Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్ తర్వాత కూడా తగ్గని రాజుగారు!

దిల్ రాజు కెరీర్‌లో ‘గేమ్ ఛేంజర్’ చాలా పెద్ద సినిమా. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఆ సినిమా మాత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు.

By:  M Prashanth   |   24 Aug 2026 8:30 AM IST
గేమ్ ఛేంజర్ తర్వాత కూడా తగ్గని రాజుగారు!
X

దిల్ రాజు కెరీర్‌లో ‘గేమ్ ఛేంజర్’ చాలా పెద్ద సినిమా. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఆ సినిమా మాత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అంత పెద్ద సినిమా తర్వాత సహజంగా నిర్మాత కొంత కాలం భారీ బడ్జెట్ ప్రాజెక్టుల విషయంలో వెనక్కి తగ్గుతారేమో అనిపిస్తుంది. కానీ దిల్ రాజు మాత్రం మళ్లీ పెద్ద హీరోలతోనే సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఆయన సల్మాన్ ఖాన్‌తో సినిమా చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. బాలీవుడ్‌లో దిల్ రాజు చేస్తున్న సినిమాల్లో ఇదే అతి పెద్దది కానుంది. సల్మాన్ లాంటి హీరోతో సినిమా అంటే బడ్జెట్‌తో పాటు బిజినెస్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ‘గేమ్ ఛేంజర్’ తర్వాత చిన్న సినిమాలతో కొంత గ్యాప్ తీసుకోవడం కాకుండా డైరెక్ట్ గా భారీ ప్రాజెక్ట్‌లోకి వెళ్లిపోయారు.

ఇప్పుడు ఈ లిస్టులో యష్ కూడా చేరిపోయాడు. ‘టాక్సిక్’ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యష్‌తో భవిష్యత్తులో సినిమా ఉంటుందని దిల్ రాజు చెప్పారు. యష్ ప్రస్తుతం వరుస కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉండటంతో కొంత సమయం పడుతుందని కూడా క్లారిటీ ఇచ్చారు. ‘కేజీఎఫ్’ తర్వాత యష్ మార్కెట్ పూర్తిగా మారిపోయింది. అలాంటి హీరోతో సినిమా అంటే అది తెలుగు వరకే పరిమితమయ్యే ప్రాజెక్ట్ కూడా కాదు.

మరోవైపు ప్రభాస్‌తో కూడా భారీ సినిమా చేయాలని దిల్ రాజు గతంలోనే చెప్పారు. వీళ్లిద్దరికీ ‘మున్నా’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ రోజుల నుంచే స్నేహం ఉంది. కానీ ఇప్పటి ప్రభాస్ మార్కెట్‌కు అప్పటి లెక్కలకు సంబంధమే లేదు. ఆయనతో ఇప్పుడు సినిమా చేయాలంటే బడ్జెట్ కూడా వందల కోట్లలోకి వెళ్లిపోతుంది. దర్శకుడు ఎవరు, ఎప్పుడు మొదలవుతుంది అనే విషయాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.

దిల్ రాజు గతంలో పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలనే తన కోరికను కూడా చాలాసార్లు చెప్పారు. చివరకు ‘వకీల్ సాబ్’తో అది జరిగింది. ఇప్పుడు మాత్రం చెప్పే పేర్లే మరింత పెద్దగా మారుతున్నాయి. సల్మాన్ సినిమా సెట్స్‌పై ఉండగా, యష్‌తో సినిమా కన్ఫర్మ్ చేశారు. ప్రభాస్ ప్రాజెక్ట్ కూడా ఆయన ప్లాన్స్‌లో ఉంది. ‘గేమ్ ఛేంజర్’ ఫలితం తర్వాత కూడా దిల్ రాజు భారీ సినిమాల లెక్క మార్చుకోలేదనే విషయం మాత్రం ఈ లైనప్ చూస్తే అర్థమవుతోంది. ఒకేసారి సల్మాన్, ప్రభాస్, యష్ లాంటి హీరోలతో సినిమాలు ప్లాన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక వారి ప్రొడక్షన్ వచ్చే కొన్నేళ్ల వరకు పెద్ద సినిమాలతోనే నిండిపోయేలా ఉంది.