దిశా పటానీ ఇంటిపై 8-10 రౌండ్లు కాల్పులు
బాలీవుడ్ అందాల కథానాయిక దిశా పటానీ ఇంటిపై దుండగుల కాల్పుల ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 13 Sept 2025 3:00 PM ISTబాలీవుడ్ అందాల కథానాయిక దిశా పటానీ ఇంటిపై దుండగుల కాల్పుల ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన శనివారం నాడు వేకువఝామున 3.30 గం.ల ప్రాంతంలో జరిగింది. ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి సుమారు 8 నుంచి 10 రౌండ్ల కాల్పులు జరిపారని తాజాగా దిశా పటానీ తండ్రి, రిటైర్డ్ పోలీస్ అధికారి జగదీష్ పటానీ ధృవీకరించారు. దిశా పటానీ ఇల్లు బేరేలీ (ఉత్తర ప్రదేశ్)లో ఉంది. అక్కడ దాడి చేయడానికి కారణం కూడా రివీలైంది.
ఈ దాడికి బాధ్యత వహిస్తూ గోల్డీ బ్రార్ అనుచరులు తమ సోషల్ మీడియాల్లో సుదీర్ఘ నోట్ పోస్ట్ చేసారు. హిందూ మత గురువులను అగౌరవపరిచే ఎవరిపై అయినా దాడికి పాల్పడతామని స్పష్ఠంగానే హెచ్చరించారు. ఈ ఘటనపై దిశా పటానీ తండ్రి జగదీష్ పటానీ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి విచారిస్తున్నారు.
అయితే ఈ ఘటనపై దిశా తండ్రి, రిటైర్డ్ పోలీసు అధికారి జగదీష్ పటానీ ఇప్పుడు మరిన్ని వివరాలు అందించారు. దుండగులు బైక్ పై వచ్చి కాల్పులు జరిపారు. విదేశాలలో తయారు చేసిన ఆయుధాలను ఉపయోగించారని ధృవీకరించారు. ఏఎన్ఐ వార్తా సంస్థతో జగదీష్ మాట్లాడుతూ.. ఇద్దరు గుర్తు తెలియని దుండగులు నా నివాసంపై కాల్పులు జరిపారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బరేలీ పోలీసులు, SSP & ADG అందరూ దీనిపై పని చేస్తున్నారు. దుండగుల వద్ద ఉన్న తుపాకులు స్వదేశీ తయారీవి కావు. అవి విదేశాలలో తయారయ్యాయి. మొత్తం 8-10 రౌండ్లు కాల్చారని నేను అనుకుంటున్నాను. గోల్డీ బ్రార్ బాధ్యతను తీసుకున్నారని సోషల్ మీడియా ద్వారా నాకు తెలిసింది కానీ ఇంకా స్పష్టంగా తెలియలేదు`` అని వెల్లడించారు.
బరేలి ఎస్ఎస్‌పి మాట్లాడుతూ.. తమకు ఘటనపై ఫిర్యాదు అందగానే, వెంటనే పోలీసు బృందాలను సంఘటనా స్థలానికి పంపామని తెలిపారు. మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో పటాని ఇంటిపై కాల్పులు జరిపారు. కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసాం. దిశా ఇంటి చుట్టూ సాయుధ పోలీసు సిబ్బందిని మోహరించాము అని తెలిపారు. నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటాము. నేను వ్యక్తిగతంగా కుటుంబాన్ని కలిసి వారి భద్రతకు హామీ ఇచ్చాను అని అన్నారు.
గోల్డీ బ్రార్ గ్రూప్ స్వయంగా ఈ దాడికి బాధ్యత వహించింది. ముఠా సభ్యుడు వీరేంద్ర చరణ్ ఫేస్‌బుక్‌లో వివరాలు రాసారు. నేను వీరేంద్ర చరణ్, మహేంద్ర శరన్ (దేలానా).. దిశా పటాని (బాలీవుడ్ నటి) ఇంట్లో కాల్పులు మా వల్లే జరిగాయి. ఆమె మన గౌరవనీయులైన సాధువులు ప్రేమానంద్ జీ మహారాజ్, అనిరుద్ధ్ ఆచార్య జీ మహారాజ్ లను అవమానించింది. మన సనాతన ధర్మాన్ని తక్కువ చేయడానికి ప్రయత్నించింది. అందుకే ఈ ట్రైలర్ వదిలాం అని తెలిపాడు. ప్రస్తుతం దిశా పటానీ ఇంటిపై పోలీసులు నిఘా ఉంచారు. పారిపోయిన వారిని వెతికి పట్టుకోనున్నారు.
