'డాన్ 3' వివాదంలోకి అమీర్ ఖాన్ ఎంట్రీ!
బాలీవుడ్ `డాన్` సిరీస్ మూడవ భాగం చుట్టూ చెలరేగిన వివాదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి.
By: Srikanth Kontham | 12 Jun 2026 4:00 PM ISTబాలీవుడ్ `డాన్` సిరీస్ మూడవ భాగం చుట్టూ చెలరేగిన వివాదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. షారుఖ్ ఖాన్ స్థానంలో రణవీర్ సింగ్‌ను ఎంపిక చేసినప్పటి నుండి మొదలైన వివాదం తాజాగా ఆర్థిక నష్టాలు .. అంతర్గత విభేదాల స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కీలక సభ్యుడు అశోక్ పండిట్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. ప్రాజెక్ట్ పై నెలకొన్న వివాదాలను పరిష్కరించడానికి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ రంగంలోకి దిగినట్లు అశోక్ పండిట్ ఓ ఇంటర్వ్యూలో వెల్ల డించారు.
దర్శకుడు ఫర్హాన్ అక్తర్- రణవీర్ సింగ్ , పంపిణీదారుల మధ్య నెలకొన్న విభేదాలను సామరస్య పూర్వ కంగా ముగించడానికి అమీర్ ఖాన్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. పరిశ్రమలో అందరితోనూ మంచి సంబంధాలున్న అమీర్ ఖాన్ లాంటి అగ్ర నటుడు వివాదంలో మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకు రావడంతో పరిష్కారానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అలాగే ప్రాజెక్ట్ ఆలస్యం కావడం.. తలెత్తిన వివాదాల కారణంగా పంపిణీదారులు, నిర్మాతలు భారీగా నష్టపోయారని అశోక్ పండిట్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మొత్తం వ్యవహారంలో హీరో రణవీర్ సింగ్ వైఖరిని ఆయన తప్పుబట్టారు. సినిమా నిలిచిపోవడం వల్ల పంపిణీ దారులకు వాటిల్లిన నష్టాలను రణవీర్ సింగ్ స్వయంగా తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. పెద్ద ప్రాజెక్ట్ అనుకున్న ప్రకారం జరగనప్పుడు దానికి సంబంధించిన ప్రధాన ఆకర్షణ అయిన స్టార్ హీరోలే బాధ్యత వహించా లనేది పండిట్ వాదనగా కనిపిస్తుంది. అలాగే దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ఎదుర్కొంటున్న ఒత్తిడిని కూడా పండిట్ ప్రస్తావించారు. అసలు కథపై స్పష్టత లేకపోవడం, షారుఖ్ ఖాన్ అభిమానుల నుండి వస్తున్న వ్యతిరేకత , బిజినెస్ పరంగా ఎదురవుతున్న అడ్డంకులు ఫర్హాన్‌ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయన్నారు.
`డాన్` బ్రాండ్‌ను కాపాడుకుంటూనే కొత్త నటుడితో ప్రేక్షకులను మెప్పించడం ఫర్హాన్‌కు కత్తిమీద సాములా మారిందని..దీనికి తోడు ఆర్థికపరమైన లావాదేవీల చిక్కులు ప్రాజెక్ట్ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయన్నారు. దీనికి సంబంధించి బాలీవుడ్ బిజినెస్ వర్గాలేమంటున్నాయంటే? `డాన్ 3` పై ఉన్న నెగిటివిటీ కారణంగా బిజినెస్ డీల్స్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. గతంలో అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ వంటి దిగ్గజాలు పోషించిన డాన్ పాత్రలో రణవీర్ సింగ్‌ను సగటు సినిమా ప్రేక్షకుడు పూర్తిగా ఆమోదించలేకపోతున్నాడనే సంకేతాలు పంపిణీదారులలో ఆందోళన కలిగిస్తున్నాయి. మార్కెట్ ఒత్తిళ్ల వల్లే అమీర్ ఖాన్ లాంటి సీనియర్ హీరోలు రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సి వచ్చిందని బిజినెస్ వర్గాలు భావిస్తున్నాయి. మరి అమీర్ ఖాన్ రాయబారం ఎంత వరకూ ఫలిస్తుందో చూడాలి.
