Begin typing your search above and press return to search.

రాజు గారు మరీ ఇంత స్లో అయ్యారేంటో..?

గేమ్‌ ఛేంజర్‌, తమ్ముడు సినిమాలు నిరాశ పరచినా సంక్రాంతికి వస్తున్నాం భారీ వసూళ్లు రాబట్టి దిల్‌ రాజుకు లాభాల వర్షం కురిపించింది.

By:  Ramesh Palla   |   3 Aug 2026 3:08 PM IST
రాజు గారు మరీ ఇంత స్లో అయ్యారేంటో..?
X

టాలీవుడ్‌లో టాప్‌ ప్రొడ్యూసర్స్‌ జాబితాలో దిల్‌ రాజు ముందు ఉంటారు అనడంలో సందేహం లేదు. తెలుగు నిర్మాతలు అంటే చాలా మంది పేర్లు వెంటనే వినిపిస్తాయి, అయితే యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌లో దిల్‌ రాజు ముందు వరుసలో ఉంటారు. ఆయన బ్యానర్‌ నుంచి సినిమా వస్తుంది అంటే మినిమం గ్యారెంటీ అన్నట్లుగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆయన కథల ఎంపిక, దర్శకులను పిక్‌ చేసుకునే తీరు, కొత్త వారిని వెతికి పట్టుకునే తీరు ఇండస్ట్రీలో మరెవ్వరికీ లేదు అనే అభిప్రాయం చాలా మందికి ఉంది. అలాంటి దిల్‌ రాజు ఈ మధ్య కాలంలో స్లో అయ్యారు అంటూ ఆయన్ను అభిమానించే వారు, ఆయన జడ్జ్‌మెంట్‌ను ఇష్టపడేవారు అంటున్నారు. గత ఏడాది దిల్‌ రాజు బ్యానర్‌ నుంచి గేమ్‌ ఛేంజర్‌, సంక్రాంతికి వస్తున్నాం, తమ్ముడు సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే. గేమ్‌ ఛేంజర్‌, తమ్ముడు సినిమాలు నిరాశ పరచినా సంక్రాంతికి వస్తున్నాం భారీ వసూళ్లు రాబట్టి దిల్‌ రాజుకు లాభాల వర్షం కురిపించింది.

సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌..

సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత మళ్లీ అనిల్‌ రావిపూడితో సినిమాను చేయాలని దిల్‌ రాజు భావించినప్పటికీ ఆయనకు ఉన్న ఇతర కమిట్‌మెంట్స్ కారణంగా కుదరలేదు. దిల్‌ రాజు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఒక్క సినిమాను విడుదల చేయలేదు. అందుకు కారణం గత ఏడాది కొత్త సినిమాలు మొదలు పెట్టక పోవడం అనే విషయం తెల్సిందే. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో షూటింగ్‌ జరుగుతున్న రౌడీ జనార్థన మూవీ మినహా మరేది కూడా సెట్స్ పై లేవని తెలుస్తోంది. వేణు దర్శకత్వంలో దేవి శ్రీ ప్రసాద్‌ హీరోగా ఎల్లమ్మ సినిమాను ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు సినిమా షూటింగ్‌ ఎప్పుడు అనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. ఇటీవల దేవి శ్రీ ప్రసాద్‌ పుట్టిన రోజు నేపథ్యంలో ఒక పోస్టర్‌ను విడుదల చేయడం జరిగింది. బర్త్‌డే సందర్భంగా ఆ పోస్టర్ వచ్చింది. కానీ దిల్‌ రాజు నుంచి మాత్రం సినిమా షూటింగ్‌ అప్‌డేట్‌ ఏమీ లేకపోవడంతో ఇండస్ట్రీ వర్గాల వారు సైతం ఆ సినిమా విషయమై క్లారిటీ లేదంటున్నారు.

విజయ్‌ దేవరకొండ రౌడీ జనార్థన...

విజయ్‌ దేవరకొండతో ప్రస్తుతం నిర్మిస్తున్న సినిమా సైతం ఈ మధ్య మొదలు పెట్టిన సినిమా అసలే కాదు. ఆయన విజయ్ దేవరకొండతో గత ఏడాది ఆరంభంలోనే ఆ సినిమా అనుకున్నాడు. అనుకున్నట్లుగానే మొదలు పెట్టాడు, కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. షూటింగ్‌ సైతం దిల్‌ రాజు గత చిత్రాల మాదిరిగా స్పీడ్‌ జరుగుతున్నట్లుగా అనిపించడం లేదు. అసలు రౌడీ జనార్ధన ఎప్పుడు వస్తుంది అనే విషయంలో ఇండస్ట్రీ వర్గాల్లోనూ క్లారిటీ ఉన్నట్లు కనిపించడం లేదు. దిల్‌ రాజు ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరీ ఇంత సైలెంట్‌గా ఉండటం ఇదే ప్రథమం అంటూ కొందరు సోషల్‌ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన మీడియా అప్పియరెన్స్‌ సైతం పెద్దగా లేకపోవడంతో ఎందుకు దిల్‌ రాజు గారు సైలెంట్‌గా ఉంటున్నారు అంటూ పలువురు పలు రకాలుగా ప్రచారం చేస్తున్నారు.

దిల్‌ రాజు పెద్ద సినిమాలతో...

దిల్‌ రాజు ఒక వైపు పెద్ద సినిమాలను నిర్మిస్తూనే మరో వైపు తన ఫ్యామిలీ మెంబర్స్‌ కూతురు, శిరీష్ కొడుకు ద్వారా చిన్న సినిమాలను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. బలగం దిల్‌ రాజు ప్లాన్‌ బి ప్రొడక్షన్‌ అనే విషయం తెల్సిందే. ఇంకా చాలా సినిమాలు ఆ బ్యానర్‌లో వచ్చే అవకాశం ఉంది. ఆ సినిమాలతో ఎక్కువ లాభాలను దిల్‌ రాజు అండ్‌ టీం ఆశిస్తున్నారట. అందుకే పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టే ఉద్దేశంతో దిల్‌ రాజు పెద్ద సినిమాల విషయంలో స్లో అయ్యి ఉంటాడా అని చాలా మంది భావిస్తున్నారు. ఏది ఏమైనా దిల్‌ రాజు వరుసగా స్టార్‌ హీరోల సినిమాలను నిర్మించాల్సిందే అని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. ఈ ఏడాదిలో దిల్‌ రాజు బ్యానర్‌ నుంచి కనీసం ఒక్క మూవీ అయినా వస్తుందా అనేది అనుమానంగానే ఉంది. వచ్చే ఏడాదిలో అయినా రాజు గారు కనీసం మూడు నాలుగు సినిమాలు విడుదల చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.