వ్యూహం మార్చిన రాజుగారు!
ఇండస్ట్రీలో స్టార్ నిర్మాత దిల్ రాజు ప్రయాణం గురించి చెప్పాల్సిన పనిలేదు. డిస్ట్రిబ్యూటర్ గా ప్రారంభమై అగ్ర దర్శకుడిగా ఎదిగిన తీరు ఎంతో స్పూర్తిదాయకం.
By: Srikanth Kontham | 23 July 2026 3:31 PM ISTఇండస్ట్రీలో స్టార్ నిర్మాత దిల్ రాజు ప్రయాణం గురించి చెప్పాల్సిన పనిలేదు. డిస్ట్రిబ్యూటర్ గా ప్రారంభమై అగ్ర దర్శకుడిగా ఎదిగిన తీరు ఎంతో స్పూర్తిదాయకం. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా? అంచలంచెలుగా ఎదిగిన విధానం ఓ అద్భుతం. సినిమా బిజినెస్ లో అరుదైన వ్యూహాలే ఇక్కడి వరకూ తీసుకొచ్చాయి. స్టోరీ జడ్జిమెంట్ లోగానీ, సినిమా తీసే విధానంలో గానీ రాజు గారు విధానాలు వినూత్నంగా ఉంటాయి. అలా ఉన్నారు కాబట్టే సక్సెస్ అయ్యారు. అయితే పాన్ ఇండియా ఆసక్తి.. స్టార్ డైరెక్టర్ శంకర్ తో సినిమా తీయాలి అనే ఆశ మాత్రం రాజు గార్ని రేసు నుంచి కాస్త వెనక్కి నెట్టిన మాట వాస్తవం.
'గేమ్ ఛేంజర్' ప్లాప్ తర్వాత రాజు గారు పూర్తిగా రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. అగ్ర హీరోల చిత్రాలకి భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టి.. సుదీర్ఘకాలం పాటు ప్రాజెక్ట్‌లను లాగడం కంటే నూతన కథాంశాలతో వచ్చే మీడియం రేంజ్ .. కంటెంట్ ఆధారిత సినిమాలే శ్రేయస్కరమని రాజుగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ మార్పులో భాగంగానే పరిశ్రమలో చిన్న, మధ్యతరహా సినిమాలకు పెద్దపీట వేయాలని నిర్ణయిం చుకున్నారా? అనిపిస్తోంది. కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా కొత్త దర్శకులు చెప్పే విభిన్నమైన కథలను నమ్ముతూ ముందుకు సాగుతున్నారు.
ఈ కొత్త వ్యూహం వెనుక రిస్క్ తగ్గించుకోవడం మాత్రమే కాకుండా మారుతున్న ప్రేక్షకుల రుచిని గౌరవించడం కూడా ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రస్తుత కాలంలో ప్రేక్షకులు స్టార్‌డమ్ కంటే బలమైన కథ, సహజమైన భావోద్వేగాలు ఉన్న సినిమాలకే బ్రహ్మరథం పడుతున్నారు. ఈ విషయాన్ని ముందే గ్రహించిన దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ ద్వారా సరికొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ వినూత్న చిత్రాలకు రూపకల్పన చేస్తున్నారు. ఈ తరహా మీడియం రేంజ్ సినిమాలు నిర్మాతలకు ఆర్థికంగా ఎంతో సురక్షితంగా నిలుస్తున్నాయి.
బాక్సాఫీస్ వద్ద స్థిరమైన వసూళ్లను సాధించడానికి దోహదపడతాయి. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించి కంటెంట్‌తో మెప్పించడం ద్వారా భారీ లాభాలను ఆర్జించవచ్చనే వ్యాపార సూత్రాన్ని రాజుగారు మళ్లీ అమలు చేస్తున్నారు. కెరీర్ ఆరంభంలో కలిసొచ్చిన `దిల్`, `ఆర్య` లాంటి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల రోజులను గుర్తుచేసే తరహా కథల వైపు రాజుగారు మళ్లుతున్నట్లు కనిపిస్తుంది. రాజుగారు తీరుతో టాలీవుడ్‌లోని యువ నటులకు, నూతన దర్శకులకు సువర్ణావకాశంగా మారుతోంది.
పెద్ద ప్రొడక్షన్ హౌస్ అండదండలు లభించడం వల్ల చిన్న సినిమాలకు తగినంత బజ్ ఏర్పడటంతో పాటు, మార్కెటింగ్ కూడా సులువవుతుంది. పరిశ్రమలో ఈ తరహా ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొనడం వల్ల మరింత మంది కొత్త ప్రయోగాలు చేసేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. అనుభవంతో కూడిన దిగ్గజ నిర్మాత ప్రయాణాన్ని మలుపు తిప్పుకోవడం టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌కు నాంది పలుకుతోంది. భారీ హంగుల వెనుక పడకుండా? అచ్చమైన కంటెంట్‌ను నమ్ముకుని దిల్ రాజు వేస్తున్న అడుగులు భవిష్యత్తులో నిర్మాణ సంస్థకు భారీ విజయాలను అందిస్తాయనడంలో సందేహం లేదు. ఆయన స్పూర్తితో మరింత మంది నిర్మాతలు యువ ప్రతిభావంతుల వైపు చూడాలంటూ నెటి జనులు కోరుతున్నారు.
