Begin typing your search above and press return to search.

టాలీవుడ్ ట్యాలెంట్‌కి ఈ పంజాబీ గాయ‌కుడే స్ఫూర్తి..!

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సోలో టికెటెడ్ లైవ్ కాన్సర్ట్ నిర్వహించిన తొలి భారతీయ కళాకారుడిగా దిల్జిత్ దోసాంజ్ చరిత్ర సృష్టించారు. నవంబర్ 21న 'ఆరా ఇండియా టూర్ 2026'లో భాగంగా జరిగిన ఈ షోకు 1.2 లక్షలకు పైగా అభిమానులు హాజరయ్యారు. పంజాబీ సంగీతం, భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ స్థాయిలో చాటిన దిల్జిత్, తదుపరి షో ముంబైలో ఉంటుందని ప్రకటించారు.

By:  Sivaji Kontham   |   25 Nov 2026 2:34 PM IST
టాలీవుడ్ ట్యాలెంట్‌కి ఈ పంజాబీ గాయ‌కుడే స్ఫూర్తి..!
X

ప్రముఖ పంజాబీ గాయకుడు, గ్లోబల్ మ్యూజిక్ సంచలనం దిల్జిత్ దోసాంజ్ అసాధాణ విజయాల గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. భార‌తీయ సంగీతంలో అత‌డు ఒక పెను సంచ‌ల‌నం. న‌టుడిగాను అసాధార‌ణ విజ‌యాల్ని సాధిస్తున్నాడు. అత‌డి విజ‌యాల గ‌మ‌నం వైపు ప్ర‌పంచం తొంగి చూస్తోంది. ఇప్పుడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సోలో టికెటెడ్ లైవ్ కాన్సర్ట్ నిర్వహించిన తొలి భారతీయ కళాకారుడిగా దిల్జీత్ చరిత్ర సృష్టించారు. 2026 నవంబర్ 21న తన `ఆరా ఇండియా టూర్ 2026`లో భాగంగా జరిగిన ఈ భారీ ఈవెంట్‌కు 1.2 లక్షలకు పైగా అభిమానులు తరలిరావడంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం పంజాబీ సంగీతం, భారతీయ సంస్కృతి, గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంబరాల‌కు వేదిక‌గా మారింది. గతంలో అరిజిత్ సింగ్, ఏఆర్ రెహమాన్ వంటి ప్రముఖులు వేరే పెద్ద వేడుకలు- కార్యక్రమాల సందర్భంగా ఇక్కడ ప్రదర్శనలు ఇచ్చినా ఒక భారతీయ సింగర్ హెడ్‌లైన్‌గా నిలిచేలా నిర్వహించిన తొలి సోలో టికెటెడ్ కచేరీ ఇదే కావడం విశేషం.

ఈ అహ్మదాబాద్ ప్రదర్శన దిల్జిత్‌కు మరింత ప్రత్యేకం కావడానికి బలమైన నేపథ్యం ఉంది. 2025 జనవరిలో బ్రిటిష్ రాక్ బ్యాండ్ `కోల్డ్‌ప్లే` ఇదే స్టేడియంలో చేసిన ప్రదర్శనను చూసిన తర్వాత.. స్టేడియం భారీతనం, వాతావరణం స్ఫూర్తితో తాను కూడా ఇక్కడ సొంత మ్యూజికల్ ప్రొడక్షన్ చేయాలని ఆయన కలగన్నారు. ఆ ఆశయమే ఇప్పుడు `ఆరా ఇండియా టూర్` ద్వారా నిజమైంది. 2026 సెప్టెంబర్‌లో లండన్‌లోని వెంబ్లీ స్టేడియం వేదికగా తన `ఆరా వరల్డ్ టూర్`లో హెడ్‌లైనర్‌గా నిలిచిన దిల్జిత్.. ఆ జోరును ఇండియా టూర్‌లోనూ కొనసాగిస్తూ అహ్మదాబాద్ తర్వాత తదుపరి పర్యటన ముంబైలో ఉంటుందని ప్రకటించారు.

అద్భుతమైన విజువల్స్.. హై-ఎనర్జీ స్టేజ్ ప్రొడక్షన్... పంజాబీ హిట్ సాంగ్స్.. అభిమానులతో ఆయన ప్రత్యేక సంభాషణ ఈ షోకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వేదికపై తన పంజాబీ గుర్తింపు.. భారతీయ మూలాల గురించి గర్వంగా మాట్లాడిన దిల్జిత్.. ప్రాంతీయ భాషలు.. సాంస్కృతిక వైవిధ్యం ఎలా గ్లోబల్ స్థాయిలో నిలబడగలవో చాటిచెప్పారు. భౌగోళిక, భాషా సరిహద్దులను దాటి భారతీయ సంగీతం విస్తరిస్తున్న తీరుకు దిల్జీత్ ప్రయాణం ఒక నిదర్శనంగా నిలిచింది.

ఇంత భారీ స్థాయిలో ప్రేక్షకులు హాజరుకావడం భారతీయ లైవ్ మ్యూజిక్- ఈవెంట్ పరిశ్రమలో పెరుగుతున్న ఆదరణను స్పష్టం చేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెగా కాన్సర్ట్‌లు కళాకారులు.. ఈవెంట్ నిర్వాహకులు.. టూరిజం .. స్థానిక ఆర్థిక వ్యవస్థలకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి. మొత్తం మీద తన సంగీత ప్రస్థానంలో పంజాబీ వారసత్వం- భారతీయ కళాకారులకు పెరుగుతున్న గ్లోబల్ గుర్తింపున‌కు సింబాలిక్‌గా నిలిచిన ఈ అహ్మదాబాద్ ఈవెంట్ హిస్ట‌రీలో నిలిచిపోతుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఇలాంటి ఈవెంట్ల విజ‌యాలు.. టాలీవుడ్ స‌హా ప్రాంతీయ భాషా గాయ‌నీగాయ‌కులు, సంగీత ద‌ర్శ‌కులు అదే స్థాయికి ఎదగేందుకు ప్ర‌య‌త్నించాల్సిన అవ‌స‌రాన్ని గుర్తు చేస్తున్నాయ‌ని కూడా ప్ర‌ధానంగా చ‌ర్చ‌ల్లోకొస్తోంది.