ఇంత మంచి సినిమాలు చేసి ఎట్టెళ్లిపోయావ్ అన్నా?
ఇప్పుడంటే అర్జున్ రెడ్డి, RX100 లాంటి బోల్డ్ ప్రేమ కథలు ఒక సెన్సేషన్. కానీ ఒకప్పుడు పెద్దగా రొమాన్స్ లేకుండానే ప్రేమంటే ఏమిటో చూపించిన దర్శకుడు కరుణాకరన్.
By: M Prashanth | 18 Oct 2025 4:00 PM ISTఇప్పుడంటే అర్జున్ రెడ్డి, RX100 లాంటి బోల్డ్ ప్రేమ కథలు ఒక సెన్సేషన్. కానీ ఒకప్పుడు పెద్దగా రొమాన్స్ లేకుండానే ప్రేమంటే ఏమిటో చూపించిన దర్శకుడు కరుణాకరన్. అతను టాలీవుడ్‌లో ప్రేమకథలకు బ్రాండ్ అంబాసిడర్. అతని దర్శకత్వంలో సినిమా వస్తుందంటే, అందులో బ్యూటిఫుల్ మ్యూజిక్, క్లీన్ రొమాన్స్, గుండెను టచ్ చేసే ఎమోషన్స్ పక్కా అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయేవారు. కానీ, ఇప్పుడు ఆ పేరు ఇండస్ట్రీలో వినిపించి చాలా కాలమైంది.
సడెన్‌గా సోషల్ మీడియాలో ఆయన పేరు ట్రెండ్ అవ్వడంతో, "అసలు కరుణాకరన్ ఏమయ్యారు?" అనే చర్చ మళ్లీ మొదలైంది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే కాదు, తెలుగు సినిమా చరిత్రలోనే ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయిన 'తొలిప్రేమ'తో కరుణాకరన్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత యువకుడు, వాసు, బాలు, హ్యాపీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి, యూత్‌ను కట్టిపడేసే ప్రేమకథలతో తనకంటూ ఒక స్పెషల్ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నారు.
అతని సినిమాల్లోని ఫీల్, మ్యూజిక్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. అయితే, ప్రతీ డైరెక్టర్ కెరీర్‌లో ఉన్నట్లే, కరుణాకరన్‌కు కూడా కొన్ని స్పీడ్ బ్రేకర్లు తగిలాయి. ఎందుకంటే.. ప్రేమంట!, చిన్నాదాన నీకోసం, చివరిగా 2018లో వచ్చిన 'తేజ్ ఐ లవ్యూ' చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా కూడా, ఆ సినిమాల్లోని ఫీల్ గుడ్ ఎలిమెంట్స్‌ను ఇష్టపడే ఆడియన్స్ ఉన్నారు. కానీ, ఆ సినిమా తర్వాత కరుణాకరన్ పేరు మళ్లీ తెరపై కనిపించలేదు.
గత ఆరేళ్లుగా ఆయన ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. మధ్యలో దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా చేయబోతున్నారని గట్టిగా టాక్ వచ్చినా, అది కూడా కార్యరూపం దాల్చలేదు. అసలు ఆయన కొత్త కథలు రాసుకుంటున్నారా? లేక, పూర్తిగా దర్శకత్వానికి దూరంగా ఉన్నారా? అనేది ఎవరికీ తెలియని ఒక మిస్టరీగా మారింది. దానికి తోడు, ఆయన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా లేకపోవడంతో, ఆయన గురించి ఎలాంటి అప్‌డేట్ లేకుండా పోయింది.
ఇప్పుడు సడెన్‌గా ఆయన పేరు ట్రెండ్ అవ్వడానికి కారణం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల ఫోటోలను పెట్టి, "ఇంత మంచి సినిమాలు చేసి ఎట్టెళ్లిపోయావ్ అన్నా?" అంటూ నెటిజన్లు తమ అభిమానాన్ని, ఆవేదనను పంచుకుంటున్నారు. ఆయనను ఒక "అండర్‌రేటెడ్ డైరెక్టర్" అంటూ కీర్తిస్తున్నారు. ఇది చూస్తుంటే, ఆయన సినిమాలను ఇప్పటికీ ఎంతలా మిస్ అవుతున్నారో అర్థమవుతోంది.
ఏదేమైనా ఈ డిజిటల్ యుగంలో, ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్‌ప్లేల హవాలో, కరుణాకరన్ మార్క్ స్వచ్ఛమైన ప్రేమకథలు కరువయ్యాయనేది నిజం. 'తొలిప్రేమ' ఫ్యాన్స్ అయితే ఆయన కమ్‌బ్యాక్ కోసం కాచేలా ఎదురుచూస్తున్నారు. మరి ఫ్యాన్స్ కోరుకుంటున్నట్లు కరుణాకరన్ ఒక సాలిడ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా, తన మ్యాజిక్‌ను ఈ జనరేషన్‌కు కూడా చూపిస్తాడా? అనేది కాలమే చెప్పాలి.
