Begin typing your search above and press return to search.

దిశా పటానీ ఫ్యామిలీకి సర్కార్ హామీ.. సీఎం ఏమన్నారంటే?

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ దిశా పటానీ ఇంటి వద్ద కాల్పుల ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   16 Sept 2025 3:44 PM IST
దిశా పటానీ ఫ్యామిలీకి సర్కార్ హామీ.. సీఎం ఏమన్నారంటే?
X

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ దిశా పటానీ ఇంటి వద్ద కాల్పుల ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో జరిగిన ఆ ఘటన.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. దిశా సోదరి ఖుష్భూ ఒక వర్గం మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చెయ్యడమే కాల్పులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

అయితే ఇప్పుడు కాల్పుల ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఘటనపై పూర్తి ఆరా తీశారు. దిశా పటానీ తండ్రి జగదీష్ పటానీతో తాజాగా ఫోన్ లో మాట్లాడారు. కాల్పులకు పాల్పడిన వారు ఎక్కడ ఉన్నా కూడా కచ్చితంగా పట్టుకుని తీరుతామని ఆదిత్య నాథ్ హామీ ఇచ్చారు.

ఈ మేరకు దిశా పటానీ తండ్రి మీడియాతో స్వయంగా ఆ విషయాన్ని పంచుకున్నారు. యోగి ఆదిత్యనాథ్‌ తమకు కాల్ చేసి ధైర్యం చెప్పారని తెలిపారు. రాష్టం మొత్తం తమకు అండగా ఉంటుందని చెప్పినట్లు పేర్కొన్నారు. తమకు పూర్తి భద్రతను ఇస్తామని, ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్లక్ష్యం చేయబోమని చెప్పినట్లు తెలిపారు.

ముఖ్యంగా ఘటనకు పాల్పడిన వారు అండర్‌ గ్రౌండ్‌ లో దాగి ఉన్నా కూడా పట్టుకుంటామని హామీ ఇచ్చినట్లు జగదీష్ పటానీ తెలిపారు. అయితే ఆయన పోలీస్ శాఖలో ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించి రిటైర్ అయ్యారు. అదే సమయంలో మాజీ ఆర్మీ అధికారిణి అయిన దిశా సోదరి ఖుష్బూ ప్రస్తుతం ఫిట్‌ నెస్‌ ట్రైనర్‌ గా పనిచేస్తున్నారు.

కాగా, సెప్టెంబర్ 12వ తేదీ తెల్లవారుజామున కాల్పుల ఘటన చోటు చేసుకుంది. బరేలీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉన్న దిశా పటానీ ఇంటి వెలుపల ఇద్దరు గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దాదాపు ఎనిమిది నుంచి పది రౌండ్ల పాటు ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు సమాచారం.

కాల్పుల శబ్దం చాలా దూరం వినిపించడంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. ఈ మేరకు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే కాల్పులను తామే జరిపామని గోల్టీ బ్రార్‌ గ్యాంగ్‌ ఇప్పటికే ప్రకటించింది. మనోభావాలను దెబ్బతీసినందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటూ సందేశం విడుదల చేసింది.