ట్రోల్స్ వర్సెస్ బాక్సాఫీస్.. ఈ రచ్చతో సినిమాలకు నష్టమా?
టాలీవుడ్ నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
By: M Prashanth | 20 Jun 2026 11:25 AM ISTటాలీవుడ్ నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కనీసం టీజర్ కూడా రాకముందే కొన్ని సినిమాలపై నెటిజన్ల మధ్య రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఇదే క్రమంలో ఈ భారీ ప్రాజెక్టులపై వరుసగా నెగిటివ్ ట్రెండ్స్ కూడా కనిపిస్తుండటం మరో షాకింగ్ ట్విస్ట్.
ఆన్లైన్ లో నడుస్తున్న ఈ ట్రెండ్స్ వెనుక ప్రధానంగా రెండు రకాల కారణాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు కావాలనే కొందరు పెయిడ్ బ్యాచ్ లతో నెగిటివ్ ప్రచారం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. మరోవైపు భారీ బడ్జెట్ తో వచ్చే పాన్ ఇండియా సినిమాలపై ప్రేక్షకుల్లో కూడా అంచనాలు హై రేంజ్ లో ఉంటాయి. ఆ రేంజ్ కు తగ్గట్లుగా చిన్న అప్డేట్ రాకపోయినా, ఏ చిన్న తప్పు దొరికినా సోషల్ మీడియాలో భూతద్దంలో పెట్టి వెతకడం ఈ రోజుల్లో బాగా కామన్ అయిపోయింది.
అయితే సోషల్ మీడియాలో జరిగే ఈ రచ్చకు, థియేటర్ల దగ్గర ఉండే వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉంటుంది. ట్విట్టర్ లాంటి ప్లాట్ ఫామ్స్ లో ఒక సినిమా మీద ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా అది చాలా వరకు ఆన్లైన్ ప్రపంచానికే పరిమితం అవుతుంది. కంటెంట్ జనాలకు కనెక్ట్ అయితే ఈ ట్రోల్స్ పెద్దగా ప్రభావం చూపించలేవు. గతంలో వచ్చిన మన భారీ బ్లాక్ బస్టర్స్ ఎన్నో ఈ విషయాన్ని నిరూపించాయి.
రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి RRR సినిమాలకే ఇలాంటి పరిస్థితి ఎదురైంది. సినిమాలు వచ్చాక కూడా లాజిక్స్ లేవని, గ్రావిటీకి విరుద్ధంగా యాక్షన్ సీన్స్ ఉన్నాయని సోషల్ మీడియాలో కొందరు విమర్శలు చేశారు. ఆ ట్రోలింగ్ గురించి అప్పట్లో పెద్ద చర్చే నడిచింది. కానీ సినిమా ఎమోషన్ కు ఆడియన్స్ కనెక్ట్ అవ్వడంతో ఏకంగా ఆస్కార్ స్థాయికి వెళ్లి గ్లోబల్ హిట్ గా నిలిచింది.
ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన కేజీఎఫ్ 2, సలార్ లాంటి భారీ యాక్షన్ సినిమాల విషయంలో కూడా దాదాపు ఇలాగే జరిగింది. కేవలం డార్క్ థీమ్ వాడారని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్కువైందని ఆన్లైన్ లో రకరకాలుగా కామెంట్స్ వచ్చాయి. కానీ మాస్ ఆడియన్స్ ఆ ఎలివేషన్స్ ను బాగా ఎంజాయ్ చేశారు. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించి ఆ విమర్శలకు ప్రాక్టికల్ గా సమాధానం చెప్పాయి.
ఇప్పుడు రాబోయే భారీ సినిమాల విషయంలో కూడా ఇదే ఫార్ములా అప్లై అవుతుందని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో విమర్శలు రావడం ఇప్పుడు మామూలే కాబట్టి, మేకర్స్ కూడా వీటిని పాజిటివ్ గా తీసుకుని మరింత జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఫైనల్ గా జనం ఇచ్చే తీర్పే ఇక్కడ ముఖ్యం. కంటెంట్ లో దమ్ము ఉంటే బాక్సాఫీస్ దగ్గర ఆటోమేటిక్ గా బ్లాక్ బస్టర్ కొట్టడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.
