Begin typing your search above and press return to search.

పదేళ్ల సక్సెస్ సీక్రెట్ బయటపెట్టిన దిశా పటాని!

‘ఎమ్.ఎస్. ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’తో 2016లో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన దిశా పటానీ పదేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తన ఎదుగుదలకు క్రమశిక్షణ, కష్టపడే తత్వమే కారణమని తెలిపింది. ఇతరుల అభిప్రాయాల కంటే మన పనిపై దృష్టి పెట్టాలని, ఫిట్‌నెస్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని చెప్పింది. తెలుగులో ‘లోఫర్’తో ఆమె నటిగా పరిచయమైంది.

By:  Srikanth Kontham   |   16 Nov 2026 1:28 PM IST
పదేళ్ల సక్సెస్ సీక్రెట్ బయటపెట్టిన దిశా పటాని!
X

గ్లామరస్ పాత్రలతో .. వైవిధ్యమైన నటనతో యూత్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి దిశా పటాని. టాలీవుడ్ టూ బాలీవుడ్ అమ్మ‌డి జ‌ర్నీ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్‌లో విజయవంతంగా పదేళ్ల ప్ర‌యాణాన్ని దిగ్విజ‌యంగా పూర్తి చేసుకుంది. 2016లో విడుదలైన `ఎమ్.ఎస్. ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ` చిత్రంతో సిల్వర్ స్క్రీన్‌కు పరిచయమైన అమ్మ‌డు అటుపై `బాఘీ 2`, `మలంగ్`, `కల్కి 2898 ఏడీ` వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది.

ఈ సంద‌ర్భంగా దిశా ప‌టానీ ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. ఇండస్ట్రీలో పదేళ్ల అనుభవం తనలో తెచ్చిన మార్పులను.. ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను దాటుకుని నేడు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడం వెనుక తనదైన శ్రమ దాగుందని పేర్కొన్నారు. `ఈ పదేళ్ల కాలం నన్ను ఒక వ్యక్తిగా మరింత పరిణతి చెందేలా చేసింది. ఇండస్ట్రీలో నా అంతర్గత శక్తిని.. నా ప్రవృత్తిని నమ్ముకోవడం నేను నేర్చుకున్నాను. స్క్రీన్ మీద నేను ఎంచుకునే పాత్రలైనా? బయట నేను ఫాలో అయ్యే ఫ్యాషన్ స్టైల్ అయినా? ఇప్పుడు పూర్తిగా నా మనసు చెప్పినట్టుగానే నడుచుకుంటాను` అని దిశ స్పష్టం చేశారు.

అలాగే సెలబ్రిటీ హోదాలో నిత్యం పడే పబ్లిక్ స్క్రూటినీ.. విమర్శలపై కీలక వ్యాఖ్యలు చేసారు. `బయట ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారనే విషయాలు మన ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ దెబ్బ తీయకూడదు. ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకుండా మన పనిపై మనం దృష్టి పెట్టాలి. సానుకూల వాతావరణంలో ఉంటూ ప్రతిరోజూ కష్టపడితే అదే అసలైన బలాన్నిస్తుంది` అని తెలిపారు. అలాగే ఫిట్‌నెస్.. బ్యూటీ వెనుక ఉన్న అసలు రహస్యం గురించి ఓపెన్ అయ్యారు. `క్రమశిక్షణే నా విజయానికి పునాది. ఫిట్‌నెస్ అనేది కేవలం అందంగా కనిపించడం కోసం మాత్రమే కాదు. అది మన మనసుకు బలమైన రక్షణ కవచం లాంటిది. ప్రతిరోజూ చేసే హార్డ్‌వర్క్ మనలో అంతర్గత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. నా ఈ కాన్ఫిడెన్స్ అంతా కేవలం నా డిసిప్లిన్ వ‌ల్లే వచ్చింది` అన్నారు.

దిశా ప‌టానీ సినీ కెరీర్ టాలీవుడ్ లోనే ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. 2015లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన `లోఫర్` సినిమాతో అమ్మ‌డు వెండితెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే ఓ రేంజ్ లో వైర‌ల్ అయింది. సినిమా ఫ‌లితం ఎలా ఉన్నా దిశ అందాల‌కు యువ‌త ఫిదా అయింది. అనంత‌రం బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీ అయింది. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత మళ్లీ తెలుగులో నేరుగా నటించిన పాన్-ఇండియా చిత్రం `కల్కి 2898 ఏడీ` అన్న సంగ‌తి తెలిసిందే.