హాలీవుడ్ బాటలో భారతీయ భామలు!
అమ్మడు తన అంతర్జాతీయ ప్రయాణాన్ని`ది పోర్టల్ ఆఫ్ ఫోర్స్` అనే భారీ ప్రాజెక్టుతో ప్రారంభింస్తుంది. ఇదొక హై-యాక్షన్ , సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్నట్లు సమాచారం.
By: Srikanth Kontham | 12 May 2026 12:19 PM ISTఛాన్స్ రావాలే గానీ ప్రపంచంలో ఏ భాషలోనైనా నటించడానికి భారతీయ నటీమణులు ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. అవకాశం వస్తే వెళ్లడానికి హీరోలు ఆలోచిస్తారేమో గానీ హీరోయిన్లు మాత్రం కళ్లు మూసుకుని బోర్డర్ దాటేస్తుంటారు.
ఇప్పటికే ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, ఆలియా భట్ వంటి అగ్ర కథానాయికలు హాలీవుడ్ తెరపై మెరిసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి మరో గ్లామర్ బ్యూటీ దిశా పటానికి చేరుతుంది. తన విలక్షణమైన నటనతో అద్భుతమైన ఫిట్‌నెస్‌తో ప్రేక్షకులను అలరించిన అమ్మడు ఇప్పుడు హాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్దమవుతోంది.
అమ్మడు తన అంతర్జాతీయ ప్రయాణాన్ని`ది పోర్టల్ ఆఫ్ ఫోర్స్` అనే భారీ ప్రాజెక్టుతో ప్రారంభింస్తుంది. ఇదొక హై-యాక్షన్ , సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్నట్లు సమాచారం. సాధారణంగా బాలీవుడ్ సినిమాల్లో గ్లామర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దిశా హాలీవుడ్ చిత్రంలో మాత్రం నటనకు, యాక్షన్ సన్నివేశాలకు ప్రాధాన్యత ఉన్న పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం అమ్మడు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుందని తెలిసింది. భారతీయ నటి హాలీవుడ్ వరకు వెళ్లడం అనేది ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు.
ఇలాంటి అచీవ్ మెంట్స్ భారతీయ సినిమా ఎదుగుదలకు నిదర్శనం. గతంలో ప్రియాంక చోప్రా `క్వాంటికో, `బేవాచ్` చిత్రాలతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. అటుపై దీపికా పదుకొణే `ట్రిపుల్ ఎక్స్` సిరీస్‌తో హాలీవుడ్ లో అలరించారు. ఆలియా భట్ సైతం `హార్ట్ ఆఫ్ స్టోన్` మూవీతో హాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. దిశా పాట్నీ కూడా అదే బాటలో పయనిస్తూ అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలని ఆశిస్తుంది. దిశా పాట్నీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతర్జాతీయ ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్‌గా మారనుంది.
సొగసరి ఫిట్‌నెస్ వీడియోలు ,మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లను ఇంప్రెస్ చేసినట్లు సమాచారం. `ది పోర్టల్ ఆఫ్ ఫోర్స్` సినిమాలో ఆమె స్వయంగా కొన్ని రిస్కీ స్టంట్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అక్కడ తన నటనను నిరూపించుకోవడమే కాక భారతీయ నటీమణులు ఏ విధమైన కఠినమైన పాత్రలనైనా పోషించగలరని ప్రపంచానికి చాటి చెప్పడమే తన లక్ష్యమని ఓ సందర్భంలోనూ ఓపెన్ అయింది. ప్రస్తుతం భారతీయ నటీమణులకు హాలీవుడ్‌లో మంచి అవకాశాలొస్తున్నాయి. కథలో చిన్న భాగంలా కాకుండా,కీలకమైన పాత్రలను దక్కించుకుంటున్నారు.
దిశా పాట్నీ ఎంపిక చేసుకున్న సైన్స్ ఫిక్షన్ జోనర్ కెరీర్‌కు ఓ కొత్త దిశను ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్ర విజయంతో అమ్మడికి అంతర్జాతీయ వేదికపై మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. హాలీవుడ్ మేకింగ్ స్టైల్‌కు అనుగుణంగా దిశ తన బాడీ లాంగ్వేజ్‌ను, నటనను ఎలా మలుచుకుంటుందో? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్ లో కూడా కొన్ని ప్రాజెక్ట్ లకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.
