Begin typing your search above and press return to search.

దేవుడిని క్రైమ్‌లో పార్ట‌న‌ర్‌ని చేసేస్తారు: ద‌ర్శ‌కుడు తేజ‌

ప్ర‌తి విష‌యాన్ని కమ్యూనిస్టులా సూటిగా మాట్లాడే ద‌ర్శ‌కుడు తేజకు కూడా దేవుడు అంటే న‌మ్మ‌కం ఉందా? అంటే... ఉంది అంటూనే ఆయ‌న చెప్పిన థియ‌రీ ఆస‌క్తిని క‌లిగించింది.

By:  Sivaji Kontham   |   23 Dec 2025 1:08 PM IST
దేవుడిని క్రైమ్‌లో పార్ట‌న‌ర్‌ని చేసేస్తారు: ద‌ర్శ‌కుడు తేజ‌
X

సంఘంలో నాస్తికులు ఉన్నారు. ఆస్తికులు ఉన్నారు. నాస్తికులు దేవుడిని న‌మ్మ‌రు. క‌మ్యూనిస్టుల్లా ఉంటారు. ఆస్తికులు దేవుడిని ప్రార్థిస్తూ, దేవుడు ఉన్నాడ‌ని న‌మ్ముతూ, త‌ప్పులు పాపాలు చేసేందుకు భ‌య‌ప‌డుతూ ఉంటారు. అయితే నిజమైన భ‌క్తులు మాత్ర‌మే ఇలా చేయ‌గ‌ల‌రు. ఫేక్ భ‌క్తులు వీట‌న్నిటికీ భిన్నంగా ఉంటారు. ఈ కేట‌గిరీ భ‌క్తులు క్రైమ్ కి వెన‌కాడ‌రు. అయితే, ప్ర‌తి విష‌యాన్ని కమ్యూనిస్టులా సూటిగా మాట్లాడే ద‌ర్శ‌కుడు తేజకు కూడా దేవుడు అంటే న‌మ్మ‌కం ఉందా? అంటే... ఉంది అంటూనే ఆయ‌న చెప్పిన థియ‌రీ ఆస‌క్తిని క‌లిగించింది.

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప్ర‌భుతో తాజా ఇంట‌ర్వ్యూలో దేవుడిపై న‌మ్మ‌కం గురించి దర్శ‌కుడు తేజ చెప్పిన మాట‌లు ఆస‌క్తిని క‌లిగించాయి. ఆయ‌న మాట‌ల్లో నిజాయితీ ప్ర‌తిధ్వ‌నించింది. దేవుడితో మ‌నం ఎలా ఉండాలో ఆయ‌న విఫులంగా చెప్పిన విష‌యాలు ఆక‌ట్టుకున్నాయి.

దైవ భ‌క్తి ఉందా మీకు? అని జ‌ర్న‌లిస్ట్ ప్ర‌భు నేరుగా తేజ‌ను ప్ర‌శ్నించారు. త‌న‌కు భ‌క్తి లేదు అంటూనే దేవుడు ఉన్నాడ‌ని అంగీక‌రించారు.. ``దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడు అంటాను. లేడు అంటే లేడు అంటాను.. కానీ వాదించ‌ను.. మీర‌నుకున్న దేవుడు వేరు.. నేను అనుకునే దేవుడు వేరు. మీ దేవుడు లంచాల‌కు ప‌డ‌తాడు. నా దేవుడు లంచాల‌కు ప‌డ‌డు. అంద‌రూ అనుకుంటారు.. దేవుడిని మాయ చేయొచ్చ‌ని.. కానీ నేను అలా అనుకోను. దేవుడు మాయ‌ల‌కు ప‌డ‌డు`` అని అన్నారు.

మీరు మామూలుగా ఒక ప‌ని అవ్వాల‌నుకోండి.. ఒక రాజ‌కీయ నాయ‌కుడు లేదా అధికారి వ‌ద్ద‌కు వెళ్లిన‌ప్పుడు స‌ర్ మీరు ఇదీ అదీ అని పొగిడేస్తారు. మీ ష‌ర్ట్ చాలా బావుంది అని మీసం అలా ఉంది ఇలా ఉంది అని పొగిడేస్తారు.. లేదా స్వీట్ ఇస్తారు. ఇవ‌న్నీ వ‌ర్క‌వుట్ కాక‌పోతే ఒక ప్యాకెట్ (డ‌బ్బు) ఇచ్చేసి ప‌ని పూర్త‌యేలా చేయ‌మ‌ని అడుగుతారు.

దేవుడి విష‌యంలోను ఇంతే. ప్ర‌జ‌లు దేవుడి వ‌ద్ద‌కు వెళ‌తారు. ఏ మ‌తస్తులు అయినా చివ‌రిగా దేవుడిని పొగుడుతారు. యు ఆర్ ది గ్రేటెస్ట్.. అలోలియా.. గాడ్ ఈజ్ ది గ్రేటెస్ట్ అని అంటారు. అన్ని మ‌తాల్లోను దేవుడిని పొగుడుతారు. చాదర్ క‌ప్పుతారు లేదా స్వీట్ ప్యాకెట్ పెడ‌తారు. మ‌నం మినిస్ట‌ర్ కి దండేస్తాం క‌దా.. అలాగే దేవుడికి కూడా పువ్వుల‌తో దండ వేస్తారు. చివరికి దేవుడా ప‌ది కోట్లు లాభం ఇవ్వు.. కోటి నీ హుండీలో వేస్తాన‌ని మొక్కుతారు.. ఆయ‌న‌ను కూడా మ‌న క్రైమ్‌లో భాగం చేసేస్తారు.

మ‌నం వేసే ల‌డ్డూల‌కు హుండీలో వేసే కోటి రూపాయ‌ల‌కు దేవుడు ప‌డ‌తాడా? నువ్వు దేవుడిని చేరుకోవాలంటే దేవుడిలా స‌త్ప్ర‌వ‌ర్త‌న ఉండాలి. అన్నీ అబ‌ద్ధాలాడుతారు.. ఫ్రాడ్స్ చేస్తారు. శ‌నివారం తిరుప‌తికి వెళ్లి హుండీలో డ‌బ్బు వేసేస్తే పాపం పోయిన‌ట్టేనా? అబ్బ‌బ్బా..! దేవుడు మ‌రీ అంత అమాయ‌కుడా. నా భావ‌న ఏమిటి అంటే దేవుడు అన్ని చోట్లా ఉన్నాడు. అంద‌రినీ చూస్తుంటాడు. మ‌నం చేస్తున్న ప్ర‌తి త‌ప్పును దేవుడు చూస్తాడు. క‌రెక్ట్ గా ఉంటే .. మంచి ఆలోచ‌న‌లు ఉంటే.. దేవుడు మీతో ఉంటాడు..!! అని తేజ విశ్లేషించారు.