గ్లోబల్ వేదికపై పంజాబీ గర్జన!
లాస్ ఏంజిల్స్ సిటీ కౌన్సిల్ అధికారికంగా జనవరి 6 2027ను `దిల్జిత్ దోసాంజ్ డే` గా ప్రకటిస్తూ పౌర తీర్మానాన్ని ఆమోదించింది.
By: Srikanth Kontham | 21 Jun 2026 9:43 AM ISTఒకప్పుడు కేవలం నిర్దిష్ట ప్రాంతాలకే పరిమితమైన కళాకారులు ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై ప్రతిభతో సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో భారతీయ పంజాబీ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ఆయన గౌరవార్థం ఓ ప్రత్యేకమైన నిర్ణయాన్ని ప్రకటించి భారతీయ అభిమానులను ఆనందంలో ముంచెత్తారు.లాస్ ఏంజిల్స్ సిటీ కౌన్సిల్ అధికారికంగా జనవరి 6 2027ను `దిల్జిత్ దోసాంజ్ డే` గా ప్రకటిస్తూ పౌర తీర్మానాన్ని ఆమోదించింది.
కౌన్సిల్ సభ్యురాలు మోనికా రోడ్రిగ్జ్ ప్రవేశపెట్టిన తీర్మానం ద్వారా దిల్జిత్ దోసాంజ్ ప్రపంచ వ్యాప్తంగా పంజాబీ సంగీతాన్ని విస్తరింపజేయడంలో.. అమెరికా ప్రధాన సంస్కృతిలో దక్షిణాసియా ప్రాతినిధ్యాన్ని పెంపొం దించడంలో చేసిన కృషిని కొనియాడారు. అంతర్జాతీయంగా భారతీయ ప్రాంతీయ కళాకారుడికి ఇలాంటి గౌరవం దక్కడం అత్యంత అరుదైన విషయం. స్థానిక వేదికల నుంచి ప్రయాణాన్ని ప్రారంభించిన దిల్జిత్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కోచెల్లా మ్యూజిక్ ఫెస్టివల్‌తో పాటు క్రిప్టో.కామ్ అరేనా వంటి అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగారు.
ఆయన నిర్వహించిన రికార్డు స్థాయి `దిల్-లుమినాటి` టూర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ ఘనత ఒక కళాకారుడికి దక్కిన వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు. పంజాబీ సంస్కృతి .. కళలకు ప్రపంచవ్యాప్తంగా లభించిన గొప్ప గుర్తింపుగా చెప్పొచ్చు. ఈ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాన్ని అందుకునే సమయంలో దిల్జిత్ దోసాంజ్ భావోద్వేగానికి గురయ్యారు. తెల్లటి కుర్తా, గులాబీ రంగు సల్వార్ , తన సాంప్రదాయక పంజాబీ పగడీ ధరించి వేడుకకు హాజరయ్యారు. ప్రదానోత్సవం అనంంతరం తనకు లభించిన గౌరవానికి చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు.
సంగీతానికి -కళలకు భాషా సరిహద్దులు లేవని దిల్జిత్ సాధించిన ఈ అంతర్జాతీయ మైలురాయి మరోసారి నిరూపించింది. పాశ్చాత్య దేశాలలో దక్షిణాసియా సంస్కృతిని, భారతీయ కళాకారుల ప్రతిభను మరింత ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి ఇలాంటి గౌరవాలు ఎంతో దోహదపడతాయి. భవిష్యత్తులో మరింత మంది భారతీయ ప్రాంతీయ కళాకారులు అంతర్జాతీయ వేదికలపై ముద్ర వేయడానికి దిల్జిత్ సాధించిన ఈ విజయం గొప్ప ప్రేరణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
సంగీత రంగంలోనే కాదు దిల్జీత్ నటుడిగానూ సత్తా చాటుతున్నారు. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన `మై వాపస్ ఆవుంగా` వంటి చిత్రాలలో అద్భుత నటనతో సినిమా రంగంలోనూ విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు. విభిన్న తరాల మధ్య, విభిన్న సంస్కృతుల మధ్య ఒక వారధిలా నిలుస్తూ దిల్జీత్ ప్రయాణాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు.
