ఆ డైరెక్టర్ కు ఇదే ఆఖరి అవకాశం
ధనుష్ కెరీర్‌ను పరిశీలిస్తే, ఆయనెప్పుడూ సేఫ్ గేమ్ ఆడే హీరో కాదు. కొత్త డైరెక్టర్లు, ప్రయోగాత్మక కథలు, విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 6 Jun 2026 5:00 PM ISTతమిళ సినీ పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన వార్త ఏదైనా ఉందంటే అది డైరెక్టర్ శివ, హీరో ధనుష్ కాంబినేషన్ గురించే. రీసెంట్ టైమ్ లో భారీ అంచనాల మధ్య విడుదలై ఘోర పరాజయాన్ని చవిచూసిన కంగువ తర్వాత డైరెక్టర్ శివ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు అజిత్‌తో వరుస బ్లాక్‌బస్టర్లు అందించి స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన శివకు, అన్నాత్తే మరియు కంగువ సినిమాల ఫలితాలు గట్టి ఎదురుదెబ్బగా మారాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కంగువ కోలీవుడ్ హిస్టరీలోనే అత్యంత నిరాశపరిచిన సినిమాల్లో ఒకటిగా నిలవడంతో, శివకు మళ్లీ స్టార్ హీరోల అవకాశాలు రావడం కష్టమేననే అభిప్రాయం ఇండస్ట్రీలో బలంగా వినిపించింది. అలాంటి టైమ్ లో ధనుష్ ఆయనకు అవకాశం ఇవ్వడానికి సిద్ధమయ్యారనే వార్త కోలీవుడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ధనుష్ కెరీర్‌ను పరిశీలిస్తే, ఆయనెప్పుడూ సేఫ్ గేమ్ ఆడే హీరో కాదు. కొత్త డైరెక్టర్లు, ప్రయోగాత్మక కథలు, విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే గత కొంతకాలంగా ఆయన చేసిన కొన్ని ఎక్స్‌పెరిమెంటల్ సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇటీవల వచ్చిన సినిమాల ఫలితాలు కూడా ఫ్యాన్స్ ను పూర్తిగా సంతృప్తి పరచలేకపోయాయి. ఈ నేపథ్యంలో ధనుష్ తన కెరీర్‌లో కొత్త మలుపు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. క్లాస్ ఇమేజ్‌తో పాటు మాస్ ఆడియన్స్‌ను కూడా బలంగా టార్గెట్ చేయాలనే ఆలోచనలో ధనుష్ ఉన్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అదే కారణంగా ఊర మాస్ సినిమాలకు పెట్టింది పేరైన శివ కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కాంబినేషన్ వాస్తవ రూపం దాల్చితే, ధనుష్ కెరీర్‌లో ఇది అత్యంత ఆసక్తికరమైన మాస్ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఉంది.
అయితే ఈ ప్రాజెక్ట్‌లో శివపై భారీ ప్రెజర్ ఉండబోతోంది. ఎందుకంటే ఇది కేవలం మరో సినిమా మాత్రమే కాదు, ఆయన ఫ్యూచర్ కెరీర్ ను డిసైడ్ చేసే కీలక పరీక్షగా మారే అవకాశం ఉంది. కంగువ ఫ్లాప్ తర్వాత శివపై నమ్మకం పెట్టుకున్న హీరోలు చాలా తక్కువ. గతంలో అజిత్ పలుమార్లు అవకాశాలు ఇచ్చి ఆయన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లినట్లే, ఇప్పుడు ధనుష్ కూడా అదే పాత్ర పోషిస్తున్నారనే చర్చ నడుస్తోంది. కానీ ఈసారి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఒకవేళ ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోతే, శివకు మళ్లీ పెద్ద హీరోలతో పని చేసే అవకాశం దొరకడం మరింత కష్టమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే ఈ సినిమాను శివ కెరీర్‌లో డూ ఆర్ డై ప్రాజెక్ట్‌గా చాలామంది విశ్లేషిస్తున్నారు.
మరోవైపు సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్‌పై మిక్డ్స్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. కొందరు అభిమానులు ధనుష్ తీసుకుంటున్న ఈ డెసిషన్ ను పెద్ద రిస్క్‌గా అభివర్ణిస్తుండగా, మరికొందరు మాత్రం శివలో ఇంకా మంచి మాస్ డైరెక్టర్ ఉన్నాడని, సరైన హీరో దొరికితే మళ్లీ బ్లాక్‌బస్టర్ ఇవ్వగలడని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు అందరి దృష్టి ఈ కాంబినేషన్‌పై పడింది. ధనుష్ మాస్ ఇమేజ్ కోసం తీసుకున్న ఈ డేరింగ్ డెసిషన్ సక్సెస్ అవుతుందా? లేక శివకు ఇది చివరి అవకాశంగానే మిగిలిపోతుందా? అన్న ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో తేలనుంది.
