన్ని చెల్లించడానికి రణ్‌వీర్ సింగ్ కూడా అంగీకరించినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నా? ఈ వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితిపై ఫర్హాన్ అక్తర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించి ఆవేదనను పంచుకున్నారు. సినీ పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో? ఊహించలేమని, కెమెరా ముందు దృశ్యం రికార్డ్ అయ్యేంతవరకు దేనినీ ఖచ్చితంగా నమ్మలేమనే చేదు నిజాన్ని ఈ సంఘటన తనకు నేర్పిందని వ్యాఖ్యానించారు.
ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని, ఈ గందరగోళ పరిస్థితిని కూడా ఒక పాఠంగానే స్వీకరిస్తున్నానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జరగబోయే ప్రెస్ కాన్ఫరెన్స్ బాలీవుడ్‌లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎఫ్ డబ్ల్యూ ఐసీఈ తీసుకోబోయే నిర్ణయం రణ్‌వీర్ సింగ్ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపు తుంది? `డాన్ 3` ప్రాజెక్ట్‌ను ఫర్హాన్ అక్తర్ మరో హీరోతో ముందుకు తీసుకెళ్తారా? అనే విషయాలపై స్పష్టత రానుంది. పరిశ్రమలో స్టార్ల వెనకడుగు , నిర్మాతల నష్టాల మధ్య సమతుల్యతను కాపాడేలా తీర్పు ఉంటుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
