Begin typing your search above and press return to search.

రామాయణం వెనుక తెలియని డ్రామా.. రిజెక్ట్ చేసిన అంతర్జాతీయ సంస్థ డీస్నీ!

రామానంద్ సాగర్‌కు కోటి రూపాయల ఫైనాన్స్ అందిస్తే ఈ షో హక్కులు డిస్నీకి లభిస్తాయని లలిత్ మోడీ డిస్నీ ఉన్నతాధికారులను ఒప్పించే ప్రయత్నం చేశారు.

By:  Srikanth Kontham   |   14 Oct 2026 8:00 PM IST
రామాయణం వెనుక తెలియని డ్రామా.. రిజెక్ట్ చేసిన  అంతర్జాతీయ సంస్థ డీస్నీ!
X

టెలివిజన్ చరిత్రలో రామానంద్ సాగర్ రూపొందించిన `రామాయణం` -బి.ఆర్. చోప్రా `మహాభారతం` సీరియళ్ళు మైలురాళ్ళుగా నిలిచిపోయాయి. ఇప్పటికీ ఈ పౌరాణిక సీరియళ్లకు ప్రత్యేక ఆదరణ ఉంది. అయితే అత్యంత ప్రజాదరణ పొందిన `రామాయణం` ప్రాజెక్ట్‌కు ఆర్థిక సహాయం అందించడానికి ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ది వాల్ట్ డిస్నీ నిరాకరించిందని ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఆ సమయంలో దూరదర్శన్‌కు సొంతంగా కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేసే విధానం లేదని, నిర్మాతలు గంటల ప్రాతిపదికన రుసుము చెల్లించాల్సి వచ్చేదన్నారు. ఆ రోజుల్లోనే తాను డిస్నీ సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉండ‌టంతో విదేశీ కంటెంట్‌ను భారతదేశానికి తీసుకురావడం ద్వారా మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ , ప్రొడక్షన్ వ్యవస్థను నిర్మించానని తెలిపారు. ఆ సమయంలోనే రామానంద్ సాగర్, బి.ఆర్. చోప్రాలు తమ సీరియళ్లకు ఫైనాన్స్ చేయాలని తనను సంప్రదించారని లలిత్ మోడీ వివరించారు.

రామానంద్ సాగర్‌కు కోటి రూపాయల ఫైనాన్స్ అందిస్తే ఈ షో హక్కులు డిస్నీకి లభిస్తాయని లలిత్ మోడీ డిస్నీ ఉన్నతాధికారులను ఒప్పించే ప్రయత్నం చేశారు. మొదట్లో డిస్నీ ప్రతినిధులు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతో అభ్యంతరం వ్యక్తం చేసినా? లలిత్ మోడీ ఒత్తిడి మేరకు భారత పర్యటనకు వచ్చి రామానంద్ సాగర్‌తో సమావేశానికి అంగీకరించారు. డిస్నీ యాజమాన్యం తమ పెద్ద బృందంతో ప్రైవేట్ జెట్లలో ఈ డీల్ కోసం ఇండియాకు చేరుకుంది.

ఈ కీలకమైన సమావేశానికి రామానంద్ సాగర్ సాధారణమైన షార్ట్స్ వేసుకుని వచ్చారని లలిత్ మోడీ గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో కార్పొరేట్ మీటింగ్‌లకు అందరూ సూట్లు వేసుకుని ప్రొఫెషనల్‌గా వచ్చేవారని, పైగా సాగర్‌కు ఇంగ్లీష్‌ మాట్లాడటంలో కూడా కొంత ఇబ్బంది ఉండేదన్నారు. ఇరువర్గాలు పరస్పరం మాట్లాడుకున్న విషయాలు సరిగ్గా అర్థం కాకపోవడంతో డిస్నీ ఉన్నతాధికారులకు రామానంద్ సాగర్ ఎలాంటి ఇంప్రెషన్ కలిగించలేకపోయారు. డిస్నీ ప్రెసిడెంట్ ఆ గది నుండి వెంటనే బయటకు వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారని మోడీ గుర్తు చేసుకున్నారు.

కార్పొరేట్ ప్రపంచంలో సాధారణంగా పిచ్‌లు, విజువల్ ప్రెజెంటేషన్లు ఆశిస్తారని కానీ భారతీయ టెలివిజన్ రంగంలో అంతటి భారీ స్థాయిలో పౌరాణిక సీరియల్ సాధించగల సామర్థ్యాన్ని డిస్నీ ప్రతినిధులు అంచనా వేయలేకపోయారని మోడీ అభిప్రాయపడ్డారు. పార్టనర్‌షిప్ వ్యాపారం కావడంతో డిస్నీ తిరస్కరించిన తర్వాత తాను కూడా ఏమీ చేయలేకపోయానని తెలిపారు.

అయినా? 1987 జనవరి నుండి 1988 జులై వరకు దూరదర్శన్‌లో ప్రసారమైన రామానంద్ సాగర్ `రామాయణం` (78 ఎపిసోడ్లు) అపూర్వ విజయాన్ని సాధించింది. అరుణ్ గోవిల్ (శ్రీరాముడు), దీపికా చిఖ్లియా (సీత), సునీల్ లాహ్రీ (లక్ష్మణుడు), అరవింద్ త్రివేది (రావణుడు) నటనతో ప్రేక్షకుల మనస్సుల్లో నిలిచిపోయారు. ప్రతీ ఆదివారం భారతదేశంలోని కోట్లాది మంది ప్రజలను టీవీల ముందుకు తీసుకొచ్చి భారతీయ బుల్లితెరపై `రామాయణం` చ‌రిత్ర‌గా మారిపోయింది.