Begin typing your search above and press return to search.

కొత్త కోణం: 'డాన్ 3' ఆగిపోవ‌డానికి 'యానిమ‌ల్' కార‌ణ‌మా?

ఫర్హాన్ అక్తర్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ `డాన్ 3` అనౌన్స్ చేసినప్పటి నుండి ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది.

By:  Sivaji Kontham   |   3 May 2026 8:30 AM IST
కొత్త కోణం: డాన్ 3 ఆగిపోవ‌డానికి యానిమ‌ల్ కార‌ణ‌మా?
X

ఫర్హాన్ అక్తర్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ `డాన్ 3` అనౌన్స్ చేసినప్పటి నుండి ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ముఖ్యంగా ఈ సినిమా కాస్టింగ్ విషయంలో జరుగుతున్న పరిణామాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. షారూఖ్ ఖాన్ స్థానంలో రణవీర్ సింగ్ వచ్చి మళ్ళీ తప్పుకోవడం వెనుక రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రణవీర్ ఎగ్జిట్ వెనుక బలమైన `క్రియేటివ్ డిఫరెన్సెస్` ఉన్నట్లు తెలుస్తోంది.

`ది ఫ్రీ ప్రెస్ జర్నల్` క‌థ‌నం ప్రకారం.. రణవీర్ సింగ్ ఈ సినిమాను చాలా ఇంటెన్స్ గా, గ్రిట్టీగా (తీవ్రమైన హింసతో) రూపొందించాలని భావించారట. మారుతున్న కాలానికి అనుగుణంగా `డాన్` క్యారెక్టర్ డీఎన్ఏ మారాలని.. సినిమాలో బూతులు, తీవ్రమైన హింస ఉండాలని ఆయన పట్టుబట్టినట్లు సమాచారం. ప్రస్తుత కాలంలో ఆడియెన్స్ కు ఇలాంటి రా అండ్ రస్టిక్ కంటెంట్ బాగా కనెక్ట్ అవుతుందని రణవీర్ నమ్మారు. `యానిమల్` వంటి సినిమాల ట్రెండ్ ను దృష్టిలో ఉంచుకుని అత‌డు దీనిని డిమాండ్ చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

దర్శకుడు ఫర్హాన్ అక్తర్ మాత్రం రణవీర్ ఆలోచనలతో ఏకీభవించలేదని తెలుస్తోంది. స్క్రిప్ట్‌లో బూతులు చేర్చడానికి ఆయన నిరాకరించారు. గతంలో అమితాబ్ బచ్చన్ .. షారూఖ్ ఖాన్ వంటి స్టార్లు నటించిన `డాన్` సినిమాలను ఉదాహరణగా చూపిస్తూ.. `డాన్` పాత్రకు ఒక క్లాస్, డిగ్నిటీ ఉంటుందని.. ఆ ఫార్మాట్‌ను మార్చడం తనకు ఇష్టం లేదని ఫర్హాన్ స్పష్టం చేశారు. ఎటువంటి ఒత్తిడికి లొంగకుండా తాను అనుకున్న విధంగానే సినిమా తీయాలని ఆయన నిర్ణయించుకోవడంతో ఈ క్రియేటివ్ విభేదాల కారణంగానే రణవీర్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని క‌థ‌నాలొస్తున్నాయి.

డాన్ వారసత్వం:

1978లో అమితాబ్ బచ్చన్ నటించిన క్లాసిక్ `డాన్`ను ఫర్హాన్ అక్తర్ 2006లో షారూఖ్ ఖాన్‌తో రీమేక్ చేశారు. అది భారీ విజయం సాధించడంతో 2011లో `డాన్ 2` సీక్వెల్‌ను కూడా తెచ్చారు. ఈ రెండు సినిమాల్లోనూ ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషించారు. `డాన్` అంటే కేవలం నేరగాడు మాత్రమే కాదు.. ఒక స్టైలిష్ ఐకాన్ అని ఫర్హాన్ నమ్మకం. అందుకే ఆ క్యారెక్టరైజేషన్‌ను బూతులు, అసభ్యతతో పాడుచేయకూడదని ఆయన భావిస్తున్నారు.

ప్రస్తుతం రణవీర్ తప్పుకోవడంతో `డాన్ 3` రేసులోకి మళ్ళీ ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు స్క్రిప్ట్ లో మార్పులు జరుగుతున్నాయని.. మరోవైపు షూటింగ్ ఆలస్యమవుతుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ క్రేజీ ప్రాజెక్టులో `డాన్`గా మెప్పించే ఆ తదుపరి నటుడు ఎవరో చూడాలి.

బూతులు హింస ఆమోద‌యోగ్య‌మా?

సినిమా రంగంలో పెరుగుతున్న బూ*తు ధోరణి పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం ప్రేక్షకులు, ముఖ్యంగా యువత.. హీరోలు వాడే ఘాటైన పదజాలాన్ని పాత్ర తీవ్రతకు.. సహజత్వానికి గుర్తింగా భావిస్తూ ఈలలు వేస్తున్నారు. ఇది ఒక రకమైన `మాస్ హీరోయిజం`గా మారి.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతోంది. పాత్ర స్వభావాన్ని బట్టి అలాంటి మాటలు వాడటం కథలో భాగంగా కనిపిస్తుందని.. అది హీరోలోని మొండితనాన్ని లేదా ఆవేశాన్ని ప్రతిబింబిస్తుందని కొందరు సమర్థిస్తున్నారు.

అయితే మరో కోణం నుండి చూస్తే ఇది ఖచ్చితంగా ఒక అనారోగ్యకరమైన ట్రెండ్ అని చెప్పక తప్పదు. కేవలం విజిల్స్ వేయించుకోవడానికి లేదా సోషల్ మీడియాలో క్లిప్స్ వైరల్ అవ్వడానికి ఇలాంటి పదజాలాన్ని కథలోకి జొప్పించడం వల్ల సినిమా గౌరవం తగ్గుతోంది. కుటుంబ సమేతంగా సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు ఇది తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. నిజమైన హీరోయిజం అనేది అద్భుతమైన సంభాషణలు, నటన , భావోద్వేగాల ద్వారా పండాలి తప్ప అసభ్య పదజాలం ద్వారా కాదని పెద్దలు భావిస్తున్నారు. ఈ ధోరణి భవిష్యత్తులో మన భాష -సంస్కృతిపై కూడా ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది.