Begin typing your search above and press return to search.

ఏలియన్ల కథతో స్టీవెన్ స్పీల్‌బర్గ్ సరికొత్త ప్రయోగం!

హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ సైన్స్ ఫిక్షన్ - గ్రహాంతరవాసుల కథలను వెండితెరపై ఆవిష్కరించడంలో దిట్ట.

By:  Srikanth Kontham   |   9 Jun 2026 6:51 PM IST
ఏలియన్ల కథతో స్టీవెన్ స్పీల్‌బర్గ్ సరికొత్త ప్రయోగం!
X

హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ సైన్స్ ఫిక్షన్ - గ్రహాంతరవాసుల కథలను వెండితెరపై ఆవిష్కరించడంలో దిట్ట. `ఈటీ `, `క్లోజ్ ఎన్‌కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్`, `వార్ ఆఫ్ ది వరల్డ్స్` వంటి చిత్రాలతో ప్రపంచ ప్రేక్షకులను మైమరపించిన స్పీల్ బ‌ర్గ్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ అదే తరహా సరికొత్త చిత్రంతో రాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `డిస్‌క్లోజర్ డే` జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు ప్రపంచ సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ చిత్రం కేవలం ఊహాజనిత గ్రహాంతరవాసుల దాడికి సంబంధించినది కాదని దీని వెనుక బలమైన హ్యూమన్ డ్రామా ..ప్రభుత్వ రహస్యాల కథాంశం ఉందని స్పీల్‌బర్గ్ రివీల్ చేసారు. భూమిపై ఏలియన్ల ఉనికికి సంబంధించిన నిజాలను ప్రపంచానికి తెలియజేయాలనుకునే ఒక యువ విజిల్‌బ్లోయర్ కథ చుట్టూ తిరుగుతుంది. భారీ ప్రభుత్వ కుట్రను ఛేదించి, మానవ చరిత్రను శాశ్వతంగా మార్చేసే ఆ పరమ సత్యాన్ని ప్రపంచానికి డిస్‌క్లోజ్ చేయడమే ఈ చిత్రంలోని ప్రధానాంశం. స్పీల్‌బర్గ్ ఈ చిత్రకథను తానే స్వయంగా సిద్ధం చేసుకోగా.. ఆయనతో పాటు `జురాసిక్ పార్క్` ఫేమ్ డేవిడ్ కోయెప్ స్క్రీన్‌ప్లే అందించారు.

ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్స్ ఎమిలీ బ్లంట్, జోష్ ఓ కానర్, కోలిన్ ఫిర్త్, కోల్మన్ డొమింగో, ఈవ్ హెవ్సన్ కీలక పాత్రల్లో నటించారు. ఎమిలీ బ్లంట్ ఈ సినిమాలో వాతావరణ శాస్త్రవేత్తగా నటిస్తుండగా, ఆమె అనుకోకుండా ఒక గ్రహాంతర భాషలో మాట్లాడటం ప్రారంభించే సీన్ సినిమా ట్రైలర్‌లోనే ప్రేక్షకులను ఎంతగానో థ్రిల్ చేసింది. జోష్ ఓ కానర్ రహస్యాలను దొంగిలించే ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా నిర్మాణంలో స్పీల్‌బర్గ్ ఓ ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో విజువల్ ఎఫెక్ట్స్ ..డబ్బింగ్ కోసం ఏఐ సాంకేతికతను విరివిగా వాడుతున్నప్పటికీ ఆయన మాత్రం సాంప్రదాయ పద్ధతులకే మొగ్గు చూపారు.

సినిమాలో ఎమిలీ బ్లంట్ మాట్లాడే వింత గ్రహాంతర భాషను సహజంగానే రికార్డ్ చేశారు. ఒకవేళ అది కుదరకపోయినా తానేమీ ఏఐ వైపు వెళ్లేవాడిని కాదని, జంతువుల శబ్దాలను స్లో లేదా రివర్స్ చేసి ఓల్డ్-ఫ్యాషన్ పద్ధతిలోనే ఆ వింత శబ్దాలను సృష్టించేవాడినని స్పీల్‌బర్గ్ వెల్లడించారు. ఈ చిత్రానికి స్పీల్‌బర్గ్ రెగ్యులర్ కొల్లాబరేటర్స్ అయిన జానూస్ కామిన్స్కీ సినిమాటోగ్రఫీ అందించగా.. దిగ్గజ సంగీత దర్శకుడు జాన్ విలియమ్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సమకూర్చారు. ఈసారి జాన్ విలియమ్స్ సంగీతం సినిమాను నడిపించేలా కాకుండా.. కథలోని సన్నివేశాల తీవ్రతను ప్రేక్షకుడికి సున్నితంగా తాకేలా సరికొత్త శైలిలో ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు.

దాదాపు 115 మిలియన్ల భారీ బడ్జెట్‌తో అంబ్లిన్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రాన్ని యూనివర్సల్ పిక్చర్స్ విడుదల చేస్తోంది. ఇప్పటికే పారిస్ , లండన్ నగరాల్లో ప్రీమియర్స్ ప‌డ్డాయి. దీంతో చిత్రంపై విమర్శకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రెండు దశాబ్దాలలో స్పీల్‌బర్గ్ కెరీర్‌లోనే ఇది బెస్ట్ ఫిల్మ్ అని పలువురు ప్రశంసిస్తున్నారు. అంతరిక్షం .. గ్రహాంతరవాసులపై తనకున్న ఏడు దశాబ్దాల వ్యక్తిగత ప‌రిజ్ఞానం, పరిశోధనకు ఈ సినిమా ఒక ముగింపు లాంటిదని 79 ఏళ్ల లోకనాయకుడు స్పీల్‌బర్గ్ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.