నాణ్యత కోసమా? హీరోల అతి జోక్యమా?
స్టార్ హీరోల సినిమాల విషయంలో కథా చర్చల దశలో దర్శకులు మారడం అనేది సహజమే.
By: Srikanth Kontham | 15 April 2026 9:00 AM ISTస్టార్ హీరోల సినిమాల విషయంలో కథా చర్చల దశలో దర్శకులు మారడం అనేది సహజమే. ఒక ప్రాజెక్ట్ ప్రకటించిన తర్వాత లేదా చర్చల దశలో ఉండగా దర్శకుడు తప్పుకోవడం వెనుక రకరకాల కారణాలు ఉంటాయి. దీనిని కొందరు సినిమా నాణ్యత కోసం తీసుకున్న నిర్ణయంగా భావిస్తుంటారు. మరికొందరు స్క్రిప్ట్ విష vయంలో హీరోల అతి జోక్యంగా విమర్శిస్తుంటారు. అయితే ఈ మార్పుల వెనుక ఉన్న అసలు కారణాలు ఏమై ఉంటాయి.సినిమా ప్రారంభానికి ముందే దర్శకుడు మారడం అనేది ఒక రకంగా సినిమాకు మంచిదే.
షూటింగ్ సగం పూర్తయ్యాక కథలో లోపాలతో దృష్ట్యా ఆగిపోవడం కంటే ప్రీ-ప్రొడక్షన్ దశలోనే సరిదిద్దుకోవడం ఉత్తమం. హీరో- దర్శకుడి మధ్య కథా గమనంపై ఏకాభిప్రాయం కుదరనప్పుడు బలవంతంగా ముందుకెళ్లడం వల్ల సినిమా ఫలితం దెబ్బతింటుంది. అందుకే స్క్రిప్ట్ పక్కాగా ఉండేలా చూసుకోవడం కోసం మేకర్స్ ఈ తరహా కఠిన నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇది అంతిమంగా సినిమా నాణ్యతను పెంచడానికి తోడ్పడుతుంది. అలాగే స్టార్ హీరోలు స్క్రిప్ట్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడాన్ని జోక్యం అని పిలవాలా లేక బాధ్యత అనాలా అన్నది చర్చనీయాంశమే.
నేటి కాలంలో ఒక పెద్ద సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైతే? ఆ ప్రభావం దర్శకుడి కంటే హీరో మార్కెట్ పైనే ఎక్కువగా ఉంటుంది. కోట్ల రూపాయల వ్యాపారం , వేలాది మంది అభిమానుల అంచనాలు హీరోపైనే ఉంటాయి. కాబట్టి కథలో ప్రతి అంశం పర్ఫెక్ట్‌గా ఉండాలని హీరోలు కోరుకుంటున్నారు. అయితే ఈ ప్రక్రియలో దర్శకుడి సృజనాత్మక స్వేచ్ఛకు ఆటంకం కలిగితే మాత్రం అది సినిమా సహజత్వాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది.
ప్రస్తుత పాన్-ఇండియా మార్కెట్‌లో ఒక స్టార్ హీరో సినిమా అంటే దాదాపు 300 నుండి 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో కూడుకున్న వ్యవహారం.
ఇంత భారీ పెట్టుబడి పెడుతున్నప్పుడు నిర్మాతలు కూడా హీరో అభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తారు. కథలో కమర్షియల్ హంగులు తక్కువగా ఉన్నా లేదా నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా లేకపోయినా? దర్శకుడిని మార్చడం ద్వారా ప్రాజెక్ట్‌ను సురక్షితం చేయాలని చూస్తారు. ఇది కేవలం సృజనాత్మక విభేదం మాత్రమే కాదు. వ్యాపారపరమైన భద్రతకు సంబంధించిన విషయం కూడా. కొంతమంది దర్శకులు తమ విజన్ విషయంలో మొండిగా ఉంటారు. హీరో ఇమేజ్ కోసం కథను మార్చడానికి ఇష్టప డకపోవచ్చు. అలాంటి సమయంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల దర్శకులు ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటారు. ఇలాంటివి చాలా మంది స్టార్ హీరోల విషయంలో చూసినవే. అలాగే యువ దర్శకులు స్టార్ హీరోల ఇమేజ్‌ను హ్యాండిల్ చేయడంలో ఒత్తిడికి లోనవ్వడం కూడా ఈ రకమైన మార్పులకు ఓ కారణం కావొచ్చు.
చివరిగా కథా చర్చల దశలో దర్శకులు మారడం అనేది వడపోత ప్రక్రియ లాంటిది. ఇది ఒక్కోసారి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మరికొన్ని సార్లు ప్రాజెక్ట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. హీరోలు కేవలం సూచనలు ఇచ్చే స్థాయి నుండి కథను శాసించే స్థాయికి వెళ్తే అది సృజనాత్మకతను చంపేస్తుంది. అలా కాకుండా దర్శకుడు, హీరో సమన్వయంతో నాణ్యత కోసం పని చేస్తేనే వెండితెరపై మ్యాజిక్ సాధ్యమవుతుంది. అంతిమంగా ఈ మార్పులు ప్రేక్షకులకు ఒక మంచి సినిమాను అందించాలనే ఉద్దేశంతో జరిగితే స్వాగతించదగ్గవే.
