Begin typing your search above and press return to search.

ఓటీటీ చెబుతున్నగుణ‌పాఠం ఏంటీ?

స్టార్ హీరో న‌టించిన సినిమా అయినా.. క్రేజీ నిర్మాణ సంస్థ నిర్మించిన మూవీ అయినా స‌రే టాక్‌ని బ‌ట్టే థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు.

By:  Tupaki Entertainment Desk   |   18 Jan 2026 5:57 PM IST
ఓటీటీ చెబుతున్నగుణ‌పాఠం ఏంటీ?
X

సినిమా బిజినెస్‌, కంటెంట్ క్వాలిటీని ఓటీటీల‌కు ముందు త‌రువాత అని చూడాల్సిందే. ఎందుకంటే క‌రోనా త‌రువాత ఓటీటీల ప్ర‌భావం మొద‌లైంది. ఆ త‌రువాత క్ర‌మంలో అది తారా స్థాయికి చేరింది. అన్ని ర‌కాల కంటెంట్‌లు అందుబాటులోకి రావడంతో ప్రేక్ష‌కుల మైండ్ సెట్ మారింది. ఇంత‌కు ముందు ఫ్లాప్ సినిమా అయినా స‌రే థియేట‌ర్ల‌లో వారం నుంచి మూడు వారాల వ‌ర‌కు ఆడేది.. కానీ ఇప్పుడా ప‌రిస్థితులు లేవు. ఫ్లాప్ అంటే చాలు ప్రేక్ష‌కులు అటు వైపు చూడ‌టం లేదు. థియేట‌ర్ల‌కు రావ‌డం లేదు.

స్టార్ హీరో న‌టించిన సినిమా అయినా.. క్రేజీ నిర్మాణ సంస్థ నిర్మించిన మూవీ అయినా స‌రే టాక్‌ని బ‌ట్టే థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు. టాక్ బాగున్నా కానీ అది థియేట‌ర్ల‌కు వెళ్లి చూడ‌ద‌గ్గ సినిమానేనా?.. రేటింగ్స్ ఎలా ఉన్నాయి? డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టొచ్చా? అని ఆరాలు తీస్తున్నారు. అంతా ఓకే వెళ్లొచ్చు అని అనిపించాకే థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు. మునుప‌టిలా ఫ్యామిలీలు ఫ్యామిలీలు థియేట‌ర్ల‌కు రావ‌డం లేదు. వ‌స్తే ఖ‌ర్చు జేబుకు చిల్లు ప‌డేస్థాయిలో ఉంటుంది కాబ‌ట్టి ఎవ‌రూ ఆ సాహ‌సం చేయ‌డం లేదు.

పైగా రెండు మూడు వారాల త‌రువాత సినిమాలు ఓటీటీల్లో స్ట్రిమింగ్ అవుతాయ‌నే క్లారిటీ ఉండ‌టంతో స్టార్ సినిమా సూప‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ అంటే త‌ప్ప ప్రేక్ష‌కులు వేలు ఖ‌ర్చు పెట్టి థియేట‌ర్ల‌కొచ్చి సినిమాలు చూసే ప‌రిస్థితి లేదు. ఓటీటీలు తెచ్చిన ఈ మార్పుతో గుణ‌పాఠం నేర్చుకున్న నిర్మాత‌లు మాత్రం అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని హిట్ సినిమాల‌ని అందిస్తున్నారు. లాభాల్ని ద‌క్కించుకుంటున్నారు. కొంత మంది మాత్రం ఓటీటీ నేర్పిన గుణ‌పాఠాల్ని ప‌ట్టించుకోకుండా ఇప్ప‌టికీ క‌థ‌ని న‌మ్మ‌కుండా కేవ‌లం కాంబినేష‌న్‌ల‌ని మాత్ర‌మే న‌మ్మి సినిమాలు చేస్తున్నారు..ఫ‌లితంగా చేతులు కాల్చుకుంటున్నారు.

ఓటీటీల రంగ‌ప్ర‌వేశం త‌రువాత ఇండ‌స్ట్రీలోనూ, ప్రేక్ష‌కుల్లోనూ విప్ల‌వాత్మ‌క మార్పులు చోటు చేసుకున్నాయి. దానికి త‌గ్గ‌ట్టుగా కొంత మంది నిర్మాత‌లు జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నారు. న‌ష్టాల నుంచి త‌ప్పించుకుంటున్నారు. ఇటీవ‌ల `నారీ నారీ న‌డుమ మురారి` స‌క్సెస్ మీట్‌లో పాల్గొన్న దిల్ రాజు ఇదే విష‌యాన్ని వెల్ల‌డించడం తెలిసిందే. `త‌దుప‌రి ప్రాజెక్ట్ విష‌యంలో చాలా జాగ్ర‌త్తగా ఉండండి. ఎందుకంటే ఒక‌ప్ప‌టి ప‌రిస్థితులు ఇప్పుడు లేవు. ఓటీటీ రాక‌తో మార్పొచ్చింది. ఒక‌ప్పుడు ఓ సినిమాకు మ‌న‌కొచ్చింది ఎంత‌? ఇప్పుడొస్తుంది ఎంత‌? ..నిర్మాత‌లుగా మ‌నం జాగ్ర‌త్త ప‌డాలి` అంటూ నిర్మాత‌ల‌ని హెచ్చ‌రించారు.

అంటే ఎలాంటి సినిమాలు చేయాలి? ఏవి చేస్తే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు?.. ఎంత జాగ్ర‌త్త‌గా చేస్తే అవి హిట్ అయిన లాభాలు తెచ్చి పెడుతున్నాయి? వంటి విష‌యాల‌పై పూర్తి అవ‌గాహ‌న‌తో వ్య‌వ‌హ‌రించాల‌ని, ఇంత‌కు ముందు చేసిన‌ట్టుగా ఏది ప‌డితే అది చేస్తే ప్రేక్ష‌కులు చూసి ఆద‌రించే రోజులు పోయాయ‌ని దిల్ రాజు త‌న మాట‌ల్లో స్ప‌ష్టం చేయ‌డం మారిన ప‌రిస్థితికి అద్దంప‌డుతోంది. కాంబినేష‌న్‌ల‌ని న‌మ్మి చేతులు కాల్చుకున్న దిల్ రాజు మ‌ళ్లీ త‌న‌దైన ఫార్ములాని ఫాలో అవుతూ క‌థాబ‌ల‌మున్న సినిమాల‌కే ప‌ట్ట‌క‌ట్ట‌బోతున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. `సంక్రాంతికి వ‌స్తున్నాం` ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది. ఇప్పుడు దేవి శ్రీ‌ప్ర‌సాద్‌తో చేస్తున్న `ఎల్ల‌మ్మ‌` కూడా అదే విష‌యాన్ని మ‌రో సారి రుజువు చేయ‌డం ఖాయం. మ‌రి దిల్ రాజు చెప్పిన విష‌యాన్ని ఎంత మంది ప్రొడ్యూస‌ర్‌లు ఫాలో అవుతారో వేచి చూడాల్సిందే.