Begin typing your search above and press return to search.

గుండెపోటుతో 30 ఏళ్ల హర్యానా నటి మృతి

విన్నంతనే అయ్యో అనిపించే విషాద ఉదంతం ఒకటి చిత్రపరిశ్రమలో చోటు చేసుకుంది.

By:  Garuda Media   |   23 April 2026 10:38 AM IST
గుండెపోటుతో 30 ఏళ్ల హర్యానా నటి మృతి
X

విన్నంతనే అయ్యో అనిపించే విషాద ఉదంతం ఒకటి చిత్రపరిశ్రమలో చోటు చేసుకుంది. గుండెపోటుతో హర్యానాకు చెందిన 30 ఏళ్ల దివ్యాంక శిరోహి మరణించారు. మంగళవారం రాత్రి అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఉదంతం చిత్రపరిశ్రమకు షాకింగ్ గా మారింది. రాత్రి ఎనిమిది గంటల వేళలో ఇంట్లో కింద పడిపోయినట్లుగా దివ్యాంకను గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లుగా వైద్యులు వెల్లడించారు. ఆమె అంత్యక్రియలు ఘజియాబాద్ లో జరిగాయి.

చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించిన దివ్యాంక ఉదంతం ఆమె అభిమానులను.. చిత్రపరిశ్రమలోని వారిని తీవ్ర విసాదానికి గురి చేసింది. ఆమె మరణంపై కుటుంబ సభ్యులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దివ్యాంక స్వస్థలం ఉత్తరప్రదేశ్ కాగా.. ఆమె సోదరుడు హిమాంశు.. సోదరీమణులు దీపాంశు.. జస్మీత్ తో కలిసి ఉంటున్నారు. ఫ్యామిలీ పర్సన్ గా ఆమెను చెబుతుంటారు. తల్లిదండ్రులు కూడా వీరితో కలిసి ఉంటారని చెబుతున్నారు. తండ్రి వ్యాపారి కాగా.. తల్లి గృహిణి .

1996 నవంబరు 19న పుట్టిన ఆమె.. మీరట్ లోని చౌదరి చరణ్ సింగ్ వర్సిటీలో బీసీఏ.. సిక్కింలో ఎంబీఏను పూర్తి చేశారు. యాభైకు పైగా హర్యానా పాటల్లో నటించటమే కాదు.. హర్యానాకు చెందిన అగ్రశ్రేణి గాయకులు మాసూమ్ శర్మ.. అమిత్ సైని రోహ్ తకియా.. కేడీ లాంటి ప్రముఖులతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇటీవల కాలంలో సినిమాల్లో అవకాశాలు లభిస్తున్నాయి. టిక్ టాక్ ఉన్న కాలంలో ఆమె చేసిన ఒక వీడియో ఆమెనురాత్రికి రాత్రి స్టార్ ను చేసింది. సదరు వీడియో ఏకంగా 20 మిలియన్ల వ్యూస్ ను సాధించింది. ‘మేరీ మమ్మీ’ అనే వీడియో ఆమె కోట్లాది మందికి సుపరిచితురాలిగా మారింది.

ఆమె తుదిశ్వాస విడిచిన రాత్రి వేళ.. తన సోదరుడికి వంట చేసినట్లుగా చెబుతున్నారు. అంకాదు.. సోదరుడు ఇంట్లో నుంచి బయటకు వెళుతూ.. తాను బయటకు వెళుతున్నట్లుగా పేర్కొంటూ.. గేటు వేసుకోవాలని కోరుతూ మెసేజ్ పెట్టగా.. అందుకు ఆమె ఓకే అంటూ రిప్లై ఇచ్చింది.అదే ఆమె చివరి మెసేజ్ గా చెబుతున్నారు. సాయంత్రం నుంచి తన ఆరోగ్యం సరిగా లేదని.. నీరసంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పారు. నడుస్తూ తూలి కింద పడిపోవటం.. తలకు పెద్ద గాయం తగలటం.. ఆమె పడిన శబ్దానికి ఇంట్లోని వారు చూసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లుగా చెబుతున్నారు

ఆమె ఆకస్మిక మరణం గురించి తెలిసిన వారంతా షాక్ తింటున్నారు. ఆమె చివరగా మార్చి 19న ఒక వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశారు. అందులో బ్లూ ఫ్లోరల్ డ్రెస్ లో బి ప్రాక్- అఫ్సానా ఖాన్ పాడిన పాటకు డాన్స్ చేస్తున్న వీడియోను అప్ లోడ్ చేశారు. ఆ వీడియోకు రాధే రాధే అన్న క్యాప్షన్ ఇచ్చారు. ఆమె మరణం సందర్భంగా మరో విషయాన్ని ఆమె అభిమానులు షేర్ చేస్తున్నారు. ఇటీవల ఆమె తన ఇన్ స్టాలో ఒక ఫోటోను పిన్ చేశారు. అందులో నీలిరంగు జాకెట్.. మెరూన్ కలర్ తలపాగా ధరించి.. ఆ ఫోటోకు ‘శివా.. నన్ను నీతో తీసుకెళ్లు’ అన్న క్యాప్షన్ ఇవ్వటం గమనార్హం. ఫ్యామిలీ పర్సన్ గా పేరున్న ఆమె వివాదాలకు కాస్తంత దూరంగా ఉంటారని చెబుతున్నారు. ఏమైనా.. పిన్న వయసులోనే ఆకస్మిక మరణం చెందిన ఆమె ఉదంతం సినీ పరిశ్రమకు షాకింగ్ గా మారింది.