రైన్‌స్టోన్ మెరుపుల వెనుక వ్యాపార సామ్రాజ్యం!
కంట్రీ మ్యూజిక్ లెజెండ్ డాలీ పార్టన్ అద్భుతమైన గాయకురాలు ..పాటల రచయిత్రి మాత్రమే కాదు. ఒక అసాధారణ వ్యాపారవేత్తగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు.
By: Srikanth Kontham | 27 Aug 2026 12:11 PM ISTకంట్రీ మ్యూజిక్ లెజెండ్ డాలీ పార్టన్ అద్భుతమైన గాయకురాలు ..పాటల రచయిత్రి మాత్రమే కాదు. ఒక అసాధారణ వ్యాపారవేత్తగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు. అత్యంత పేదరిక నేపథ్యం నుండి వచ్చి అద్భుతమైన ప్రతిభ .. పట్టుదలతో కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజాన్ని నిర్మించారు. డాలీ జీవితం కేవలం వినోద రంగానికే పరిమితం కాకుండా ఎంతోమంది వ్యాపారవేత్తలకు గొప్ప స్ఫూర్తిని అందిస్తుంది. డాలీ పార్టన్ కెరీర్ ప్రారంభంలోనే అత్యంత తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా, తాను రచించిన అన్ని పాటల కాపీరైట్‌లను తన వద్దే ఉంచుకునేలా జాగ్రత్త పడ్డారు.
దీంతో డాలీ పాటలు ఎక్కడ ప్లే అయినా? ఎవరు రీమేక్ చేసినా? వాటి రాయల్టీ నేరుగా ఆమెకే దక్కేది. ఈ ముందుచూపు నిర్ణయమే డాలీ మ్యూజిక్ క్యాటలాగ్‌కు కోట్ల విలువైన ఆస్తులను సమకూర్చింది. డాలీ పార్టన్ వ్యాపార సామ్రాజ్యంలో `డాలీవుడ్` థీమ్ పార్క్ అత్యంత కీలకమైన మైలురాయి. టెన్నెస్సీలో ఉన్న ఈ అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో డాలీకి 50 శాతం వాటా ఉంది. చిన్నతనంలో డిస్నీలాండ్‌కు వెళ్లే స్థోమత లేని డాలీ తన సొంత ప్రాంతంలోనే పిల్లలందరూ ఆనందించేలా అద్భుతమైన వినోద కేంద్రాన్ని సృష్టించారు. ఇది ఆ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు .. పర్యాటక రంగ అభివృద్ధికి ఎంతో దోహదపడింది.
ప్రపంచవ్యాప్తంగా డాలీ పార్టన్ సంగీతం, థీమ్ పార్కులకే పరిమితం కాలేదు. కాస్మెటిక్ ఉత్పత్తులు, పెట్ ప్రొడక్ట్స్, సినిమాలు, టీవీ షోలు, రిసార్ట్‌ల ద్వారా వ్యాపారాన్ని విస్తరించుకున్నారు. విభిన్న రంగాల్లో తన బ్రాండ్‌ను నిలబెట్టుకుంటూ ఫోర్బ్స్ జాబితాలో అత్యధిక సంపద గల స్వయంకృషి మహిళల్లో ఒకరిగా నిలిచారు. సంగీత రంగంలో అసాధారణ విజయాలతో పాటు, సమాజానికి తిరిగి ఇవ్వడంలోనూ ఆమె ఎప్పుడూ ముందుండేవారు. `ఇమాజినేషన్ లైబ్రరీ` ద్వారా మిలియన్ల కొద్దీ పుస్తకాలను పిల్లలకు ఉచితంగా అందించి అక్షరాస్యతకు కృషి చేశారు.
అలాగే విద్య, కోవిడ్ పరిశోధనలు , ప్రకృతి వైపరీత్యాల సహాయం కోసం పదుల కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చి గొప్ప మానవతావాదిగా నిలిచారు. అలాగే తన రైన్‌స్టోన్ దుస్తులు ..అందమైన రూపం వెనుక పదునైన వ్యాపార మెదడు దాగి ఉందని పలుమార్లు నిరూపించారు. `నేను ఒక మహిళలా కనిపిస్తాను. కానీ ఒక పురుషుడిలా ఆలోచిస్తాను` అని ఆమె చెప్పిన మాటలు వ్యాపార చతురతకు నిదర్శనం. తనదైన శైలిలో అడుగులు వేస్తూ ఆత్మవిశ్వాసంతో వ్యాపార ప్రపంచాన్ని జయించిన డాలీ పార్టన్ ప్రయాణం ఎప్పటికీ చిరస్మరణీయమైనది.
