ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మారుతి క్షమాపణలు.. ఆ గొడవకు ఫుల్ స్టాప్!
అయితే ఈ వివాదం ముదిరకముందే దర్శకుడు రియలైజ్ అయి వెంటనే స్పందించారు.
By: M Prashanth | 24 Nov 2025 12:10 PM ISTచిన్న మాట చిలికి చిలికి గాలివానలా మారుతుందంటే ఇదేనేమో. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. ఒక స్టార్ హీరో ఫ్యాన్స్, డైరెక్టర్ మారుతిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అసలు ఆ డైరెక్టర్ అలా ఎందుకు అన్నాడు? ఎవరిని ఉద్దేశించి అన్నాడు? అనే చర్చ జోరుగా సాగింది. అయితే ఈ వివాదం ముదిరకముందే దర్శకుడు రియలైజ్ అయి వెంటనే స్పందించారు.
వివరాల్లోకి వెళ్తే.. 'ది రాజా సాబ్' ఈవెంట్ లో డైరెక్టర్ మారుతి మాట్లాడిన కొన్ని మాటలు ఎన్టీఆర్ అభిమానులను నొప్పించాయి. "నేను కాలర్ ఎగరేసుకోమని చెప్పను.. ప్రభాస్ కటౌట్ కు అది చాలా చిన్న మాట" అని మారుతి అనడం, అది పరోక్షంగా ఎన్టీఆర్ ను టార్గెట్ చేసినట్లు ఉందని ఫ్యాన్స్ భావించారు. ఎందుకంటే ఈమధ్య కాలంలో ఎన్టీఆర్ తరచుగా "కాలర్ ఎగరేసుకునే సినిమా ఇస్తా" అని అంటున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా మారుతిపై ఫ్యాన్స్ విమర్శల వర్షం కురిపించారు.
పరిస్థితిని గమనించిన మారుతి, లేటెస్ట్ గా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. "నేను ఎవరినీ కించపరచాలనో, ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనో ఆ మాటలు అనలేదు. ఫ్లోలో వచ్చిన మాటలే తప్ప, ఉద్దేశపూర్వకంగా అన్నవి కావు" అని వివరణ ఇచ్చారు. అంతేకాదు, జరిగిన దానికి ఎవరైనా హర్ట్ అయి ఉంటే వారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని చాలా హుందాగా స్పందించారు.
ఎన్టీఆర్ గారంటే తనకు ఎంతో గౌరవమని, ఆయన ఫ్యాన్స్ సినిమాపై చూపించే ప్రేమని తాను ఎప్పుడూ వేల్యూ చేస్తానని మారుతి తన ట్వీట్ లో పేర్కొన్నారు. దయచేసి తన మాటలను వేరే విధంగా అర్థం చేసుకోవద్దని, కంపారిజన్ లాగా చూడొద్దని కోరారు. పూర్తి నిజాయితీతో, మనసులోంచి ఈ మాటలు చెబుతున్నానని, పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
నిజానికి మారుతికి, ఎన్టీఆర్ కు మధ్య ఎప్పటి నుంచో మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరూ బయట కలిసినప్పుడు చాలా ఆప్యాయంగా పలకరించుకుంటారు. అలాంటిది మారుతి కావాలని ఎన్టీఆర్ పై సెటైర్లు వేసే ఛాన్సే లేదు. కేవలం ఈవెంట్ హడావిడిలో చెప్పిన మాటలను నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకోవడంతో ఈ గొడవ అనవసరంగా పెద్దదైంది.
ఏది ఏమైనా, వివాదం పెద్దది కాకముందే స్పందించి, బహిరంగంగా క్షమాపణలు చెప్పడం మారుతి మంచి మనసును చాటుకుంది. స్టార్ హీరోల అభిమానుల మధ్య గొడవలు రాకుండా ఆయన తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ క్లారిటీతో ఈ 'కాలర్' వివాదానికి తెరపడినట్లే అని భావించవచ్చు. ప్రస్తుతం మారుతి ఫోకస్ అంతా సంక్రాంతికి రాబోతున్న 'రాజా సాబ్' మీదే ఉంది.
