Begin typing your search above and press return to search.

దాసరి, నటి ప్రభ మనవరాలే డింపుల్.. అందుకే బయటకు చెప్పలేదు!

సాధారణంగా సినీ బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఇండస్ట్రీ ఎంట్రీకి మార్గం సులభం అవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే.

By:  Madhu Reddy   |   12 Jan 2026 9:32 AM IST
దాసరి, నటి ప్రభ మనవరాలే డింపుల్.. అందుకే బయటకు చెప్పలేదు!
X

సాధారణంగా సినీ బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఇండస్ట్రీ ఎంట్రీకి మార్గం సులభం అవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కొంతమంది తమకు పెద్దపెద్ద నటీనటుల సపోర్టు ఉన్నా.. బడా ఫ్యామిలీల నుండి ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నా.. ఎప్పుడూ కూడా తమ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ను ఉపయోగించుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చి సత్తా చాటే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక సక్సెస్ సాధించిన తర్వాత తాము ఎవరి వారసులమో చెప్పి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అలాంటి వారిలో డింపుల్ హయతి కూడా ఒకరు. తాజాగా రవితేజతో భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో నటిస్తోంది. ఇదివరకే ఈమె ఖిలాడి సినిమాలో రవితేజ సరసన నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే

అలాంటి ఈమె 2023లో రామబాణం అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందించలేదు. దీంతో రెండేళ్లు ఇండస్ట్రీకి గ్యాప్ తీసుకున్న డింపుల్ ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తితో జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.. ఇదివరకే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే అటు ప్రమోషనల్ కార్యక్రమాలలో కూడా చిత్ర బృందం పాల్గొంటూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న డింపుల్ హయతి.. తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.

డింపుల్ హయతి మాట్లాడుతూ.. "స్వర్గీయ దర్శకులు దాసరి నారాయణరావు నాకు తాతగారు అవుతారు. అలాగే ప్రముఖ సీనియర్ నటి ప్రభ నాకు నానమ్మ అవుతారు. అలాగే చాలామంది నటీనటులు మా ఇంటి నుండి ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇక నేను ఇండస్ట్రీలోకి వస్తానని చెప్పినప్పుడు వీరంతా కూడా అడ్డుపడ్డారు. కానీ నేను ఇండస్ట్రీలోకి రావాలని పట్టుబట్టడంతో నా కోరికను కాదనలేక నన్ను ప్రోత్సహించారు. అయితే వీరి బ్యాక్ గ్రౌండ్ ఉపయోగించుకొని.. ఇండస్ట్రీలోకి వచ్చి అవకాశాలు అందుకోవాలని నేను అనుకోలేదు. అందుకే నా బ్యాక్ గ్రౌండ్ గురించి ఎక్కడ కూడా ఎవరికీ చెప్పలేదు" అంటూ క్లారిటీ ఇచ్చింది డింపుల్ హయతి. మొత్తానికి అయితే దాసరి నారాయణరావు గారి మనవరాలు అని తెలియడంతో ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం డింపుల్ హయతికి సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

డింపుల్ హయతి విషయానికి వస్తే.. హైదరాబాద్ కి చెందిన ఈమె 2017లో గల్ఫ్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అలాగే యురేకా సినిమాలో కూడా నటించింది. గద్దలకొండ గణేష్ సినిమాలో "జర్రా జర్రా" అనే స్పెషల్ సాంగ్ చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఖిలాడి సినిమాతో హీరోయిన్గా మారి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా విషయానికి వస్తే.. ఆషికా రంగనాథ్ కూడా ఇందులో మరో హీరోయిన్గా నటిస్తోంది. రవితేజ హీరోగా వస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. రేపు థియేటర్లలోకి రానున్న ఈ సినిమాల్లో తన పాత్ర మునుపటి చిత్రాల కంటే చాలా భిన్నంగా ఉంటుందని, కచ్చితంగా ఈ సినిమా తనకు సక్సెస్ ను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది డింపుల్ హయతి.