ఆర్టీసీ బస్సులో ఆ సినిమా ఆపేశారు.. ఎందుకీ మహిళ నిరసన!
మరోవైపు నటిపై జరిగిన దాడి కేసు తీర్పు తీవ్ర చర్చనీయాంశంగా మార్న వేళ.. మంజు వారియర్ కూడా స్పందించారు.
By: Raja Ch | 15 Dec 2025 12:10 PM ISTప్రభుత్వ బస్సులు, ప్రైవేటు బస్సుల్లో ప్రయాణిస్తున్న సమయంలో ప్రయాణికుల ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు ప్రదర్శిస్తారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ సినిమాలో నటించిన నటుడు ఓ కేసులో కీలక నిందితుడిగా ఉన్న పరిస్థితి! దానికి సంబంధించిన తీర్పులో అతడికి శిక్ష పడలేదు! ఈ నేపథ్యంలో బస్సులో అతడు నటించిన సినిమా ప్రదర్శనను ఓ మహిళ అడ్డుకోవడం, అందుకు ఆమెకు మద్దతు దొరకడం చర్చనీయాంశంగా మారింది.
అవును... నటుడు దిలీప్ నటించిన సినిమా ప్రదర్శనను వ్యతిరేకిస్తూ తొలుత ఓ మహిళ, అనంతరం తోటి ప్రయాణికులు నిరసన వ్యక్తం చేయడం కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (కే.ఎస్.ఆర్.టీ.సీ) బస్సు ప్రయాణం ఉద్రిక్తంగా మారింది. తిరువనంతపురం నుంచి ఉత్తర జిల్లాల వైపు వెళ్తున్న బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళల ఆగ్రహానికి, అభ్యంతరానికి గల కారణం కీలకంగా ఉంది.
వివరాళ్లోకి వెళ్తే... 2017లో నాటి నటి లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్ కీలక నిందితుడిగా ఉన్నారు! ఈ కేసులో నిందితులు కదులుతున్న కారులో ఆమెపై దాడి చేసి, ఆ సంఘటనను వీడియో తీశారు! ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసులో కేరళ సెషన్స్ కోర్టు ఆరుగురు దోషులకు 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే.. దిలీప్ ను నిర్ధోషిగా ప్రకటించింది.
ఆ నటుడు దిలీప్ నటించిన సినిమా "ఈ పరాక్కుమ్ తలికా" ను బస్సులో ప్రదర్శించడం ప్రారంభించినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సమయంలో లక్ష్మీ శేఖర్ అనే మహిళ.. ఈ సినిమా ప్రదర్శనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా... కే.ఎస్.ఆర్.టీ.సీ. బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు తమకు ఇష్టం లేని సినిమాలు చూడాలని బలవంతం చేయకూడదు అంటూ ఆమె స్పందించింది.
ఈ సమయంలో.. ఆమెకు ఓ వర్గం నుంచి వెంటనే మద్దతు లభించింది. ఇందులో భాగంగా... ఆమె అభ్యంతరానికి చాలా మంది మహిళా ప్రయాణికులు సానుకూలంగా స్పందించారు. అదే సమయంలో.. మరికొంతమంది మాత్రం ఆ సినిమాను ప్రదర్శించాలని పట్టుబట్టారు. దీంతో.. పరిస్థితి గమనించిన కండక్టర్ వెంటనే ఆ చిత్రాన్ని నిలిపివేశారు.
స్పందించిన మంజు వారియర్!:
మరోవైపు నటిపై జరిగిన దాడి కేసు తీర్పు తీవ్ర చర్చనీయాంశంగా మార్న వేళ.. మంజు వారియర్ కూడా స్పందించారు. ఈ సందర్భంగా... గౌరవనీయ న్యాయస్థానం పట్ల తనకు గౌరవం ఉందని.. కానీ, ఈ కేసులో బాధితురాలికి న్యాయం ఇప్పటికీ అసంపూర్తిగా ఉందని అన్నారు. ఇదే సమయంలో.. ఈ దారుణమైన చర్యకు ప్లాన్ చే సిన, దానికి వీలు కల్పించిన మనస్సు ఎవరిదైనా సరే అది ఇప్పటికీ స్వేచ్ఛగా నడుస్తోందని.. ఇది భయంకరమైనదని తెలిపారు.
