యువ దర్శకుడు కిరణ్ కుమార్ కన్నుమూత.. హఠాన్మరణానికి కారణం?
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి పేరు దక్కించుకున్న యువ దర్శకుడు కిరణ్ కుమార్ కన్నుమూశారు.
By: Madhu Reddy | 17 Dec 2025 3:29 PM ISTసినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా అగాధంలోకి నెట్టివేస్తున్నాయి. ముఖ్యంగా యంగ్ హీరోలు, దర్శకులు హఠాన్మరణం పొందడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా ఇండస్ట్రీ ఈ షాక్ నుంచి తేరుకోలేకపోతోంది. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి పేరు దక్కించుకున్న యువ దర్శకుడు కిరణ్ కుమార్ కన్నుమూశారు. ఆయన మరణం ఇండస్ట్రీని ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచేసింది. ఆయన మరణానికి గల కారణం ఏంటి అంటూ అందరూ ఆరా తీస్తున్నారు. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
డైరెక్టర్ కిరణ్ కుమార్ ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఈయన తాజాగా దర్శకత్వం వహించిన కేజేక్యూ: కింగ్.. జాకీ.. క్వీన్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలో విడుదల కాబోతోన్న వేళ సడన్ గా కిరణ్ కుమార్ కన్నుమూయడం బాధాకరం. ప్రస్తుతం ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఆయన అకస్మాత్తుగా మరణించడానికి గల కారణం ఏమిటంటే.. కొంతకాలంగా కిరణ్ కుమార్ స్టమక్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారట. ఈ క్రమంలోనే హాస్పిటల్ లో చేరిన ఆయనకి శస్త్ర చికిత్స చేయగా.. అది విఫలం అయి.. బ్రెయిన్ డెడ్ అయ్యిందని సమాచారం. అయితే దీనిపై కుటుంబ సభ్యుల నుంచీ స్పష్టత రావాల్సి ఉంది.
2010లో నాగార్జున హీరోగా వచ్చిన కేడీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యారు. నాగార్జున ఛాన్స్ ఇవ్వడం వల్లే తాను దర్శకుడిని అయ్యానని, గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే 15 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. దీనికి తోడు మూడు నెలల క్రితం మీడియా సమావేశం నిర్వహించి, ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అలాంటి ఈయన ఇప్పుడు కన్ను మూయడంతో ఇండస్ట్రీ ఒకసారి ఆశ్చర్యంలో మునిగిపోయింది.
ఇకపోతే ఈయన విజయ్ ఆంటోనీ హీరోగా వచ్చిన భద్రకాళి సినిమాలో సీబీఐ ఆఫీసర్గా కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక మరొకవైపు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న సందీప్ రెడ్డి వంగా , శ్రీకాంత్ ఓదెల వంటి దర్శకులు గతంలో కిరణ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేశారు. ఈ దర్శకుల విషయానికొస్తే.. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేశారు సందీప్ రెడ్డివంగా. అలాగే శ్రీకాంత్ ఓదెల నానితో దసరా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇలాంటి అద్భుతమైన దర్శకత్వ మెళుకువలు కిరణ్ వద్దే వీరు నేర్చుకోవడం జరిగింది.
