మహేష్ చాలా డేంజరస్.. మూడు సినిమాలు చేసి తప్పు చేశా
సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఎప్పుడు ఏ వీడియో ఎందుకు వైరల్ అవుతుందో తెలియడం లేదు.
By: Sravani Lakshmi Srungarapu | 5 Jan 2026 6:00 PM ISTసోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఎప్పుడు ఏ వీడియో ఎందుకు వైరల్ అవుతుందో తెలియడం లేదు. గతంలో ఎప్పుడో వచ్చిన వీడియోలు కూడా అనుకోకుండా ఇప్పుడు ట్రెండ్ అయిన సందర్భాలెన్నో చూశాం. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు ఎలాంటి సందర్భం లేకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మహేష్ తో వరుసగా మూడు సినిమాలు
ఆ వీడియో మరెవరిదో కాదు, టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్‌ది. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు ఆడియన్స్ ను అలరించిన విషయం తెలిసిందే. కానీ గత కొన్ని సినిమాలుగా ఆయన నుంచి సరైన సినిమాలు రావడం లేదనేది ప్రత్యేకంగా చెప్పే పన్లేదు. అయితే గుణశేఖర్, సూపర్ స్టార్ మహేష్ బాబు తో వరుసగా మూడు సినిమాలు చేసిన అరుదైన డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు.
ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఒక్కడు
వీరిద్దరి కలయికలో ఒక్కడు, అర్జున్, సైనికుడు సినిమాలు రాగా, వాటిలో ఒక్కడు సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అర్జున్ మూవీ యావరేజ్ అనిపించుకోగా, సైనికుడు మాత్రం ఫ్లాపైంది. అయితే అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో మహేష్ గురించి గుణశేఖర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరలవుతున్నాయి. మహేష్ చాలా డేంజరస్ పర్సన్ అని, ఆయనతో ఒక సినిమా చేశామంటే ఆయనకు అడిక్ట్ అయిపోయి, మళ్లీ మళ్లీ ఆయనతోనే వర్క్ చేయాలనిపిస్తుందని మహేష్ గురించి గుణశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అదే నేను చేసిన పెద్ద తప్పు
అలా అడిక్ట్ అవడం వల్లే మహేష్ తో తాను వరుసగా మూడు సినిమాలు చేశానని, అదే తాను చేసిన పెద్ద తప్పని, అలా కాకుండా మధ్యలో వేరే హీరోలతో సినిమాలు చేసి ఉంటే ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక మహేష్ గురించి మాట్లాడుతూ, ఆయనెప్పుడూ తన యాక్టింగ్ తో డైరెక్టర్లకు ఛాలెంజ్ చేస్తారని, డైరెక్టర్ 100% ఇవ్వమంటే, ఆయన 200% ఇస్తారని చెప్పగా, మహేష్ గురించి గుణశేఖర్ మాట్లాడిన ఈ వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
ఇక మహేష్ బాబు విషయానికొస్తే ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వారణాసి అనే పాన్ వరల్డ్ చేస్తున్నారు. రూ.1200 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీపై వరల్డ్ వైడ్ గా భారీ బజ్ నెలకొనగా, ఆల్రెడీ మూవీ నుంచి వచ్చిన టైటిల్ గ్లింప్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుని సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది.
