లక్ష్యం డైరెక్టర్.. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా..
మాధవి క్రియేషన్స్ పతాకంపై మహాంకాళి నాగరాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన 2డీ మోషన్ టీజర్‌ను విడుదల చేశారు.
By: M Prashanth | 27 Aug 2026 3:31 PM ISTదర్శకుడు శ్రీవాస్ ఈసారి కాస్త డిఫరెంట్ కథతో వస్తున్నాడు. ఆయన కొత్త సినిమాకు ‘ఫినిక్స్ రాజా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మాధవి క్రియేషన్స్ పతాకంపై మహాంకాళి నాగరాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన 2డీ మోషన్ టీజర్‌ను విడుదల చేశారు. అరిగపూడి సుమిత్ కుమార్, శైలేష్ భాంబురే, శ్యామ్ బోడపాటి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
టీజర్ మొదలైన దగ్గరి నుంచే కథ ఏ నేపథ్యంలో సాగుతుందో చెప్పేశారు. బయటకు ప్రశాంతంగా కనిపించే ప్రపంచం వెనుక కనిపించని యుద్ధం జరుగుతోందని వాయిస్ ఓవర్‌తో కథలోకి తీసుకెళ్లారు. డ్రగ్ మాఫియా, కార్పొరేట్ వ్యవస్థ, రాజకీయ అధికారం అనే మూడు శక్తులు సమాజంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇందులో చూపించారు.
ముఖ్యంగా జెన్ జీ యువత భవిష్యత్తును ఈ కథలో కీలకంగా తీసుకున్నారు. డబ్బు, అధికారం కోసం కొన్ని శక్తులు కొత్త తరాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. వాటికి ఎదురుగా ఒక వ్యక్తి నిలబడతాడు. అతని పోరాటానికి న్యాయ వ్యవస్థతో పాటు కొందరు నిజాయితీపరులు అండగా ఉండేలా కథను సిద్ధం చేసినట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది.
‘ఫినిక్స్ రాజా’ అనే టైటిల్ వెనుక ఉన్న విషయం కూడా ఇదే. వ్యవస్థ కారణంగా పూర్తిగా నాశనమైన వ్యక్తి అక్కడితో ఆగిపోడు. బూడిద నుంచి మళ్లీ పుట్టే ఫినిక్స్ పక్షిలా తిరిగి నిలబడతాడు. అక్కడి నుంచి తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకునే ప్రయాణం కథలో ప్రధానంగా ఉండబోతోంది. ‘జీరో టు ఎంపైర్’, ‘డిస్ట్రాయ్డ్ బై సిస్టమ్.. రీబార్న్ బై హిమ్‌సెల్ఫ్’ అనే లైన్స్ నీ కూడా హైలెట్ చేశారు.
విజువల్స్‌లో సిటీ, ఖరీదైన కార్లు, మధ్యలో సూట్‌లో నిలబడిన ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతని వెనుక భారీ ఫినిక్స్ పక్షిని చూపించారు. అయితే ఆ వ్యక్తి ముఖాన్ని మాత్రం బయటపెట్టలేదు. సినిమాలో ప్రధాన పాత్రలో ఎవరు నటిస్తున్నారు, హీరోయిన్ ఎవరు అనే వివరాలను కూడా మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ లాంటి కమర్షియల్ సినిమాలు చేసిన శ్రీవాస్ ఈసారి డ్రగ్స్, కార్పొరేట్ శక్తులు, రాజకీయాలను కలిపి పెద్ద కథను ఎంచుకున్నట్లు ఉంది. ప్రస్తుతానికి కథ నేపథ్యాన్ని పరిచయం చేసిన చిత్ర బృందం, హీరోను ఎప్పుడు బయటకు తీసుకొస్తుందన్నది చూడాలి.
