కూచిపూడితో మెప్పించిన డింపుల్ హయాతి.. తిరుమలలో ప్రత్యేక ప్రదర్శన!
టాలీవుడ్ అందాల భామ డింపుల్ హయాతి తిరుమలలోని నాద నీరాజనం వేదికపై అద్భుతమైన కూచిపూడి నృత్య ప్రదర్శన చేసి భక్తులను, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
By: Madhu Reddy | 23 Sept 2026 2:22 PM ISTటాలీవుడ్ అందాల భామ డింపుల్ హయాతి తిరుమలలోని నాద నీరాజనం వేదికపై అద్భుతమైన కూచిపూడి నృత్య ప్రదర్శన చేసి భక్తులను, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఎరుపు, గోల్డ్ కలర్ సిల్క్ చీర కట్టి, సంప్రదాయ వస్త్రధారణలో భక్తిశ్రద్ధలతో ఆమె ప్రదర్శించిన కూచిపూడి నాట్యం అందరినీ మంత్రముగ్ధులను చేసింది.ఆ వీడియో సొషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ విశేషాలు చూద్దాం..
తిరుమల నాద నీరాజనం వేదికపై నృత్యం :
శ్రీవారి బ్రహ్మోత్సవాల పవిత్ర సమయంలో డింపుల్ హయాతి నాద నీరాజనం వేదికపై కూచిపూడి నాట్యం చేయడం విశేషం. సంప్రదాయబద్ధమైన నృత్య భంగిమలు, చక్కటి ముఖకవళికలతో ఆమె చేసిన ప్రదర్శన భక్తులకు కనులవిందుగా నిలిచింది. ఇక నృత్య ప్రదర్శనకు ముందు రోజు ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు.
నెటిజన్ల ఆశ్చర్యం, ప్రశంసలు :
ఇన్నాళ్లూ సినిమాల్లో గ్లామరస్ పాత్రల్లో అలరించిన డింపుల్ హయాతిలో ఈ స్థాయి సంప్రదాయ నాట్య ప్రతిభ కూడా ఉందా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఆమె డ్యాన్స్ వీడియోలు చూసిన అభిమానులు "డింపుల్ గారు చాలా అందంగా, అద్భుతంగా నాట్యం చేశారు" అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
సినిమా కెరీర్ మరియు క్రేజ్:
తెలుగు, తమిళ సినిమాల్లో నటించి మంచి నటిగా పేరు తెచ్చుకున్న డింపుల్, వరుణ్ తేజ్ నటించిన 'గద్దలకొండ గణేష్' చిత్రంలో 'జర్రా జర్రా' స్పెషల్ సాంగ్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత ఖిలాడి, రామబాణం, ఆత్రంగి రే, వీరమే వాగై సూడుమ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది.
‘ఆదర్శ కుటుంబం’తో త్వరలో ముందుకు:
ప్రస్తుతం సరైన సినిమా బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న డింపుల్ హయాతి, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో నటిస్తున్నట్టు టాక్. ఈ భారీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం అక్టోబర్ 9న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాతో ఆమెకు పెద్ద హిట్ అందుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.ఇక అంతేగాక శర్వానంద్ 38వ సినిమా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ఓ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
వెండితెరపై తన గ్లామర్, నటనతో ఆకట్టుకునే డింపుల్ హయాతి, తిరుమలలో ప్రదర్శించిన కూచిపూడి నాట్యంతో తనలోని సంప్రదాయ కళాత్మక కోణాన్ని ఆవిష్కరించారు. భక్తిభావంతో ఆమె చేసిన ఈ ప్రదర్శన ప్రతి ఒక్కరి మనసులను దోచుకోవడమే కాకుండా, ఆమె కెరీర్‌కు మరింత సానుకూలతను తీసుకువస్తుందనడంలో సందేహం లేదు.
