కొందరు దర్శకులు ఎప్పటికీ గ్రహించలేనిది!
కొందరు దర్శకులు తమకు పెద్ద హీరోలు అవకాశాలు కల్పించడం లేదని వాపోతారు. తమకు చాలా ప్రతిభ ఉన్నా దానిని గుర్తించడం లేదని లేదా థియేట్రికల్ రిలీజ్ కి సహకరించడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంటారు.
By: Sivaji Kontham | 15 Nov 2025 10:13 AM ISTకొందరు దర్శకులు తమకు పెద్ద హీరోలు అవకాశాలు కల్పించడం లేదని వాపోతారు. తమకు చాలా ప్రతిభ ఉన్నా దానిని గుర్తించడం లేదని లేదా థియేట్రికల్ రిలీజ్ కి సహకరించడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. అయితే ఇలాంటి చాలా మంది గ్రహించలేని నగ్నసత్యం ఒకటి ఉంది. థియేటర్లకు జనాల్ని కుప్పలు తిప్పలుగా తీసుకురాగలిగేది యానిమల్, పుష్ప 2, కేజీఎఫ్ 2 మాత్రమేననే నగ్నసత్యాన్ని ఈ బాపతు దర్శకులు ఎప్పటికీ గ్రహించరు. కనీసం సయ్యారా, ఆషిఖి 2లాగా సంథింగ్ స్పెషల్ గా ఉండే రొమాంటిక్ లవ్ స్టోరీలను కానీ, స్త్రీ 2, ముంజ్యా లాంటి హారర్ థ్రిల్లర్లను కానీ వీళ్లు అస్సలు ప్రయత్నించరు.
అయితే రొటీన్ కి భిన్నంగా ఆలోచించే అనురాగ్ కశ్యప్ కమర్షియల్ సినిమాలతో సింక్ అవ్వడం అనేది అంత సులువు కాదు. అతడు తనకంటూ ఒక జానర్, స్టైల్ ఉంటుందని గత చిత్రాలతో నిరూపించాడు. అతడు సందీప్ వంగా యానిమల్ చిత్రాన్ని చూసి మొదట విమర్శించినా, ఆ తర్వాత కమర్షియల్ సినిమా ఫార్మాట్ విషయంలో ఈ చిత్రాన్ని కేస్ స్టడీగా భావించాడంటే, అనురాగ్ వీక్ పాయింట్ ఏంటో గ్రహించగలం. నిజానికి అనురాగ్ ఆర్జీవీ స్కూల్ విద్యార్థి. అతడి పంథా తన గురువును ప్రతిబింబిస్తుంది. అది కల్ట్ క్లాసిక్ రూపాన్ని సంతరించుకుంటుంది. అందువల్ల ఎప్పటికీ కమర్షియల్ ఫార్మాట్ కు భిన్నంగా కనిపిస్తుంది.
అయితే ఇలాంటి దర్శకుడి నుంచి ఒక సినిమా దాని రూపు రేఖల్ని మార్చుకుని కమర్షియల్ పంథాలోకి మారిపోవడం అనేది అంత సులువు కాదు. అతడు క్లాసీ మేకింగ్ స్టైల్ ని అనుకరిస్తే అది కమర్షియల్ సినిమాగా మారదు. అతడు గతంలో దర్శకత్వం వహించిన `నిషాంచి` క్రిటికల్ గా ప్రశంసలు దక్కించుకున్నా థియేట్రికల్ గా అంతంత మాత్రంగానే ఆడింది. అణచివేత, హింస, విముక్తి చుట్టూ ఆసక్తికర కథనాన్ని అల్లుకున్న అనురాగ్ ఎంపికను ప్రశంసించారు కానీ ఎవరూ థియేటర్లకు రాలేదు. పైగా ఈ సినిమాకి 3 గంటల రన్ టైమ్ విసుగును తెప్పించిందనే టాక్ ఉంది. అయితే బాక్సాఫీస్ తో సంబంధం లేకుండా ఈ సినిమాని ప్రశంసించే వర్గం లేకపోలేదు. అందుకే చాలా విషయాలను విశ్లేషించుకున్న తర్వాత నిశాంచి సీక్వెల్ నిశాంచి 2ని ఓటీటీలో విడుదల చేసారు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రంలో థాక్రేల కుటుంబం నుంచి ఐశ్వరీ థాక్రే నటుడిగా పని చేసారు. మోనికా పన్వర్, వేదికా పింటో, మహమ్మద్ జీషన్ అయ్యూబ్ కీలక పాత్రల్లో నటించారు.
వివాదంలో చిక్కుకుని...!
బాలీవుడ్ లో ఎంతో ట్యాలెంట్ ఉండీ వెనకబడిపోయిన దర్శకులలో అనురాగ్ కశ్యప్ ఒకరు. అతడు బాలీవుడ్ బడా హీరోలతో సింక్ కాలేకపోయాడు. అక్కడ పార్టీ కల్చర్ కూడా అతడికి ఎక్కలేదు. ఇతరులకు అతడు భిన్నమైనవాడు కావడంతో ఎవరితోను కలిసే రకం కాదన్న టాక్ ఉంది. ఇక సల్మాన్ ఖాన్ తో, అతడి కుటుంబంతో వైరం పెంచుకున్న సోదరుడు అభినవ్ కశ్యప్ కారణంగా అనురాగ్ చాలా డిస్ట్రబ్ అయ్యాడు. అభినవ్ బహిరంగంగా సల్మాన్ ఖాన్ తో వాగ్వాదానికి దిగుతాడు. అతడితో ఘర్షణ పడుతుంటాడు. ఇది నిజంగా కశ్యప్ బ్రదర్స్ కి ఇబ్బందిని కలిగించే అంశం. కారణం ఏదైనా ఇటీవల అనురాగ్ కశ్యప్ ఉత్తరాది పరిశ్రమను వదిలేసి దక్షిణాదికి షిఫ్టయ్యాడు. ఇక్కడ కెరీర్ పరంగా బిజీగా మారాడు.
