కాల్పుల ఘటనపై దిశా పటానీ తండ్రి
సల్మాన్ ఖాన్, కపిల్ శర్మ సహా పలువురు గాయకులపై గ్యాంగ్ స్టర్ల దాడులు మీడియాలో ప్రముఖంగా హెడ్ లైన్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 13 Sept 2025 10:22 AM ISTసల్మాన్ ఖాన్, కపిల్ శర్మ సహా పలువురు గాయకులపై గ్యాంగ్ స్టర్ల దాడులు మీడియాలో ప్రముఖంగా హెడ్ లైన్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. గాయకుడు సిద్ధూ మూసేవాలా, సల్మాన్ స్నేహితుడు, ఎమ్మెల్యే బాబా సిద్ధిఖిల దారుణ హత్యోదంతాలు, నిరంతర గ్యాంగ్ స్టర్ యాక్టివిటీస్ గురించి మీడియాలో చాలా పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఇటీవల సల్మాన్ ఖాన్ ఏదైనా షూటింగుకి వెళితే నిరంతరం తన చుట్టూ సెక్యూరిటీతో వెళుతున్నాడు. బుల్లెట్ ప్రూఫ్ కార్లను ఉపయోగిస్తున్నాడు. దీంతో సల్మాన్ కి ఎదురైన పరిస్థితి ఎవరికీ ఎదురు కాకూడదని అభిమానులు భావిస్తున్నారు.
ఇలాంటి సమయంలో మతపరమైన కామెంట్లు చేసింది! అంటూ ప్రముఖ నటి దిశా పటానీకి చెందిన బరేలి (యూపీ) నివాసం వెలుపల గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపడం సంచలనంగా మారింది. ఈ దాడితో సెలబ్రిటీల రక్షణపై మరోసారి సందేహాలు నెలకొన్నాయి. మత గురువు ప్రేమానంద్ మహారాజ్ పై దిశా పటానీ అనుచిత వ్యాఖ్యలు చేసిందంటూ గ్యాంగ్ స్టర్లు సోషల్ మీడియాల్లోని తమ నోట్ లో పేర్కొన్నారు. మత గురువులను అవమానిస్తే వదిలేది లేదని వారు హెచ్చరించారు. ధేలానా సోదరులు వీరేంద్ర -మహేంద్ర ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సంఘటన ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే ప్రక్రియలో ఉన్నారు.
తాజా సమాచారం మేరకు దిశా పటానీ తండ్రి జగదీష్ పటానీ పోలీసు ఫిర్యాదు చేశారు. ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయడానికి ఎస్ఎస్పీ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) సహా ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఇల్లు కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌపాలా చౌరాహా సమీపంలో ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఇంటి వద్దకు దుండగులు ఎలా వచ్చారు? అనేదానిపై సీసీ ఫుటేజ్ వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. ఈ కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
