లక్షల్లో రిస్క్.. కోట్లలో లాభం.. దిల్ రాజు మాస్టర్ స్ట్రోక్!
1998 నాటి మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే అది అత్యంత భారీ లాభమని దిల్ రాజు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
By: Sravani Lakshmi Srungarapu | 27 Jun 2026 1:09 PM ISTటాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కెరీర్‌లో ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు ఉన్నప్పటికీ, ఆయన జీవితాన్ని పూర్తిగా మలుపుతిప్పిన సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన తొలిప్రేమ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఆ సినిమా గురించి ఆయన చెప్పిన ఆసక్తికర విషయాలు సినీ వర్గాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. 1998లో రిలీజైన ఈ లవ్ స్టోరీ రిలీజ్ కు ముందే దిల్ రాజు నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను రూ.72 లక్షలకు సొంతం చేసుకున్నానని, అప్పటికి డిస్ట్రిబ్యూటర్‌గా తన ప్రయాణం ప్రారంభ దశలోనే ఉందని, ఈ డెసిషన్ ఎంత పెద్ద రిస్కో అంతే పెద్ద నమ్మకంతో తీసుకున్న అడుగుగా నిలిచిందని. ఆ నిర్ణయమే తర్వాత తన కెరీర్‌కు బలమైన పునాదిని వేసిందని దిల్ రాజు తెలిపారు.
రిలీజ్ తర్వాత తొలిప్రేమ ప్రేక్షకుల నుంచి అసాధారణ ఆదరణను అందుకుందని, ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమా రూ.2.8 కోట్ల షేర్ వసూలు చేయడంతో తనకు దాదాపు రూ.2 కోట్ల లాభం వచ్చినట్లు స్వయంగా ఆయనే వెల్లడించారు. 1998 నాటి మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే అది అత్యంత భారీ లాభమని దిల్ రాజు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
తొలిప్రేమ కేవలం ఒక హిట్ సినిమా మాత్రమే కాదని, అది తన సినీ ప్రయాణానికి దారి చూపిన మైలురాయని, నిర్మాతగా ఎన్నో విజయాలు సాధించినా, తన జీవిత కథలో ఈ సినిమాకు ప్రత్యేక అధ్యాయం ఉంటుందని, అంతటి ఎమోషనల్ బాండింగ్ ఈ సినిమాతో ఏర్పడిందని చెప్పారు. ఆ కాలంలో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఐదేళ్లకు ఇచ్చేవారని గుర్తు చేసిన దిల్ రాజు, ఆ అవకాశాన్ని ఎంతో తెలివిగా వినియోగించుకున్నానని వెల్లడించారు. కెరీర్లో ఒడిదుడుకులు ఎదురైన ప్రతిసారీ తొలిప్రేమ ను రీరిలీజ్ చేసి వచ్చిన ఆదాయంతో ఆర్థికంగా కోలుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఇలా పలుమార్లు రీరిలీజ్ అయినా ప్రేక్షకుల ఆదరణ మాత్రం తగ్గలేదని ఆయన వ్యాఖ్యానించారు.
సినీ వ్యాపారంలో సరైన సమయంలో తీసుకున్న ఒక నిర్ణయం ఎంతటి విజయాన్ని అందించగలదో చెప్పడానికి ఈ సినిమా ఉదాహరణగా నిలిచిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ కెరీర్‌లో క్లాసిక్‌గా నిలిచిన ఈ సినిమా, మరోవైపు దిల్ రాజును తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాతగా ఎదిగే దిశగా నడిపించిన అత్యంత కీలక విజయంగా గుర్తింపు పొందింది.
