పవన్ తో దాసరి మూవీ.. టైటిల్ కూడా చెప్పిన డింపుల్.. కానీ!
ఈ ప్రమోషన్స్ లో భాగంగానే దాసరి నారాయణరావు చివరి కల ఏంటి అన్న విషయాన్ని కూడా ఆమె చెప్పుకొచ్చింది.
By: Madhu Reddy | 13 Jan 2026 9:09 PM IST'గద్దలకొండ గణేష్' సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి భారీ పాపులారిటీ అందుకున్న డింపుల్ హయతి.. రవితేజ 'ఖిలాడి' సినిమాలో హీరోయిన్గా నటించి తన నటనతో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మళ్లీ రవితేజతో 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది ఈ సినిమా. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న డింపుల్ హయతి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంది..ముఖ్యంగా తాను స్వర్గీయ దిగ్గజ దర్శకులు దాసరి నారాయణరావుకు మనవరాలవుతానని చెప్పిన ఈమె.. అలాగే ప్రముఖ సీనియర్ నటి ప్రభ తనకు నానమ్మ అవుతుందని, అలాగే తన కుటుంబంలో చాలామంది నటీనటులు ఉన్నారని చెప్పుకొచ్చింది.
ఈ ప్రమోషన్స్ లో భాగంగానే దాసరి నారాయణరావు చివరి కల ఏంటి అన్న విషయాన్ని కూడా ఆమె చెప్పుకొచ్చింది. డింపుల్ హయతి మాట్లాడుతూ.. "మా ఇంట్లో సినిమా వాతావరణం ఉండడంతో నేను సెల్ఫీ తీసుకున్నా.. ఆ కోణంలోనే మాట్లాడి నన్ను దాసరి తాతయ్య విశ్లేషించేవారు. ముఖ్యంగా ఆయన చుట్టూ ఎప్పుడూ జనం ఉండేవారు. ఒకరకంగా చెప్పాలి అంటే ఇండస్ట్రీ మొత్తం ఇంట్లోనే ఉండేది. ఇంటి బయట కార్లు లైన్ గా పార్కు చేసి ఉండేవి. అయితే చిన్నప్పుడు ఆయన స్థాయి ఏంటో నాకు తెలియలేదు. పెరిగి పెద్దయి ఆయనను కోల్పోయిన తర్వాత కూడా ఆయన స్థాయి నాకు తెలియలేదు. ముఖ్యంగా ఆయన చనిపోయే నాటికి కూడా నా వయసు చాలా చిన్నది. అందుకేనేమో ఆయన హోదా నాకు అర్థం కాలేదు.
అయితే ఆయన చనిపోయే ముందు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఉంది అని ఒకసారి నాతో చెప్పారు. అంతేకాదు స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారు. పైగా తన దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తో చేసే సినిమాకి కల్కి అని ఆయన టైటిల్ కూడా అనుకున్నారు. ఇక స్క్రిప్ట్ పేపర్లు ఎప్పుడూ అక్కడే ఉండడంతో ఆ స్క్రిప్ట్ మొత్తం నేను దొంగ చాటుగా చదివాను. అప్పటికి నా వయసు 15 ఏళ్లు మాత్రమే.. అయితే నాకు కూడా ఇండస్ట్రీలోకి వెళ్లాలని ఉంది అని చెప్పడంతో మొదట అంగీకరించలేదు. ఆ తర్వాత ఎప్పుడు వెళ్లాలో నేనే చెబుతాను అన్నాడు. ఆఖరికి ఒకరోజు తాతయ్య ఆరోగ్యం బాగా క్షీణించింది. ఇక నేను ఖచ్చితంగా తిరిగి వచ్చి నీతో సినిమా చేస్తానన్నారు.. కానీ అంతలోపే ఆయన స్వర్గస్తులయ్యారు అంటూ ఎమోషనల్ అయ్యింది డింపుల్ హయతి.
మొత్తానికి అయితే దాసరి నారాయణరావు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని కోరుకున్నారని, అయితే ఆ చివరి కోరిక తీరకుండానే ఆయన మరణించారని చెప్పుకొచ్చింది డింపుల్ హయతి. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక దాసరి నారాయణరావు విషయానికి వస్తే.. స్త్రీల హక్కులు, సామాజిక అంశాల చుట్టూ ఎక్కువగా సినిమాలు తీసేవారు. ముఖ్యంగా ఆయన ఏ సినిమా తీసినా కచ్చితంగా అందులో సందేశం ఉండేది. ఒక దర్శకుడిగా 150 కి పైగా చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ఇండస్ట్రీ పెద్దగా కూడా నిలిచారు.
