Begin typing your search above and press return to search.

దిల్ రాజు దూకుడు.. ఈసారైనా ఫలితాన్నిస్తుందా?

దిల్ రాజు టాలీవుడ్లో అగ్రశ్రేణి నిర్మాతల్లో ఒకరు మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్‌గా కూడా ఆయన టాప్ ప్లేయరే.

By:  Garuda Media   |   9 Jun 2026 8:45 AM IST
దిల్ రాజు దూకుడు.. ఈసారైనా ఫలితాన్నిస్తుందా?
X

దిల్ రాజు టాలీవుడ్లో అగ్రశ్రేణి నిర్మాతల్లో ఒకరు మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్‌గా కూడా ఆయన టాప్ ప్లేయరే. రెండు దశాబ్దాలకు పైగా నైజాం ఏరియాను ఆయన శాసిస్తూ వస్తున్నారు. ఏపీలోని వైజాగ్‌లో కూడా ఆయనకు గట్టి పట్టుంది. ఐతే ఇటీవల ఆయనకు నిర్మాతగానే కాదు.. డిస్ట్రిబ్యూటర్‌గానూ గట్టి ఎదురు దెబ్బలు తింటున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి త‌న ఆధిప‌త్యం సాగుతున్న నైజాం డిస్ట్రిబ్యూష‌న్లోకి కొత్త ప్లేయ‌ర్లు వ‌స్తుండ‌డం చూసి రాజు ఈ మధ్య కొంచెం అగ్రెసివ్‌గా సినిమాల‌ను కొన‌డం మొద‌లుపెట్టారు. కానీ ఫ్యాన్సీ రేట్లు ఇచ్చి పంపిణీ హ‌క్కులు కొని రాజు రిలీజ్ చేసిన సినిమాలు ఆయ‌న‌కు చేదు అనుభ‌వాల‌నే మిగిల్చాయి.

ఏప్రిల్లో వచ్చిన శ‌ర్వానంద్ సినిమా ‘బైక‌ర్‌’ను డిస్ట్రిబ్యూట్ చేసింది రాజే. కానీ ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా ఆశించిన వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేదు. దీంతో దిల్ రాజుకు గ‌ట్టి దెబ్బే ప‌డింది. నెల తర్వాాత ‘గాయపడ్డ సింహం’ అనే మరో చిత్రాన్ని రాజు తన బేనర్ మీద రిలీజ్ చేశారు. ‘బైకర్’ లాగే దీనికీ ఫ్యాన్సీ రేటు ఇచ్చారు. ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రాన్ని యుఎస్‌లో కూడా మరో సంస్థతో కలిసి రాజు రిలీజ్ చేయడం విశేషం. కానీ ఇది కూడా ఆయనకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. తన ఆధిపత్యాన్ని చాటాలని ఫ్యాన్సీ రేట్లు ఇచ్చి రెండు సినిమాలను రిలీజ్ చేస్తే అవి ఆయనకు షాకిచ్చాయి.

దీంతో రాజు కొంచెం దూకుడు తగ్గిస్తారనే అనుకున్నారంతా. కానీ ఆయన మళ్లీ తన అగ్రెషన్ చూపిస్తున్నారు. స్టార్ అట్రాక్షన్ లేని ‘నాగబంధం’ అనే సినిమాను నైజాం ఏరియాకు ఏకంగా రూ.9 కోట్లు పెట్టి హక్కులు తీసుకున్నారు రాజు. ఇది నిర్మాత అభిషేక్ నామా దర్శకుడిగా రూపొందించిన సినిమా. ‘పెదకాపు’తో హీరోగా పరిచయం అయిన విరాట్ కర్ణ ఇందులో లీడ్ రోల్ చేశాడు. ఈ సినిమా ఫస్ట్ టీజర్ చూసి అందరూ షాకైపోయారు. విజువల్స్ అంత అద్భుతంగా ఉన్నాయందులో. ఐతే విజువల్‌గా ఎంత బాగున్నా సరే.. స్టార్ వాల్యూ లేని సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో అన్న సందేహాలున్నాయి.

కానీ ఈ చిత్రం మీద ఎంతో నమ్మకంగా ఉన్న అభిషేక్ నామా.. డిస్ట్రిబ్యూటర్లకు సినిమా షో వేసి మరీ వారికి హక్కులు అమ్ముతున్నారు. రాజు కూడా ఇలాగే సినిమా చూసి, ఇది బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేయగలదనే నమ్మకంతో ఫ్యాన్సీ రేటుకు రైట్స్ తీసుకున్నారు. 9 కోట్ల షేర్ రాావాలంటే 15-16 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలి. అంటే సినిమాకు అదిరిపోయే టాక్, రెండో వీకెండ్ వరకు మంచి ఆక్యుపెన్సీలు వస్తేనే రికవరీ సాధ్యం. కానీ కంటెంట్ మీద నమ్మకంతో రాజు ధైర్యం చేసినట్లున్నారు. మరి ఈసారైనా ఆయన నమ్మకం నిలబడుతుందేమో చూడాలి.