Begin typing your search above and press return to search.

దళపతి విజయ్ పాత రోజుల్లో తెలుగు స్టార్ల మాదిరి..'దిల్‌రాజు' ఆసక్తికర వ్యాఖ్యలు

హీరో డెడికేష‌న్ క‌మిట్ మెంట్ ని బ‌ట్టి షూటింగ్ వేగంగా అనుకున్న స‌మ‌యానికి పూర్త‌వుతుంది.. ఆటోమేటిక్‌గా అందరి డేట్లు తీసుకొని ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ల‌గ‌లం.

By:  Sivaji Kontham   |   29 Jun 2026 9:44 AM IST
దళపతి విజయ్ పాత రోజుల్లో తెలుగు స్టార్ల మాదిరి..దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
X

పాత రోజుల్లో టాలీవుడ్ అగ్ర హీరోలు సినిమా సెట్స్ లో చూపించిన క్రమశిక్షణ, నిబద్ధత నేటి తరం పరిశ్రమకు ఎంతగానో ఆదర్శప్రాయం. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణఒకే రోజులో మూడు షిఫ్టుల్లో వేర్వేరు సినిమాలకు వేర్వేరు కాల్షీట్లలో పనిచేసేవారనే టాక్ ఉంది. కృష్ణ ఏడాదికి కేవలం 6 లేదా 7 సినిమాలు మాత్రమే కాకుండా..అంతకంటే ఎక్కువే చేశారు. 1972వ సంవత్సరంలో ఆయన ఏకంగా 18 సినిమాలు విడుదల చేసి అరుదైన ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు. నాటి సీనియర్ హీరోలంతా తాము ఇచ్చిన కాల్షీట్ల ప్రకారం కచ్చితంగా షూటింగ్ పూర్తయ్యేలా గొప్ప డెడికేషన్ చూపించేవారు. కానీ నేటి ఆధునిక కాలంలో ఒక్కో స్టార్ హీరో సంవత్సరానికి ఒక సినిమా పూర్తి చేయడం కూడా గగనంగా మారిపోయింది. పాన్ ఇండియా ట్రెండ్ లేని రోజుల్లో సైతం మన స్టార్ హీరోలు ఒక్కో సినిమా కోసం సుదీర్ఘ సమయం తీసుకున్న సందర్భాలు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రస్తుత అగ్ర కథానాయకులలో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ పనితీరు పాత తరం తెలుగు స్టార్లను గుర్తుకు తెస్తోందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనియాడారు. విజయ్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మించిన `వారసుడు` (వారిసు) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాణ సమయంలో దళపతి విజయ్‌తో తనకు ఎదురైన అనుభవాలను దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసారు. ఒక క్రమ పద్ధతి ప్రకారం.. పక్కా ప్లానింగ్‌తో విజయ్ ఈ సినిమాను కేవలం 5 నెలల్లోనే పూర్తి చేశారని.. ఆయనతో పనిచేయడం తనకు లభించిన ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్ అని దిల్ రాజు సంతోషం వ్యక్తం చేశారు.

సినిమా కోసం విజయ్ కాల్షీట్లు ఇచ్చిన విధానం.. షూటింగ్ ప్రాసెస్ గురించి దిల్ రాజు మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. విజయ్ తో `వారసుడు` సినిమా చేసినప్పుడు అత్యంత బ్యూటిఫుల్ అంశం ఏంటంటే.. ఆయన ప్రతి నెల కచ్చితంగా 20 రోజులు షూటింగ్‌కు కేటాయించేవారని తెలిపారు. అలా వరుసగా ఐదు నెలల పాటు నెలకు 20 రోజుల చొప్పున డేట్స్ ఇచ్చారని.. పైగా ఆయన ఒకే సమయంలో కేవలం ఒకే ఒక్క సినిమాపై దృష్టి పెడతారని స్పష్టం చేశారు. నెలలో 1వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిరంతరాయంగా అందుబాటులో ఉంటూ.. ఆ సమయంలోనే సినిమా షెడ్యూల్స్ అన్ని పక్కాగా ప్లాన్ చేసుకునేలా సహకరించారని దిల్ రాజు వివరించారు.

`వారసుడు` చేసినప్పుడు విజయ్ గారితో బ్యూటిఫుల్ అనుభ‌వం ఉంది. ఆయన ప్ర‌తి నెలా 20 రోజులు మాకోసం కేటాయించేవారు. ఒక‌టో తేదీ నుంచి 20వ తేదీ వ‌ర‌కూ ఆయ‌న షెడ్యూళ్లు ఇచ్చేవారు. ఆయ‌న ఒకే స‌మ‌యంలో ఒకటే సినిమా చేస్తారు. 1 నుంచి 20, 1 నుంచి 20, 1 నుంచి 20 ఇలా ఐదు నెల‌లు కాల్షీట్లు ఇచ్చారు. ఇందులోనే నిర్మాత‌ సినిమా ప్లాన్ చేయాలి. ఇది నిజంగా వెరీ గుడ్ ప్రాసెస్. వెరీ వెరీ గుడ్ ప్రాసెస్. ఇది ఎలా ఉంటుంది అంటే పాత రోజుల్లో మ‌న హీరోలు ఇలాగే చేసేవాళ్ళు. ప్ర‌తి నెలా ఒక‌టి నుంచి 15వ తేదీ వ‌ర‌కూ, 16వ తేదీ నుంచి 30వ తేదీ వ‌ర‌కూ రెండు సినిమాల షూటింగుల‌కు క‌మిట‌య్యేవారు..అందుకే ఎక్కువ సినిమాలు చేయ‌గ‌లిగారు.

హీరో డెడికేష‌న్ క‌మిట్ మెంట్ ని బ‌ట్టి షూటింగ్ వేగంగా అనుకున్న స‌మ‌యానికి పూర్త‌వుతుంది.. ఆటోమేటిక్‌గా అందరి డేట్లు తీసుకొని ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ల‌గ‌లం. ఆరు నెల‌ల్లో ద‌ళ‌ప‌తి విజ‌య్ సినిమా ఫినిష్ చేసేసారు. అనుకున్న‌ది అనుకున్న‌ట్టు వారిసు చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది.

పాత రోజుల్లో స్టార్ హీరోలు నెలలోని మొదటి 15 రోజులు ఒక సినిమాకు, తర్వాత 15 రోజులు మరో సినిమాకు కేటాయించడం వల్లే ఎక్కువ సంఖ్యలో సినిమాలు నిర్మితమయ్యేవారని దిల్ రాజు ఈ సంద‌ర్భంగా గుర్తుచేశారు. విజయ్ కూడా అదే పద్ధతిలో ఐదు నెలల పాటు నిబద్ధతతో పనిచేయడం వల్లే ఆరు నెలల లోపే సినిమా మొత్తం పూర్తయిందని, తన కెరీర్‌లోనే ఇది ఒక బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్ అని చెప్పారు. అంతేకాకుండా.. విజయ్ తాను రాజకీయాల్లోకి వెళ్తున్న విషయాన్ని కూడా అప్పట్లోనే సెట్‌లో తమకు ముందుగానే చెప్పారని దిల్ రాజు ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ అగ్ర హీరోలతో వరుస చిత్రాలు నిర్మిస్తూనే.. అటు కోలీవుడ్, బాలీవుడ్‌లలోనూ క్రేజీ ప్రాజెక్టులతో అరడజనుకు పైగా సినిమాలతో దిల్ రాజు అత్యంత బిజీ నిర్మాతగా ఉన్న సంగ‌తి తెలిసిందే.