Begin typing your search above and press return to search.

19 ఏళ్లకే నేల రాలిన అందాల తార

ఆ అందాల తార ఇక లేదు, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది అని దాంతో భారతీయ సినీ ప్రపంచం మొత్తం షాక్ లోకి వెళ్ళిపోయింది. ఆ అందాల తార దివ్య భారతి. ఆమె సినీ జీవితం ఇలా మొదలై అలా రెండు రీళ్ళకే ఎండ్ కార్డు పడిపోయింది.

By:  Satya P   |   6 April 2026 7:00 AM IST
19 ఏళ్లకే నేల రాలిన అందాల తార
X

అతి చిన్న వయసులోనే సినీ రంగంలో ప్రవేశించి తనకంటూ సొంత శైలిని సృష్టించుకుంది. అందంలో ఆనాటి లేడీ సూపర్ స్టార్ అతిలోక సుందరి శ్రీదేవితో పోటీ పడి సరిసాటి అనిపించుకుంది. గ్లామర్ తో బాలీవుడ్ టాలీవుడ్ ని ఉర్రుతలూగించింది. అతి కొద్ది సమయంలో ఎన్నో చిత్రాలలో నటించింది. వాటిలో అధిక శాతం హిట్లుగా నిలిచి ఆమెకు బ్రహ్మాండమైన కెరీర్ ని బిల్డప్ చేసి పెట్టాయి. వయసు చూస్తే రెండు పదులు నిండలేదు, కెరీర్ పరంగా ఎంతో ఫ్యూచర్ ఉంది. అయితే ఉన్నట్లుండి పిడుగు లాంటి వార్త. ఆ అందాల తార ఇక లేదు, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది అని దాంతో భారతీయ సినీ ప్రపంచం మొత్తం షాక్ లోకి వెళ్ళిపోయింది. ఆ అందాల తార దివ్య భారతి. ఆమె సినీ జీవితం ఇలా మొదలై అలా రెండు రీళ్ళకే ఎండ్ కార్డు పడిపోయింది.

బొబ్బిలి రాజాతో ఎంట్రీ :

దివ్య భారతి తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ విక్టరీ వెంకటేష్ తో నిర్మించిన బొబ్బిలి రాజాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేశారు. ఈ మూవీలో మొదట అనుకున్నది నగ్మా అని చెబుతారు. కానీ చివరికి దివ్య భారతి వచ్చి చేరింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో వరసబెట్టి తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువలా వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవితో రౌడీ అల్లుడు మూవీలో దివ్య భారతి నటించింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మోహన్ బాబుతో అసెంబ్లీ రౌడీ సెన్సేషనల్ హిట్ అయింది. బాలయ్యతో ధర్మక్షేత్రం మూవీ కూడా క్రేజీ ప్రాజెక్ట్ గా జనం ముందుకు వచ్చింది. ఈ సినిమాల తర్వాత దక్షిణాదిలో ఇంకా కొన్ని హిట్ సినిమాల్లో దివ్య భారతి నటించింది.

పదహారేళ్ళకే :

ఇక 1974 ఫిబ్రవరి 25న ముంబైలో జన్మించిన దివ్య భారతి 16 ఏళ్ళకే హీరోయిన్ అయిపోయింది.. ఇక ఆమె సినీ కెరీర్ బాలీవుడ్ నుంచి 1990 లో మొదలైంది. తొలి దశలోనే దీవానా షోలా ఔర్ షబ్నమ్ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించి ఒక ప్రముఖ తారగా వెలుగొందింది. 1990 -93 మధ్యలో బాలీవుడ్ లో సుమారు 14 సినిమాల్లో దివ్యభారతి నటించింది. సూపర్ స్టార్ డమ్ ని దక్కించుకుంది. దాంతో టాలీవుడ్ సైతం ఆమెని ఆకర్షించింది. తన మొత్తం కెరీర్ లో 20కి పైగా సినిమాల్లో నటించిన దివ్యభారతి బాలీవుడ్ లో టాప్ చెయిర్ వైపు దూసుకెళ్తున్న తరుణంలో హఠాత్తుగా అదృశ్యం అయింది.

రహస్య వివాహం :

ఇదిలా ఉంటే దివ్య భారతి 18 ఏళ్ల వయసులో 1992 మే 10న బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలాను రహస్యంగా వివాహం చేసుకుంది. షోలా ఔర్ షబ్‌నం సినిమా షూటింగ్ సమయంలో హీరో గోవింద ద్వారా దివ్యభారతికి దర్శక నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా పరిచయమయ్యారు. అలా వీరి పరిచయం ప్రేమగా మారి చివరికి పెళ్ళికి దారి తెసింది. ఈ పెళ్ళి రహస్యంగా సాజిద్ స్వగృహంలో కేవలం దివ్యభారతి, సాజిద్ అతి తక్కువ స్నేహితుల మధ్య జరిగింది.

వీడని మర్డర్ మిస్టరీ :

ఇక వివాహం అయిన పదకొండు నెలలకే అంటే 1993 ఏప్రిల్ 5న దివ్యభారతి మరణించింది. దివ్య భారతి 19 ఏళ్ళ వయసులో అనుమానాస్పద మరణించడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇప్పటికీ ఆమె మృతికి కారణాలు అంతుపట్టని తీరుగానే ఉండడం విశేషం. బాలీవుడ్‌లో వేగంగా ఎదుగుతున్న దివ్య భారతి, ముంబైలోని తన ఐదో అంతస్తు అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి కిందపడి మరణించింది. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అయినప్పటికీ ఆ భవనం నుంచి ప్రమాదవశాత్తు కింద పడటం కారణమని అధికారికంగా నిర్ధారించారు. దివ్య భారతి మరణం అన్నది ఈ రోజుకీ ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఇక ఆమె దివ్య భారతి చివరి చిత్రాలైన రంగ్ శత్రంజ్ మరణానంతరం విడుదలై మంచి ఆదరణ పొందాయి.