క్రిష్ మార్క్ మళ్లీ మిస్ అయినట్లు ఉందే! ఏం జరుగుతోంది?
టాలీవుడ్ లో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడికి ప్రత్యేక క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. భావోద్వేగాలను ప్రదర్శించడంలో, ఎమోషనల్ డ్రామాతో మూవీ తీయడంలో క్రిష్ దిట్ట అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
By: M Prashanth | 5 Sept 2025 10:13 PM ISTటాలీవుడ్ లో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడికి ప్రత్యేక క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. భావోద్వేగాలను ప్రదర్శించడంలో, ఎమోషనల్ డ్రామాతో మూవీ తీయడంలో క్రిష్ దిట్ట అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. గమ్యం మూవీతో డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. డెబ్యూ సినిమాతో అందరినీ మెప్పించారు. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు.
బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన ఆయన.. పలు అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె వంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు. మంచి విజయాలు సొంతం చేసుకున్నారు. కానీ కొన్నేళ్లుగా క్రిష్ హిట్ ట్రాక్ లో లేరు. చివరగా 2017లో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో విజయం సాధించారు.
ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క హిట్ ను కూడా సొంతం చేసుకోలేకపోయారు. గౌతమీపుత్ర శాతకర్ణి మూవీ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ తీసిన క్రిష్.. వరుస డిజాస్టర్లు మూటగట్టుకున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు టైటిల్స్ తో వచ్చిన రెండు సినిమాలు కూడా నిరాశపరిచాయి. అదే సమయంలో మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ మూవీ స్టార్ట్ చేశారు.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటించిన ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత రీసెంట్ గా రిలీజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ నుంచి కూడా బయటకు వచ్చారు. తీరా చూస్తే ఆ రెండు సినిమాల రిజల్ట్ కూడా తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద రెండూ డిజాస్టర్లుగా మారాయి. ఇక చివరగా కొండపొలం మూవీ తీశారు క్రిష్.
ఆ సినిమాను కూడా ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. ఇప్పుడు ఘాటీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రిష్.. మళ్లీ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. రాసుకున్న కధ, క్రియేట్ చేసిన వరల్డ్ కొత్త ఫీల్ ను అద్దిందని, సినిమాను ఓ రొటీన్ రివెంజ్ డ్రామాలా మార్చేశారని నెటిజన్లు రివ్యూస్ చేస్తున్నారు. కొన్ని రోల్స్ కు ముగింపు పలకలేదని అంటున్నారు.
ఘాటీలో కూడా క్రిష్ మార్క్ మిస్ అయిందని, బలమైన ఎమోషనల్ డ్రామా లేదని కొందరు చెబుతున్నారు. ఏదేమైనా ఇప్పుడు అంతా ఊహించినట్టు హిట్ అందుకోలేకపోయారు క్రిష్. మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వాలని, మంచి స్టోరీలు రాసుకోవాలని అంతా సూచిస్తున్నారు. తన తదుపరి సినిమాతో తిరిగి పుంజుకుంటారని ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. మరి క్రిష్ నెక్స్ట్ ఏ సినిమా చేస్తారో.. ఎలాంటి విజయం సాధిస్తారో వేచి చూడాలి.
