Begin typing your search above and press return to search.

సంగీత ప్రపంచంలో విషాదం.. డాలీ పార్టన్ కన్నుమూత

అమెరికన్ మ్యూజిక్ దిగ్గజం, సింగ‌ర్, నటి, లిరిక్ రైట‌ర్, దాతృత్వవేత్త డాలీ పార్టన్ కన్నుమూశారు. 80 ఏళ్ల వయసులో ఆగస్టు 25న నాష్‌విల్లేలో ఆమె తుదిశ్వాస విడిచారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   26 Aug 2026 10:40 AM IST
సంగీత ప్రపంచంలో విషాదం.. డాలీ పార్టన్ కన్నుమూత
X

అమెరికన్ మ్యూజిక్ దిగ్గజం, సింగ‌ర్, నటి, లిరిక్ రైట‌ర్, దాతృత్వవేత్త డాలీ పార్టన్ కన్నుమూశారు. 80 ఏళ్ల వయసులో ఆగస్టు 25న నాష్‌విల్లేలో ఆమె తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమెకు నాష్‌విల్లేలోని వాండర్‌బిల్ట్- ఇంగ్రామ్ క్యాన్సర్ సెంటర్‌లో ట్రీట్‌మెంట్ అందిస్తుండగా, కుటుంబ సభ్యుల సమక్షంలో మరణించినట్లు ఆమె ప్రతినిధులు వెల్లడించారు.

టెన్నెస్సీ పర్వత ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన డాలీ పార్టన్ జ‌ర్నీ అమెరికన్ ఎంటర్‌టైన్‌మెంట్ హిస్ట‌రీలోనే ఒక అసాధారణ విజయగాథ. చిన్న వయసులోనే చర్చిలో పాటలు పాడటం ప్రారంభించిన ఆమె, క్రమంగా స్థానిక టెలివిజన్ కార్యక్రమాల్లో కనిపించి, 13 ఏళ్లకే ప్రతిష్ఠాత్మక గ్రాండ్ ఓలే ఓప్రి వేదికపై అడుగుపెట్టారు. అనంతరం నాష్‌విల్లే చేరుకుని తన పాటలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

జోలీన్, ఐ విల్ ఆల్వేస్ లవ్ యూ, కోట్ ఆఫ్ మెనీ కలర్స్ వంటి పాటలు ఆమెను ప్రపంచవ్యాప్తంగా స్టార్‌గా నిలబెట్టాయి. ముఖ్యంగా ఐ విల్ ఆల్వేస్ లవ్ యూ సాంగ్‌కు విట్నీ హ్యూస్టన్ అందించిన వెర్షన్ ఇంటర్నేష‌న‌ల్ లెవెల్ లో సెన్సేష‌న‌ల్ స‌క్సెస్‌ను సాధించడంతో డాలీ రాసిన ఈ పాటకు మరింత విస్తృతమైన గుర్తింపు లభించింది. ఆమె మ్యూజిక‌ల్ జ‌ర్నీ కంట్రీకి మాత్రమే పరిమితం కాకుండా పాప్, సినిమా, టెలివిజన్ రంగాలకూ విస్తరించింది.

మ్యూజిక్‌తో పాటు సినిమాల్లోనూ డాలీ తనదైన ముద్ర వేశారు. 9 టు 5, ది బెస్ట్ లిటిల్ వోర్‌హౌస్ ఇన్ టెక్సాస్, స్టీల్ మాగ్నోలియాస్ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన ప్రత్యేకమైన గ్లామర్, కామెడీ టైమింగ్, ఆత్మవిశ్వాసంతో ఆమె ఇతర మహిళా కళాకారులకు కూడా స్ఫూర్తిగా నిలిచారు. అయితే డాలీ పార్టన్ వారసత్వం కేవలం సంగీతం, సినిమాలకే పరిమితం కాలేదు. పిల్లల చదువును ప్రోత్సహించేందుకు ప్రారంభించిన ఇమాజినేషన్ లైబ్రరీ కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది పుస్తకాలను పిల్లలకు అందించారు. డాలీవుడ్‌ ద్వారా తన స్వస్థల ప్రాంత ఆర్థికాభివృద్ధికి కూడా ఆమె కీలకంగా మారారు. మానవతా సేవలకు గాను ఆమె ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు. దాదాపు ఏడు దశాబ్దాల కెరీర్‌లో మ్యూజిక్, సినిమా, బిజినెస్, ఛారిటీ.. ఇలా ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేసిన డాలీ పార్టన్ మరణం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను విషాదంలో ముంచింది. ఆమె పాట‌లు, తెరపై ప్రదర్శనలు, ముఖ్యంగా సమాజానికి అందించిన సేవలు తరతరాలకు ఆమెను సజీవంగా నిలబెట్టనున్నాయి.